పరిపూర్ణ ఆరోగ్యం కోసం.. యోగ చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం.
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా వారి కర్తవ్యాలను జయప్రదంగా నిర్వహించగలరు. శరీరానికి, మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనసుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో సమ్మిళితం చేయడమే యోగం!
బాహ్య, ఆంతరంగిక శుద్ధి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్య సిద్ధికి, ఆనంద లబ్ధికి యోగ విద్య ఎంతగానో ఉపకరిస్తుంది. స్వలాభాపేక్ష భావనను విడనాడి, సమష్టి తత్వాన్ని, విశ్వ శ్రేయస్సుని, పరహితాన్ని ఆకాంక్షించే విశాల దృక్పథాన్ని యోగ సాధన పెంపొందిస్తుంది. ఆహార, విహారాలలో క్రమశిక్షణాయుతమైన జీవన సరళిని అవలంబించడమే యోగ సాధన యొక్క పరమార్థం.
నిరంతర చైతన్య స్ఫూర్తితో, ఎవరికి వారే ఉద్దరించుకోవాలనే ఆత్మ వివేచనతో మసలుకోవడానికి యోగా మనకు దారిదీపమై నిలుస్తుంది. అంతఃకరణ శుద్ధి, మనశ్శాంతి, ఉత్తమ కర్మాచరణ, సాత్విక జీవనం, సమదర్శనం, సానుకూల దృక్పథం వంటి అంశాలను యోగసాధన పెంపొందిస్తుంది. మానసిక ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన, సంతోషపూర్వక జీవన సరళిని యోగాచరణ సాకారం చేస్తుంది.
జీవితంలో వందల కొద్దీ సమస్యలు మీ ముందుకు వస్తాయి. అయితే ఆరోగ్యం దెబ్బతిన్న మరుక్షణం నుంచి.. ఆ సవాళ్లు, సమస్యలేవీ మీకు గుర్తుండవు. ఆరోగ్యం/ప్రాణాలు కాపాడుకోవడమొక్కటే మీ పనిగా మారుతుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల ఆహారం తీసుకోండి. స్వీయ ఆరోగ్య పరిరక్షణపై దృష్టిసారించండి.
విశాఖలో జూన్ 21న జరుగు అంతర్జాతీయ యోగ దినోత్సవం (యోగాంధ్ర) లో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది పలకండి.
– ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్
విశాఖపట్నం.