Suryaa.co.in

Telangana

రాహుల్.. బీసీని సీఎంగా ఎందుకు నియమించలేదు?

– రాహుల్ కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉందా?
– కర్ణాటకలో ఇప్పటివరకు కులగణన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు?
– ఒక్కసారి అయినా బీసీని ముఖ్యమంత్రిగా చేసిందా?
– ఒక్క బీసీని ఉపముఖ్యమంత్రిగా కూడా చేయలేకపోయింది
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడిచినా, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేదు. రాష్ట్రంలో 12,769 మంది సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,717 మంది ఎంపీటీసీల పదవీకాలం 2024 మే నెలలో ముగిసింది. ఇప్పటికీ ఈ స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 538 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్ పర్సన్ల పదవీకాలం కూడా పూర్తయ్యి సంవత్సరం దాటిపోయింది.

రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలలో 128 మున్సిపాలిటీల పదవీకాలం పూర్తై ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-A, 243-U, 243-ZA పరిధిలో ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి లోకల్ బాడీలకు అభివృద్ధి నిధులు ప్రధానంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తాయి.

ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావలసిన రూ. 1514 కోట్లు నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రజలు ఈ నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అంతేకాక, గతంలో 14వ ఆర్థిక సంఘం కింద రావలసిన రూ. 800 కోట్ల బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఎన్నికల నిర్వహణ లేకపోవడం వల్ల విడుదల కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

ఎన్నికల్లో రిజర్వేషన్ నిష్పత్తి నిర్ణయించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ ప్రక్రియను అమలు చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గొప్పగా మాటలు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కానీ ఆ హామీలు ఎటూ తీరకపోవడం, ఎన్నికలు జరగకపోవడం వల్ల అభివృద్ధి నిధులు నిలిచిపోవడం.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను చూపిస్తున్నాయి. అందువల్ల తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్రం నష్టపోకుండా చూడాలి.

ఆర్టికల్ 243 (U), 243 (Z), 243 (A) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హక్కు, బాధ్యత. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆ నిధులు పూర్తిగా వినియోగం కావడం లేదు.

రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎంత ఉండాలో నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నది ఇంకా అమలు రూపం దాల్చలేదు.

బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే ‘ట్రిపుల్ టెస్ట్’ ప్రకారం — (1) కులగణన, (2) బీసీ కమిషన్, (3) డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేసి, పబ్లిక్‌కు వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టాలని చూడటం తప్పుదారి పట్టించే చర్య. ఇప్పటికైనా రాష్ట్రంలో బీసీ కులాల గణాంకాలను ప్రచురించాలని, రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో, ప్రతి రోజూ ఒక మంత్రి “ఇప్పుడు జరుగుతాయి”, “తొందర్లో ఉంటాయి”, “సంక్రాంతికి జరుగుతాయి” వంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి రోజులు రాబోతున్నాయి, తెలంగాణ ప్రజలకు శుభవార్త రాబోతోంది అంటూ చెవిలో పూలు పెడుతున్నారు. కానీ వాస్తవంగా ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం లేదనే సంగతి స్పష్టమవుతోంది.

అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ నిత్యం కులగణన గురించి మాట్లాడుతారు. కానీ అదే కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో 3 సంవత్సరాల క్రితమే కులగణన పూర్తయింది. ఇప్పటివరకు ఆ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు? కులగణన సరిగ్గా చేయలేకపోయాం, మళ్ళీ మొదలుపెడతాం అని చెబుతుండటమంటే.. మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేంతవరకూ ప్రాసెస్‌ను లాగేస్తారా? ఇది ప్రజల్ని మోసం చేయడమే.

గత 60 ఏళ్లలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఒక్కసారి అయినా బీసీని ముఖ్యమంత్రిగా చేసిందా? తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క బీసీని ఉపముఖ్యమంత్రిగా కూడా చేయలేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ మంత్రివర్గంలో 14 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు. అదే కేంద్ర మంత్రివర్గంలో 60% మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే.

బిజెపి దేశంలో మొదటి సారి ఓ బీసీని ప్రధానిగా చేసింది. కానీ కాంగ్రెస్ చరిత్రలో అసలు సామాజిక న్యాయానికి చోటే లేదు. కాంగ్రెస్ పార్టీకి కులగణన ప్రక్రియ ఒక రాజకీయ ఆయుధంగా మారింది. హిందూ సమాజాన్ని చీల్చి, ఓట్ల కోసమే ఈ కులగణన నాటకం. రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడితే, అదే మాటలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ పునరావృతం చేస్తున్నారు. కానీ అనుసరించాల్సిన చర్యలు మాత్రం కనిపించడం లేదు.

ప్రతిరోజూ ప్రజలకు తీపి కబురు అన్న పేరుతో పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. కానీ ఆ వాగ్దానాల అమలు మాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఇచ్చింది తక్కువే. మూడు పంటల కాలానికి దాదాపు రూ. 33,750 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.3,000 కోట్లలోపే.

రైతు కూలీలకు వాగ్దానం చేసిన రూ.12,000 కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కౌలు రైతులపై చట్టం లేదు, సర్వే లేదు. సుమారు 30-35 లక్షల మంది కవులు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి బోనస్ లేదా కనీస హక్కులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. వరదలు లేదా వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం స్పందించట్లేదు.

ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే అంటూ మంత్రులే వ్యాఖ్యలు చేస్తుండటం దుర్మార్గం. ఇది ప్రజా నిధులను పార్టీ వినియోగానికి మళ్ళించడమే. 18 నెలల తర్వాత కూడా ప్రభుత్వం “శాంపుల్ గవర్నమెంట్” స్థాయిలో ఉంది. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ, అధిష్టానానికి సంచులు పంపడంపైనే దృష్టి పెట్టారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం నెరవేర్చిన హామీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో కులాల సర్వే ఫలితాలను బహిర్గతం చేయాలి.

LEAVE A RESPONSE