Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి భయంతోనే రోత రాతలు

-సాక్షి కథనంపై పరువు నష్టం దావా వేస్తాం
-బీజేపీ నేతలు పైలా, బేసు, అడ్డూరి

అభూత కల్పన తో, తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బీజేపీ ఎన్నికల కార్యాలయం లో నాయకులు పైలా సోమినాయుడు, పోతిన బేస్ కంఠేశ్వరుడు, అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని, కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

నగరాల కులస్తులు అందరూ ఐక్యంగా ఉండి సుజనా గెలుపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈ తరహా కథనాలు వండి వారుస్తున్నారని విమర్శించారు. సాక్షి కథనాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వెస్ట్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో సుజనాకు మద్దతుగా తామందరం నిలిచామని, సుజనా గెలుపు నల్లేరుపై నడకనేనని జోస్యం చెప్పారు.

అబద్ధాల సాక్షి: పోతిన
పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి నగరాల కులస్తులు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని, సుజనా విజయం ఏకపక్షం కావడంతో తట్టుకోలేక తాడేపల్లి స్క్రిప్ట్ తో సాక్షిలో అభూత కల్పన కథనాలు రాస్తున్నారని బీజేపీ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన తాను తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని వివరించారు. తాను బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

తాను వెస్ట్ సీటు ఆశిస్తే సీపీఐకి కేటాయించడం కూడా తాను పార్టీ వీడడానికి మరొక కారణంగా వివరించారు. సమస్యల పరిష్కారానికి సుజనా సానుకూలంగా స్పందించడం, బీజేపీ సిద్ధాంతాలు నచ్చడంతోనే పార్టీలో చేరినట్టు వివరించారు. సాక్షి కథనాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైన పక్షంలో వ్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమే అని పోతిన హెచ్చరించారు.

LEAVE A RESPONSE