Suryaa.co.in

Andhra Pradesh Political News

అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పలేదేం కొమ్మినేనీ?

(కిరణ్‌కుమార్)

అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన ఎనలిస్టుతో సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించి పోలీసు కేసులో అరెస్టు అయి సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలైన కొమ్మినేని శ్రీనివాసరావులో ఇప్పటికైనా ఏదైనా మార్పు వచ్చిందా? ఈ ప్రశ్నకు లేదనే సమాధానం వస్తున్నది. తాజాగా ఆయన సాక్షి టీవీలో ఇచ్చిన వివరణ చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసినప్పుడు ఆయనపై గతంలో జాలి చూపించిన వారు కూడా అసహ్యించుకుంటున్నారు.

“నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేసారు! ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది! నా జీవిత చరమాంకం లో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న! నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు! ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. నాపై చాలామంది నమ్మకం ఉంచారు. సపోర్ట్ చేశారు.

కొందరు నమ్మలేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్న! నా గురించి బాగా తెలిసిన చంద్రబాబు గారు కూడా నన్ను వాడు వీడు అన్నారట! నేను సుప్రీం కోర్టుకు వెళ్లేంత ఏం సంపాదించలేదు. నేను మధ్య తరగతికి ఇంకా కిందే వున్నాను. నేను లేకున్నా నా పేరిట KSR షో నిర్వహించారు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు”… ఇది కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో ఇచ్చిన వివరణ.

కేసు గురించి మాట్లాడే అవకాశం లేకపోయినా కూడా, సందర్భం ఏర్పాటు చేసుకుని మరీ వై ఎస్ జగన్ కు, ఆయన సతీమణి భారతీ రెడ్డికి తాను అత్యంత నమ్మిన బంటును అనే సందేశాన్ని ఆయన వైసీపీ క్యాడర్ కు ఇచ్చాడు. ఆయన మాటలు విన్నాక, ఆయన ఆవేదన చూశాక ఎవరికి బాధ అనిపించలేదు. కొందరైతే నవ్వుకుంటున్నారు. జైలులో ఉండి వచ్చి కూడా ఆయనలో మార్పు రాలేదు అనిపించింది.

ఉద్యోగం ఇచ్చిన బాస్ కు కృతజ్ఞతలు చెప్పడాన్ని, అంత డబ్బు పెట్టి బెయిల్ ఇప్పించిన వారికి ధన్యవాదాలు చెప్పిన విధానాన్ని కూడా ప్రజలు అర్ధం చేసుకున్నారు. తన బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ జగన్ వెళ్లినట్లు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పడం చూస్తే, జగన్ పై ఆయన పార్టీలోని వారికే గౌరవం పోతున్నది.

అరెస్టు అయి జైల్లో చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారు. వారందరి కోసం కాకుండా కేవలం కొమ్మినేని శ్రీనివాసరావు కోసం మాత్రమే జగన్ ఎంతో ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం వైసీపీ నేతలకే నచ్చలేదు. తమను జైళ్లలోనే ఉంచి కొమ్మినేని శ్రీనివాసరావు కోసం జగన్ ఇంత ఖర్చు చేస్తాడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొమ్మినేని విడుదలైంది నిర్దోషిగా కాదు. కేవలం బెయిల్ పై మాత్రమే.

కానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన నిర్దోషిగా సుప్రీం కోర్టు బయట పడేసినట్లు మాట్లాడారు. న్యాయవాదుల వాదనలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల స్వేచ్ఛను బట్టి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. ఆ రోజు డిబేట్ లో కొమ్మినేని బాడీ లాంగ్వేజ్, వెటకారపు నవ్వు, అవును నేను హిందులోనో టైమ్స్ లోనో చూసానని సమర్థింపు ఆ బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి చూసి ఉండక పోవచ్చు. ఆ పాయింట్స్ ను ఎదుటి లాయర్లు చూపించకపోయి ఉండొచ్చు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.

అయితే ఇప్పటికి కొమ్మినేని లో మార్పు రాకపోవడం ఆశ్చర్యంగా వుంది. నాదేం లేదు! నేను నల్లపూసను! నేనేం తప్పు చేయలేదు, చేయను! చంద్రబాబు గారిని కూడా గారు అని సంభోదించమని చెబుతుంటా అని ఇవాళ ఆయనే అన్నారు. అంత మంచి వ్యక్తికి ఆయన చేసిన తప్పు తెలియని తనం అంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత జరిగాక అయినా, ఆ అమరావతి మహిళలకు ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఆయన కన్నీటికి అర్ధం ఉండేది. పైగా ఆయన నిర్వహించే షో లో అన్ని నిజాలే వుంటాయని ఆ టివిలో కూర్చుని చెప్పడం ఇంకా నవ్వు తెప్పిస్తోంది.

LEAVE A RESPONSE