జగన్ రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై ఎందుకు పెదవి విప్పలేదు?

-2021-22 రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని స్వయంగా సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండీ వీరపాండ్యన్ ధృవీకరించారు
-ఆర్బీకేల గురించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత గురించి గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి -ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి
-నెల్లూరు పౌర సరఫరాల శాఖలోనూ రూ.50 కోట్ల వరకు దోపిడీ చేశారు
-తణుకులో రైతుల పాదయాత్రపై దౌర్జన్యానికి దిగిన కారుమూరి ముందు తన శాఖలో
ధాన్యం పందికొక్కులు ఎవరో తేల్చాలి
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

ధాన్యం కొనుగోలుపై సమీక్ష చేసిన జగన్ రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన రూ.200 కోట్ల కుంభకోణంపై ఎందుకు పెదవి విప్పలేదు? 2021-22 రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఫేక్ అకౌంట్ లు సృష్టించి సుమారు రూ.150 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండీ వీరపాండ్యన్ ధృవీకరించారు. జులై 19, 2022న వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆ సొమ్మును రికవరీ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. 2800 ఫేక్ ఖాతాలు సృష్టించి దాదాపు రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వమే నిర్థారించినప్పుడు జగన్ రెడ్డి మొట్టమొదటగా చేయాల్సిన సమీక్ష ఈ ధాన్యం కుంభకోణంపైనే కదా.

జగన్ రెడ్డి తన సమీక్షలో ధాన్యం కుంభకోణంపై వీరపాండన్య్ ను ప్రశ్నించారా, ఆ అధికారి ఏం సమాధానం చెప్పారు? ఆర్బీకేల గురించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత గురించి గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి. రబీ ధాన్యం కొనుగోళ్ల కుంభకోణానికి అదనంగా నెల్లూరు పౌర సరఫరాల శాఖలోనూ రూ.50 కోట్ల వరకు దోపిడీ చేశారని సాక్షితో పాటు ఇతర పత్రికల్లో కథనాలు వచ్చాయి. ధాన్యం పందికొక్కులు ఎవరో తేల్చకుండా, రూ.200 కోట్ల లెక్క తేల్చకుండా ఏవోవో గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు. సంబంధిత మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ధాన్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారు?

నేడు తణుకులో రైతుల పాదయాత్రపై దౌర్జన్యానికి దిగిన కారుమూరి ముందు తన శాఖలో ధాన్యం పందికొక్కులు ఎవరో తేల్చాలి. అవినీతిపరులను కట్టడి చేయడం కోసం 14400 అంటూ ఏసీబీ మొబైల్ వ్యాన్ యాప్ ఏం విజయవంతం అయింది? రూ.200 కోట్ల అవినీతి కళ్లకు కనపడుతుంటే మీ ఏసీబీ ఏం చేస్తోంది? తక్షణమే జులై 19, 2022న వీరపాండ్యన్ రబీ ధాన్యం కుంభకోణంపై రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. సమాచార హక్కు చట్టం ద్వారా ధాన్యం కొనుగోలు కుంభకోణం వివరాలు కోరడం జరిగింది. ఆ వివరాలన్నీ బయటపెట్టి తీరాల్సిందే. రైతులు రూ.200 కోట్లు నష్టపోయారు.

నిజమైన రైతులు తాము ధాన్యం అమ్మిన డబ్బులు అందక చెప్పులరిగేలా తిరుగుతుంటే.. ఈ రకంగా దొంగ అకౌంట్ లు సృష్టించి రైతులకు దక్కాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఈ డబ్బును కచ్చితంగా రికవరీ చేయాల్సిందే. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏయే వైసీపీ నాయకుల జేబుల్లోకి ఎంత డబ్బులు వెళ్లాయో తేల్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం కుంభకోణంపై ప్రధాన దిన పత్రికల్లోనే కథనాలు వచ్చి మూడు నెలలైనా సమాధానం లేదు.

ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలోనూ బియ్యం దొంగలు వందల కోట్లకు స్కెచ్ రెడీ చేశారని తెలుస్తోంది. ఆ పందికొక్కులు రైతుల సొమ్ము కాజేయకుండా చర్యలు తీసుకోవాలి. సంబంధిత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా వీరపాండ్యన్ రాసిన లేఖపై సమాధానం చెప్పాలి. వీరపాండ్యన్ కూడా ఎంత సొమ్ము రికవరీ చేశారో తెలపాలని కోరుతున్నాం. ఆర్బీకేల కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply