– పెరిగిన బాబు సెక్యూరిటీ
– వైసీపీపై పెరుగుతున్న బీజేపీ ఎదురుదాడి
– వినాయకమండ పాలకు ఫీజులపై కదంతొక్కుతున్న కమలదండు
– అదే అంశంలో సర్కారుపై విరుచుకుపడుతున్న టీడీపీ
– మోదీ-బాబు భేటీ తర్వాత టీడీపీపై పెరిగిన వైసీపీ మాటల దాడి
– మహిళా జేఏసీ వద్ద బాబును పొగిడిన ఉపరాష్ట్రపతి
– ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దన్న వైసీపీని కాదన్న బీజేపీ
– బీజేపీపై మాటలదాడి పెంచిన వైసీపీ
– తెలంగాణలో పార్టీ గెలవాలంటే టీడీపీ పొత్తు ఉండాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారా?
– ఇవన్నీ బీజేపీ-టీడీపీ పొత్తు సంకేతాలేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రాలో బీజేపీ- టీడీపీ పొత్తు పొడుస్తోందా? నాలుగేళ్ల క్రితం తలాక్ చెప్పిన ఇరు పార్టీలూ మళ్లీ ఒకటి కానున్నాయా? తెలంగాణ పీఠంపై కన్నేసిన భాజపా ఆ స్వప్నం సాకారం కావాలంటే, తెదేపా అవసరం అనివార్యం అని భావిస్తోందా? ఆ మేరకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు సైతం తమ నాయకత్వానికి అదే హితబోధ చేశారా? ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ ఎదురుదాడికి కారణమేమిటి? వినాయకమండపాలకు ఫీజులపై అటు బీజేపీ-ఇటు టీడీపీ సర్కారుపై మూకుమ్మడి దాడి చేయడం వెనుక కారణమేమిటి? బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ చేసిన ఒత్తిడిని కాదని, ఆమెతో టీడీపీ నేతల భేటీ వేయించడం వెనుక కారణమేమిటి? తాజాగా… చంద్రబాబుకు ఏకంగా 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వెనుక మతలబేమిటి? మోదీ-బాబు భేటీ తర్వాత వైసీపీ ఎదురుదాడి పెంచడానికి కారణమేమిటి? వారి భేటీపై అసలు ఆ పార్టీకి ఎందుకంత ఆందోళన, ఆదుర్దా? ఇవ న్నీ బీజేపీకి టీడీపీ చేరువచేసే అంశాలేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దానికి కారణం ఢిల్లీలో తెరవెనుక రాజకీయాలపై రంధ్రాన్వేషణ చేసే ప్రఖ్యాత జర్నలిస్టు కూమీకపూర్ రాసిన వ్యాసం.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు-శాశ్వత శత్రువులూ ఉండరన్న దేవరాజ్ ఆర్స్ పొలిటికల్ ఫిలాసఫీ, భారత రాజకీయాల్లో తరచూ నిజమవుతూనే ఉంది. బీజేపీపై ఒకప్పుడు ధ్వజమెత్తిన కాంగ్రెస్ ప్రముఖులు, ఇప్పుడు ఆ పార్టీలో చేరి కేంద్రమంత్రులయ్యారు. బీజేపీతో చెట్టపట్టాలేసుకున్న వాళ్లేమో, ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని, కాంగ్రెస్-ఇతర పార్టీలతో దోస్తానా చేస్తున్నారు. అలాగే గత ఎన్నికలకు ఏడాది ముందు ఆంధ్రాలో విడాకులు తీసుకున్న తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీలు.. మళ్లీ కలిసేందుకు రంగం సిద్ధమవుతుందంటూ వస్తున్న వార్తలు, ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచడం లేదు. సిద్ధాంతాలు కాకుండా.. ‘అవసరాల ప్రాతిపదికన’ జరుగుతున్న రాజకీయ సమీకరణలో, ఆ రెండు పార్టీల పునరేకీకరణ ఇద్దరికీ అవసరమే. లాభనష్టాల తూకమే రాజకీయ స్నేహాలకు ప్రాతిపదిక అన్నది మెడపై తల ఉన్న అందరికీ తెలుసు.
ఇక ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తుకు రంగం సిద్ధమవుతోందంటూ ఢిల్లీ వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ మేరకు చాలాకాలం నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్నది బహిరంగ రహస్యం. ఏపీలో ఇప్పటి పరిస్థితిలో ఆ పార్టీకి అది అనివార్యం. కాకపోతే కొద్దిరోజుల నుంచే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలివ్వడం ప్రారంభించాయన్నది ఇప్పుడు వస్తున్న సమాచారం. ఆ మేరకు ఢిల్లీ జర్నలిస్టు కూమీ కపూర్ ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం, ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టి సారించి, పార్టీల అంతర్గత విషయాలు, రహస్యాలను బట్టబయలు చేసే కూమీకపూర్.. టీడీపీ-బీజేపీ పొత్తుపై రాసిన కథనం సహజంగానే ఆసక్తి రేపింది.
చంద్రబాబుతో మోదీ-, అదేరోజు అమిత్‌షాతో లోకేష్ మాట్లాడారన్నది జర్నలిస్టు కూమీకపూర్ కథనం. ఈనాడు అధినేత రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా చర్చలను కూడా ప్రస్తావించిన కూమీకపూర్.. టీడీపీ-బీజేపీ పొత్తు అనేక కోణాల్లో ప్రభావితం చూపుతుందని విశ్లేషించారు. పరిస్థితులు అనుకూలిస్తే.. అవసరాలు సరిపోతాయని ఇరు పార్టీలూ భావిస్తే, దీపావళి నాటికి పొత్తు పొడుస్తుందన్నది ఆ జర్నలిస్టు అభిప్రాయం.
సరే. రాజకీయాల్లో విడిపోవడం, మళ్లీ ఏదో ఒక ప్రాతిపదికన కలవడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే.. జర్నలిస్టు కూమీకపూర్ కథనాలు, ఆ జోస్యం అతికినట్లు కనిపించక మానదు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ముర్ము విజయవాడ వచ్చినప్పుడు, ఆమెను వైసీపీ బృందం కలిసింది. అదేరోజు టీడీపీ బృందం కూడా కలసి, ఆమెకు మద్దతు తెలపాల్సిన షెడ్యూల్ ఉంది. ఆ మేరకు ఆ పార్టీ ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే ముర్మును టీడీపీ బృందంతో కలవనీయవద్దంటూ వైసీపీ వ్యూహబృందం, బీజేపీ పెద్దలపై ఒత్తిడి చేసింది. కావాలంటే ఎయిర్‌పోర్టులోనే వారి భేటీ పెట్టించమని సూచించింది. కానీ, వైసీపీ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు అంగీకరింకుండా, ముర్ముతో టీడీపీ బృందంతో భేటీ వేయించింది.
తాజాగా అమరావతి మహిళా జేఏసీ ఉపరాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశాన్ని ఆయనకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబును ప్రస్తుతిస్తూ చేసిన వ్యాఖ్యలు, జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చాయి. చంద్రబాబు విభిన్నమైన నాయకుడని, ఆయనను తాను కలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా రాగా, దానిపై చర్చ జరిగింది.
ఇక ప్రధానంగా మోదీతో బాబు భేటీ.. అనంతర పరిణామాలపై వైసీపీ వర్గాల ఆందోళన- కలవరపాటు- దాడి పరిశీలిస్తే, నిజంగా టీడీపీ-బీజేపీ మళ్లీ దగ్గరవుతాయన్న అంచనా నిజమనిపించక మానదు. ఆ స్థాయిలో వైసీపీ చేసిన మాటల దాడి, ‘మోదీని విమర్శించిన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అది వాళ్లిష్టం ’ అంటూ చివరాఖరి నిరాశ-నిష్ఠూరపూరిత వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఢిల్లీలో బీజేపీ-టీడీపీ మధ్య ఏదో జరుగుతుందన్న సందేహాలను, వైసీపీ నేతలే మరింత బలపరిచినట్టయింది.
నిజానికి అది ఆ రెండు పార్టీల ఇష్టం. కలసి పోటీ చేయాలని నిర్ణయించుకోవచ్చు. లేదా కుదరదు, ఎవరి దారిలో వారు నడుద్దామని కూడా భావించవచ్చు. కాబట్టి పొత్తు పొడవచ్చు. లేకపోనూ వచ్చు. అంతమాత్రానికే.. మోదీతో బాబు భేటీ వేసినందుకే వైసీపీ వర్గాల కలవరపాటు, ఆందోళన, తత్తరపాటు అనవసరం. సహజంగా తనను కలిసిన బాబును ‘ఎలా ఉన్నారు? ఏమిటీ ఈ మధ్య ఢిల్లీ రావడం లేదు? అప్పుడప్పుడు వస్తుండండి. మనం కలుద్దాం. వచ్చే ముందు పీఎంఓను సంప్రదించండి’ అని మోదీ మర్యాదగా పలకరించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తన పాత్రేమీ లేదు కాబట్టి, అందువల్ల ఢిల్లీలో తనకేమీ పనిలేదని బాబు చెప్పడంలో వింతేమీ లేదు. అయినా 175 సీట్లకు 175 సీట్లు సాధించబోయే వైసీపీకి.. ఎవరు కలిస్తే ఏంటి? ఎవరు కలవకపోతే ఏంటీ? అన్ని సీట్లూ గంపగుత్తగా గెలవబోయే వైసీపీలో, ఇంత ఆందోళన-ఆదుర్దా ఎందుకో అర్ధంకాదు.
మోదీ-బాబు భేటీ సమయంలో, అసలు బాబును మోదీ పట్టించుకోలేదని.. గతంలో జరిగిన తప్పిదాలకు బాబు మూడుసార్లు ముందుకొచ్చి, పదేపదే సారీ చెబితే, మోదీ చిద్విలాసం చిందిస్తూ ముందుకుసాగారన్న ‘స్వయంతృప్తి వ్యాసాలు’ విడ్డూరం. గతంలో మోదీ-జగన్ భేటీ సారాంశంపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసం రాస్తే.. వారిద్దరి మధ్య రాధాకృష్ణ ఉన్నారా? కుర్చీల కింద దాక్కుని విన్నారా? అంటూ వెటకారాలాడిన వైసీపీ మీడియా… ఇప్పుడు మోదీ-బాబు భేటీలో, వైసీపీ మీడియా పెద్దలేమైనా వెనుక దాక్కుని అన్నీ విన్నారా? అని ప్రశ్నించడంలో లాజిక్కు ఉంటుంది కదా?
నిజానికి జగన్‌తో యుద్ధం చేస్తున్న టీడీపీ.. బీజేపీతో చెలిమిచేయాలని చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇది బహిరంగ రహస్యం. జగన్ వంటి బలమైన శక్తిని అన్ని రంగాల్లో ఎదుర్కోవాలంటే, తన శక్తి ఒక్కటే సరిపోదని టీడీపీ అనుభవపూర్వకంగా గ్రహించి ఉండాలి. సంప్రదాయ రాజకీయాలు అనుసరించే చంద్రబాబుకు జగన్ లాంటి భిన్నమైన నాయకుడి తో యుద్ధం చేయడం పూర్తిగా కొత్త.
తండ్రి వైఎస్‌తోనే రాజకీయ యుద్ధం చేసిన బాబుకు, ఆయన కొడుకు జగన్‌తో అలాంటి సంప్రదాయ రాజకీయ యుద్ధం చేయలేకపోతున్నారు. ఈ తరం వేగవంతమైన వ్యూహాలకు ఇంకా అలవాటు పడలేకపోతున్నారు. పైగా వైసీపీకి కేంద్రం తెరచాటు మద్దతు అందుతోంది. రాష్ట్రంలో పథకాలు అందుతున్న వారు మినహా.. అన్ని వర్గాలూ జగన్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న సమయంలో, తనకు బీజేపీ దన్ను అవసరమని టీడీపీ భావించడంలో తప్పేమీ కాదు. అదే సమయంలో.. జీరో స్థాయిలో ఉన్న తన పార్టీ, టీడీపీ తో కలిస్తే కొంత బలం పెంచుకోవచ్చన్న బీజేపీ అంచనా కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇద్దరివీ రాజకీయ అవసరాలే కాబట్టి.
బహుశా ఈ వ్యూహంతోనే రాష్ట్రపతి-ఉప రాష్ట్రపతి అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉండవచ్చు. అండమాన్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీలకు సమాన సీట్లు వచ్చినప్పుడు, టీడీపీ సాయంతో బీజేపీ కార్పొరేషన్ చేజిక్కించుకుంది. ఇక ఇటీవలి పార్లమెంటు సమావేశాల సందర్భంలో.. తెలంగాణలో తనకు బద్ధశత్రుైవె న కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనకు, టీఆర్‌ఎస్ హాజరయి మద్దతు ప్రకటించినా.. టీడీపీ ఆ ఛాయలకు వెళ్లకుండా, బీజేపీకి పరోక్షంగా మద్దతు సంకేతాలిచ్చి ఉండవచ్చు. ఇక ఏపీలో తాజాగా వినాయక మండపాలకు ఫీజులపై తొలుత టీడీపీ కన్నెర్ర చేస్తే, దానిని బీజేపీ కొనసాగిస్తోంది. ఇద్దరూ ఒకే అంశంపై పోరాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రుల మాటల దాడి పెంచడం కూడా ఆసక్తికరంగా మారింది. బాబు సెక్యూరిటీ పెరిగేందుకు బీజేపీలోకి వెళ్లిన టీడీపీ నేతలే కారణమంటూ, మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఆరోపణ పరిశీలిస్తే.. బీజేపీపై వైసీపీ నిఘా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
తెలంగాణలో పీఠంపై కన్నేసిన తమ పార్టీ లక్ష్యం నెరవేరాలంటే.. ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యమని, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు తమ నాయకత్వానికి స్పష్టం చేశారన్న వార్తల్లో పెద్ద ఆశ్చర్యం లేదు. సుమారు 27 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, మరో 18 నియోజకవర్గాల్లో పరోక్షంగా టీడీపీ ప్రభావితం చూపిస్తుందన్న అంచనాతోనే తెలంగాణ నేతలు, ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ కాడి కింద పడేసినందువల్ల, ఆ స్థానాన్ని బీజేపీ దక్కించుకోగలిగింది.
అదే టీడీపీ పోటీ ఉంటే, బీజేపీకి నామమాత్రంగానే సీట్లు దక్కేవన్నది బీజేపీకీ తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. పైగా ఆంధ్రా సెటిలర్లు-కమ్మ వర్గం ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలవడం కూడా, బీజేపీ నేతల కలవరపాటుకు ఓ కారణం కావచ్చు. అసలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకే.. టీడీపీ గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగలేదని, ఆ సమయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం చొరవ తీసుకోనందుకే, టీడీపీ క్యాడర్ టీఆర్‌ఎస్‌తో కలసి పనిచేసిందన్నది ఒక ప్రచారం.
తాజాగా చంద్రబాబుకు 12+12 ఎన్‌ఎస్‌జీ భద్రత పెంచడం కూడా పొత్తు కోణంలో చూడటం సహజం. అయితే దానికి రాజకీయకోణం ఉండకపోవచ్చు. ప్రముఖుల భద్రతపై సమీక్షించే కేంద్రం, వారి అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవడం రివాజు. కానీ మోదీ-బాబు భేటీ కావడం, రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు రావడం, అనుకోకుండా బాబుపై కుప్పంలో దాడి జరిగిన రోజునే.. ఎన్‌ఎస్‌జీ బృందం టీడీపీ ఆఫీసుకు వచ్చి తనిఖీలు చేయడం, సాయంత్రానికల్లా బాబు భద్రతను 12+12గా పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవడం బట్టి, టీడీపీ-బీజేపీ దగ్గరవుతున్నాయనుకోవడం సహజం. ఏమో.. రాజకీయాల్లో ఏదయినా జరగవచ్చు.