Suryaa.co.in

Political News

నమ్మకద్రోహి ఎవరు?

( చాకిరేవు )

ఒక మహా నేర సామ్రాజ్యానికి మరణ శాసనం వ్రాసిన అహంకార నమ్మకద్రోహి ఎవరు?

ఒడిలో చిన్నారి మనవడిని ముద్దు చేస్తూ.. ఆ చిట్టి చేతులతో తపంచాను తడిమి చూపించాడు తాత. ఆడుకొనే బంతి అనుకొని చేతిలో తీసుకోకు. ఇంటి ఆవరణలో కనిపించిందల్లా.. అది మన వృత్తిలో వాడుతాం అని ఎన్నో గర్వమైన కథలు ఇంట్లో విన్నాడు.
తెలుసుకొనే వయసు వచ్చే సరికి తమది ఫ్యాక్షన్ కుటుంబం అంటున్నారని, అందరూ భయపడుతున్నారు అని ఆనందించడం, గర్వపడడం నేర్చుకొన్నాడు.

ఆ ముద్రను పోగొట్టుకోవడం కోసం నాన్న నడిచిన పాదయాత్రనే తనూ ఎంచుకొన్నాడు. సీబీఐ కేసుల్లో ప్రతి శుక్రవారం హాజరవుతూనే మధ్యలో నడుస్తూ, నెత్తిన చేతులు పెట్టి, బుగ్గలు తడుముతూ.. నాన్న లేని బిడ్డను, ఒక్క ఛాన్స్ అన్నాడు.

సచివాలయాన్ని ప్యాలస్‌లో పెట్టేసుకొన్నాడు. దరిదాపుల్లో ఎప్పుడూ.. 144 సెక్షన్. ప్రజాస్వామ్య వ్యవస్థనే నేరసామ్రాజ్యంగా తీర్చిదిద్దంలో భాగంగా ప్యాలస్ నుండి పరిపాలన అన్నాడు. అది చేయడానికి కూడా మనుషులను పెట్టేసి, తన అధోజగత్తులో తన్మయత్వంలో వుండే వాడు జగన్.

హెలికాప్టర్లలో తిరుగుతూ, పరదాల చాటున దాక్కున్న ఆ ‘పాలకుడు’, బటన్ నొక్కేందుకే బయట కనిపించేవాడు. ఆకాశంలో వెళుతున్నా.. పచ్చటి చెట్టుకూడా కనిపించకుండా.. కొట్టేయించాడు. ఏ సమస్యను ఎవరు మాట్లాడినా బూతులతో విరుచుకుపడడానికి ఒక మందను పెట్టుకొన్నాడు. తాను రాక ముందే జనాన్ని పథకాలు కట్ అని బెదిరించి బలవంతంగా పట్టుకురమ్మని పురమాయించేవాడు.

అత్యవసర కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా.. గేట్లు పెట్టించి, చుట్టూ కందకాలు త్రవ్వి ముసలీ ముతక, పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా హాహాకారాలు పెట్టించేవాడు. నడిరోడ్డులో చేతులు వెనక్కి విరిచి కట్టి పిచ్చోడిని చెయ్యడం నుండి టీములను పెట్టి అక్రమ కేసులను పెట్టి ఎవడిని వెయ్యాలనుకొంటే వాడిని లోపల వేసి ఆనందించాడు.

కొంతమంది బడా బాధితులు జగన్ను కలవాలి అంటే.. రమ్మని, టేబిల్ ముందు కూర్చోబెట్టి, వెనక బుక్ షెల్ఫ్ నుండి గన్ తీసి, స్టైల్‌గా తిప్పుతూ.. మనోళ్లతో మాట్లాడుకోండి అని పొదుపుగా అనేవాడు. పోర్టుల నుండి భూముల వరకు వదులుకొని, బతికి వుంటే బలుసాకు తిని బతకవచ్చు అని ప్రాణభయంతో ఆస్తులు వదులుకొన్నారు.

వచ్చీ రాంగానే.. రోజు వారీ కోట్ల కొద్దీ కట్టలు కళ్లజూడడానికి ఆలోచించాడు. రాక్షసులు, దేవతలు కలిసి చేసిన అమృతమధనంలో జగన్మోహిని రాక్షసులకు సురాపానంతో పోసింది. అందులో రాహు కేతువులు మాత్రం అమృతపు చుక్కలు జుర్రుకొని గ్రహణం పట్టినట్లు, ఆంధ్రాను ఐదేళూ విడిచిపెట్టకుండా.. తాను కూడా కేవలం ఒక్క మద్య పానంతోనే వేల కోట్లు పోగేయవచ్చు అని స్కెచ్ వేశాడు. దానికి తన డబ్బులు పెట్టుబడిగా పెట్టడం ఎందుకని, విజయసాయి రెడ్డితో అరబిందో వారికి చెప్పించి అప్పు ఇప్పించాడు. వేల కోట్లు కళ్ల జూస్తున్నాడు. కళ్లు నెత్తికి ఎక్కాయి. ఎవడూ నా వెంట్రుక పీకలేరు అనే అహంకారపు తెరలు కమ్మాయి కళ్లకు.

ఎవడినీ దగ్గరకు రానియ్యలేదు. ఆఖరికి బంధువులను, ప్రజాప్రతినిధులు సైతం, ఆయన చెప్పులు విడిచే చోట పడిగాపులు కాసినా.. ఇంటి బయట పండగ సెట్టింగు రోజే దర్శనం. వైనాట్ 175 అనే స్క్రిప్ట్ ఇచ్చింది చుట్టూ వున్న మభ్యపెట్టే ముఠా. మట్టికరిచాడు రాజకీయంగా. దశాబ్దాల ఫ్యాక్షన్ వారసత్వానికి ప్రజాస్వామ్యంతో అంటుగట్టి సకల నేరాల శాఖలతో, మహా అవినీతి వృక్షంగా మార్చాడు.

తన ఇంటికి తానే పరిచయం చేసిన గొడ్డలి కల్చర్‌తో ఇంటి సభ్యులు పోయారు, దూరం అయ్యారు. కాలానికి తగ్గ గన్ కల్చర్‌కు మారాడు. సంపాయించాడు. కానీ సంధింటి రాజకీయ వృక్షాన్ని కూకటి వ్రేళ్లతో సహా తన అహంకారంతో కూల్చుకొన్నాడు. నమ్మిన అందరినీ సామూహికంగా చట్టానికి దొరికేలా చేసి, గుడ్లప్పగించి పొరుగు రాష్ట్రం నుండి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తున్నాడు.

ఎందుకు కూలుతోంది?

జగన్ మంగలి కృష్ణతో స్నేహంకే పరిమితమైననాడే/రోజుల్లోనే బాగుంది! కానీ అందరూ మంగలి కృష్ణ అంత గుట్టుగా ఉండరు కదా.. మన గర్వం, అహంకారం చూపిస్తే. జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మరికొంత అప్రమత్తంగా ఉండి ఉండవలసింది.

ఒక పెద్ద నేర సామ్రాజ్యం కేవలం ఒక భాగస్వామి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల పూర్తిగా కుప్పకూలడం చాలా చాలా అరుదు.
ఒక పార్ట్‌నర్ ఇచ్చిన సమాచారం నేర సామ్ర్యాజ్య పతనానికి దారితీసే క్రమం ఇలా ఉంటుంది.

సామూహిక అరెస్టులు|ఆస్తుల స్వాధీనం|బ్యాంకు అకౌంట్ల సీజ్|నెట్‌వర్క్ కూల్చివేత|సాక్ష్యాల సేకరణ|మాఫియా కుటుంబం నాశనం|అవినీతి అధికారుల సహకారం బహిర్గతం|పాతనేరాలు బయటపడడం|బాధితులు ముందుకు రావడం|నేరాలు & హత్యలు వెలుగులోకి రావడం|ఒకరిమీద ఒకరికి అపనమ్మకం కలగడం, మిగిలిన వారి గురించి చెప్పేయడం|అంతర్గత ద్రోహం, సంఘర్షణలు|ముఠా యొక్క పతనం|డాన్ తో సహా గ్యాంగ్ అరెస్టులు|న్యాయ ప్రక్రియలు|జైలు|బెయిలు|విచారణ|జైలు

అందుకే మాఫియాలో మాట తప్పడం ఉండదు. ఒకరినొకరు మోసగించుకోవడం ఉండదు. ఒకరినొకరు అవమానించుకోవడం అస్సలుండదు. ఎవరి పాత్రలు వారు నిర్వహిస్తూ.. నేర సామ్రాజ్యానికి ముప్పుగా అనిపిస్తే ఆఖరికి ప్రాణమే తీసేయడానికి కూడా వెనుకాడరు.

జగన్ సీఎం అవుతున్నాడు అని ఫలితాలు వచ్చిన రోజు ఆలింగనం చేసుకొన్నది పక్కన వున్న విజయసాయి రెడ్డి. అక్కడే కసిరెడ్డి కూడా వున్నాడు. అంతకు ముందు కలవడానికి వచ్చిన వాడు సైతం.. ఎందుకు వచ్చానా అని తిట్టుకొని వెళ్లే జగన్ తీరును మార్చింది సాయిరెడ్డి. పాదయాత్ర జగన్ చేసి వుండవచ్చు. కానీ రెండో విజయసాయి లేకుండా ఒకటో జగనుకు కుర్చీ దక్కేది కాదు.

అధికారం వచ్చాక, విజసాయిరెడ్డిని తప్పించాలి అని రాజకీయంగా కుట్రపన్నిన వారి మాటలు పదే పదే విన్నాడు. కనీస కృతజ్ఞత పాటించలేదు. సాటి క్రిమినల్ ఆత్మాభిమానం మీద పదే పదే దెబ్బగొట్టాడు. మొదట బహిరంగంగా తాడేపల్లి ఇంటి వద్ద కారులో నుండి క్రిందికి దింపేశాడు. అదో పెద్ద అవమానం సాయి రెడ్డికి.

విశాఖ తరిమేశారు. సోషల్మీడియా లాగేసుకొన్నారు. విశాఖ నుండి కూడా తరిమేశారు. తాడేపల్లికి పిలిచి ఫోను లాగేసుకొని పంపేశారు. ఆఖరికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ పదవి కూడా చెవిరెడ్డికి ఇచ్చేయమన్నారు. నెల్లూరులో నిలబెట్టారు. అన్నీ సహించాడు, భరించాడు, సాయిరెడ్డి శకునికి మించి.

ఫలితాలు వచ్చాక వ్యవసాయం చెయ్యబోతున్నా అన్నాడు సాయిరెడ్డి. అయినా జగను చేత నానా మాటలు చదివించారు. సాయిరెడ్డిలో కూడా చీమూ నెత్తురు వుంటుంది కదా. ప్రాణాలకు తెగించాడు. సిట్ పిలవంగానే వెళ్లాడు. టాప్ లెవెల్ స్కెచ్, పాత్రల గురించి ఉప్పందించాడు. బయట కూడా చెప్పాడు. ఇంకా వుంది పిలిస్తే వచ్చి చెబుతా అన్నాడు. ఆ మాత్రం చాలు కదా పోలీసులకు?

అమెరికా నుండి వచ్చిన రాజ్ కసిరెడ్డికి, ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డిలకు ఈ నేరాలు కొత్త. పోలీసులకు పట్టుబడితే చెప్పకుండా వుండేంత ప్రొఫెషనల్స్ కాదు. పొల్లుబోకుండా ఒక్కో ముడి విడిపోతోంది. సంధింటిని నిలబెట్టిన వ్రేళ్లతో సహా కూలుతోంది ఆ నేర సామ్రాజ్యం. నమ్మకద్రోహం పునాదులు కదిలించగా, చట్టం ఉచ్చు బిగుసుకుంది. కాలం ఎవరినీ వదలదు, ముఖ్యంగా దుర్మార్గపు అహంకారులను!

LEAVE A RESPONSE