• గత ఐదురోజులుగా వర్షాలతో రైతులు అల్లాడుతుంటే మీరు, వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు?
• రైతులు నీటమునిగిన వరి కంకులపై పడి రోదిస్తుంటే మీ మనసు కరగడం లేదా?
• రైతులు ఏడుస్తుంటే మీ మంత్రులు, ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారా
• రైతుల కంటే మీకు రాజకీయాలే ఎక్కువయ్యాయా? : బండి సంజయ్
• గత మూడేళ్లలో జరిగిన పంట నష్టం విలువ రూ.18 వేల 500 కోట్లు
• పంట నష్టం సాయం చేయని మీది కిసాన్ సర్కార్ అంటే నమ్మేదెలా?
• ఎన్నికల ఏడాది కావడంతో పంట నష్టం అంచనా పేరుతో రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు
• తక్షణమే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి యుద్ద ప్రాతిపదికన పంట నష్టం అంచనా నివేదిక తెప్పించండి
• తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోండి
– బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రైతాంగం కంటే రాజకీయాలే ఎక్కువా అని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇదీ..
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.
విషయం : అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరుతూ…..
నమస్కారం….
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 27 జిల్లాల్లో 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. దాదాపు లక్ష మందికి పైగా రైతులు నష్టపోయారు. దురద్రుష్టకరమైన విషయమేమిటంటే ఈ యాసంగి సీజన్ లో రైతులు పంట నష్టపోవడం ఇది రెండోసారి. గత నెల మూడో వారంలో కురిసిన వడగండ్ల వర్షాలతో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. కానీ 33శాతానికిపైగా పంట నష్టం జరిగితేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. గత నెల 23న మీరు కరీంనగర్ జిల్లా రామడుగులో పర్యటించిన సందర్భంగా నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.10 వేల పరిహారం చొప్పున వారం రోజుల్లో సాయం అందిస్తామని ప్రకటించారు. 2 లక్షల 28 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. తక్షణమే వారందరికీ రూ.228 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో నయాపైసా కూడా జమ కాకపోవడం బాధాకరం.
నష్టపోయిన రైతులకు రూ.150 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఈనెల 19న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈరోజుకీ రైతులకు సాయం అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ యాసంగిలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, పల్లిసహా 73 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. గత రెండు నెలల్లో కురిసిన వడగండ్ల వానల మూలంగా 9 లక్షలకుపైగా పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. బాధాకరమేమిటంటే పంట నష్టం తేల్చే విషయంలో రాష్ట్ర పభుత్వ చర్యలు చాలా ఉదాసీనంగా ఉన్నాయి.
గత నాలుగేళ్లలో పంట నష్టపోయిన రైతుల విషయంలో మీరు వ్యవహరించిన తీరును చూస్తే ముమ్మాటికీ మీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020 లో ఫసల్ బీమా పథకం నుండి తప్పుకుంది. నాటినుండి నేటి వరకు పంట నష్టపోయిన రైతులకు నయాపైసా సాయం చేయలేదు. పంట నష్టం విషయానికొస్తే… అకాల వర్షాల వల్ల 2021-22 సంవత్సరంలో వానా కాలం, యాసంగి కలిపి 19 లక్షల ఎకరాల్లో, 2020-21 వానాకాలం, యాసంగి కలిపి 9లక్షల ఎకరాల్లో పంటలు నష్ట పోయారు. వెరసి గత రెండేళ్లలో 28 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.
బాధాకరమైన విషయం ఏమిటంటే… ఫసల్ బీమా పథకం నుండి తప్పుకున్నప్పటి నుండి గత నెల వరకు కనీసం పంట నష్టంపై అధికారులు అంచనాలను వెల్లడించలేదు. దీనిని బట్టి బీఆర్ఎస్ ఎంతటి రైతు వ్యతిరేక ప్రభుత్వమో అర్ధమవుతోంది. ఈ ఏడాది ఎన్నికలు రాబోతుండటంతో రైతులపట్ల మొసలి కన్నీరు కార్చేందుకు మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏనాడూ పంట నష్టపోయిన రైతును ఆదుకోని మీరు… మొట్టమొదటిసారిగా అధికారులతో కలిసి గత నెల 23న హెలికాప్టర్ లో పర్యటించి క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టం పర్యవేక్షించారే తప్ప నేటికీ పైసా సాయం కూడా అందించలేకపోయారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రెండ్రోజుల క్రితం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించిన సందర్భంలో రైతుల బాధలను కళ్లారా చూశాను. వరుస పంట నష్టాలతో వారిపై కోలుకోలేని దెబ్బపడింది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమయ్యే పరిస్థితి ఉందని ఆయా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత వారం రోజులుగా వర్షాలతో రైతులు అల్లాడుతుంటే మీరు ఇంతవరకు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి సైతం నోరు మెదపకపోవడం చూస్తే రైతులపట్ల మీకు ఏ మాత్రం ప్రేమ లేదని తెలుస్తోంది.
రైతులు నీటిలో మునిగిపోయిన వరి కంకులపై పడి ఏడుస్తుంటే…పరామర్శించాల్సిన మంత్రులు, మీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో డ్యాన్సులు చేస్తుండటం సిగ్గుచేటు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటూ ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాల పేరుతో రాజకీయాలు చేస్తూ రైతులను పట్టించుకోకపోవడం క్షమించరాని విషయం. పైకి మాత్రం మాది రైతు ప్రభుత్వం… అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.
ఇప్పటికైనా మీరు మానవతా ధ్రుక్పథంతో వ్యవహరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. అందులో భాగంగా వెంటనే తక్షణమే పంట దెబ్బతిన్న ప్రాంతాల్లోకి అధికారుల బ్రుందాన్ని పంపి యుద్ద ప్రాతిపదికన పంట నష్టం వివరాలపై నివేదిక తెప్పించుకోవాలి. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
అట్లాగే వ్యవసాయ శాఖ అధికారుల, రైతు సంఘాలు, మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలిస్తే గత మూడేళ్లలో 37 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఎకరాకు కనీసం రూ.50 వేల వరకు రైతుకు నష్టం జరిగినట్లు రైతులే చెబుతున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లలో 18 వేల 500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ప్రభుత్వం మాత్రం వారికి పైసా సాయం చేయలేదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని గత మూడేళ్లలో రైతులకు జరిగిన పంట నష్టం వివరాలు తెప్పించుకుని వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. కమిటీలు, సర్వేలు, నివేదికల పేరుతో తాత్సారం చేయకుండా అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతీ రైతుకు యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారం చెల్లించాలి.
రైతాంగానికి ఉచితంగా విత్తనాలు, యూరియా అందించి వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తామని మీరు ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. మీ హామీల అమలుకు ఇదే ఆఖరి సంవత్సరం. రాబోయే వానాకాలం సీజన్‌కు ముందే రైతుబంధుతో పాటు రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలను ఉచితంగా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేయాలి. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం తీవ్ర ఆక్షేపణీయం. రైతుబంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న 14 లక్షల మంది కౌలు రైతులను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇప్పటికైనా కౌలురైతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలులోకి తేవాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ.