– బడి, గుడి, ఇళ్లు అన్నీ జలమయం
– ఉప్పాడను కాపాడేదెవెరు?
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ గ్రామం ఉంటుంది. మత్స్యకార, చేనేత వృత్తిదారులు అత్యధికంగా జీవిస్తున్నారు. బంగాళాఖాతం తీర ప్రాంత గ్రామమైన ఉప్పాడ ఓ మేజర్ పంచాయితీ.
2011 జనాభా లెక్కల ప్రకారమే 12వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన ‘ఉప్పెన’ సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడా గుడి కూడా లేదు.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది.
అందమైన జాంధానీ చీరలకు, చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయంగా ఉండే ఊరు ఉప్పాడ. కానీ సముద్రపు అలల తాకిడితో ఈ గ్రామం అల్లాడిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వందల ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోయాయి.
సముద్రం చొచ్చుకు వస్తున్న కొద్దీ తాము వెనక్కి జరగడమే తప్ప మరో దారి లేకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళనలో ఉన్నారు. దశాబ్ధిన్నర కిందట, కోత నివారణ కోసం నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసం కావడంతో ముప్పు మరింత పెరిగిందనే అభిప్రాయం బాధితుల నుంచి వస్తోంది.
ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదం నివారించేందుకు మార్గాన్వేషణలో ఉన్నట్టు చెబుతోంది.
నిత్యం తీరంలో నివసించే వారికి సముద్రపు అలల తీవ్రత పెద్ద సమస్యగా మారుతోంది. రానురాను సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో ఇప్పటికే వందల ఇళ్లు కూలిపోయాయి.
సముద్రపు కోతకు గురై 20 ఏళ్ల కిందట రామాలయం కూలిపోగా, మళ్లీ కొంత దూరంలో నిర్మించారు. ఇప్పుడు అది కూడా కూలిపోయింది.
ముందుకు వస్తున్న సముద్రపు అలల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయిన వారు అవస్థలు పడుతున్నారు.
పెద్ద పెద్ద కెరటాలు వచ్చి ఇంటిని తాకుతుండడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడం అక్కడున్న వారికి నిత్యానుభవంగా మారింది. అవి ఎప్పుడు తమ ఇంటిని కూలగొడతాయోనని స్థానికులు భయపడుతుంటారు.
”అమావాస్య, పౌర్ణమి సమయాల్లో అలలు వచ్చి గోడను కొడుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. కానీ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలంటే రూ.3,4 వేలు అద్దె కట్టాలి. అంతశక్తి లేక ఈ ఇంట్లోనే ఉంటున్నాం” అని అక్కడ నివసిస్తున్న మైలపు ఆదెమ్మ బీబీసీతో అన్నారు.
దాదాపు పదేళ్ల నుంచి ఇలాంటి సమస్య ఎదురవుతుండగా, నాలుగైదేళ్లుగా బాగా పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
”కెరటాలు ఇంట్లోకి కూడా వస్తే ఖాళీ చేసి బడిలోకి వెళ్లిపోతాం. మళ్లీ తెల్లారిన తర్వాత వచ్చి అన్నీ శుభ్రం చేసుకుంటాం. సముద్రానికి, మా ఇంటికి మధ్య నాలుగు ఇళ్లుండేవి. అవన్నీ కూలిపోయి ఇప్పుడు మా ఇంటి దాక వచ్చేసింది” అన్నారు ఆదెమ్మ.
ఇల్లు, గుడి, బడి దేనికీ రక్షణ లేదు’..
”మేం చిన్నప్పుడు చదువుకున్న బడి ఇప్పుడు లేదు. సముద్రంలో కలిసిపోయింది. మార్కెట్ కూడా ఉండేది. ఇప్పుడున్న ఒడ్డుకి మైలు దూరంలో ఉండేవి. అంతా గంగలో కలిసిపోయింది. ఇల్లు పోయిన వాళ్లంతా మెరకలో ఇల్లు కట్టుకుంటున్నారు. లేని వాళ్లు అలా ఒడ్డునే సరిపెట్టుకుంటున్నారు” అన్నారు ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు మైలపల్లి సత్తిరాజు.
”తుపాన్లు, అల్పపీడనాలు వచ్చినప్పుడు అలలు చాలా ఎత్తున వచ్చేస్తాయి. వాటి తాకిడికి తట్టుకుని ఉండడం చిన్న విషయం కాదు” అన్నారాయన.
60 ఏళ్ల వయసున్న సత్తిరాజు తన చిన్ననాడు చూసిన ఊరికి, ఇప్పుడున్న గ్రామానికి పొంతన లేదని చెబుతున్నారు.
‘ఉప్పెన’ సినిమాలో కనిపించే గుడి కూలిపోయింది..
”మా ఊరిలో ఉప్పెన సినిమా షూటింగ్ జరిగింది. సినిమా క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు గుడి దగ్గర కూర్చుంటారు. ఆ సీన్ షూటింగ్ తీసిన గుడి ఇప్పుడు సముద్రం కోతకు గురయ్యింది. ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. చాలాకాలంగా ఈ సముద్రం వేగంగా ముందుకొచ్చేస్తోంది. మధ్యలో కొన్నాళ్లు జియో ట్యూబ్ వల్ల సముద్రం కోత తగ్గింది. ఇప్పుడా ట్యూబ్ దెబ్బతిన్న తర్వాత ఉప్పాడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది” అన్నారు ఉప్పాడకు చెందిన పి.వెంకట రమణ.
ముంబై తరహాలో తీర పరిరక్షణ జరగాలి..
ఉప్పాడ మంచి పంటలు పండించే ప్రాంతం. జనసమ్మర్థం కూడా ఎక్కువే. ఈ కోత కారణంగా సమీప ప్రాంతాల్లో మంచినీరు ఉప్పునీరుగా మారుతోంది. కోనసీమలోని అనేక మండలాల్లో ఇప్పటికే ఇది స్పష్టంగా కనిపిస్తోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
”8 మండలాల్లో వ్యవసాయానికి బోర్లు వేయకూడదని అధికారికంగా నిషేధించారు. ఉప్పాడ తీరంలో కోతను అరికట్టే ప్రయత్నం జరగాలి. లేదంటే భవిష్యత్తులో కాకినాడ సహా వివిధ తీర ప్రాంతాలకు ముప్పు ఉందనే అంచనాలు, శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు అలసత్వం వీడాలి” అని పర్యావరణవేత్త పతంజలి శాస్త్రి అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఉప్పాడ సహా సమీప ప్రాంతాల్లో తీర ప్రాంతం కుంగిపోతూ సముద్రపు నీరు వచ్చి చేరుతోందని జియాలజిస్ట్ కృష్ణారావు సహా అనేకమంది నివేదికలు స్పష్టం చేస్తున్నట్టు పతంజలి శాస్త్రి వెల్లడించారు. కాలుష్య నివారణ చేయడం, కోత తీవ్రతను అడ్డుకునే ఏర్పాట్లు ముంబై తరహాలో చేయడం ప్రయోజనకరమని ఆయన అంటున్నారు.