Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి అధికారులను వదిలి పెట్టం!

– విలేఖరి భార్యకు ఫోన్ లో బెదిరించిన సీఐగా పనిచేసిన మహిళా అధికారి
– ఒక సీఐ కలెక్షన్ కింగ్ గా మారిపోయారు
– వైసీపీలో రుచిమరిగిన అవినీతిని వదులుకోలేకపోతున్నారు
– ఇప్పటికైనా మారకపోతే చట్టప్రకారం శిక్ష తప్పదు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి హెచ్చరిక

తిరుపతి: అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు మరిగిన కొందరు అధికారులు ఇప్పటికీ అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌ హెచ్చరిస్తున్నా కొందరు తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు. గతంలో కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలకు దోచిపెట్టి, వారూ లక్షలు గడించారని తెలిపారు.

ఇప్పటికీ కొందరు ఎర్ర చందనం, ఇసుక, గ్రానైట్ మాఫియాతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పారు. వారి అవినీతిని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో శ్రీకాళహస్తిలో సీఐగా పనిచేసిన ఓ మహిళా అధికారి శనివారం రాత్రి ఒక పాత్రికేయుని భార్యకు ఫోన్ చేసి రౌడీలా బెదిరించినట్టు వార్తలు వచ్చాయని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఒక సీఐ కలెక్షన్ కింగ్ గా మారిపోయారని చెప్పారు. ఆయన గతంలో ఎస్ఐగా పని చేసిన సమయంలో కోట్లు గడించారని అన్నారు.

తిరుపతిలో కొందరు పోలీసులు తోపుడు బండ్ల వారి నుంచి రోజు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చిత్తూరు జిల్లా పెనుమూరు తహశీల్దార్ గా పనిచేసిన ఒక అధికారి వందల ఎకరాలు అక్రమ పట్టాలు ఇచ్చారని తెలిపారు. వెదురుకుప్పం లో పనిచేస్తున్న ఒక రెవెన్యూ అధికారిపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. గతంలో ఆయన సత్యవేడులో ప్రజల చేతిలో దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు.

జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాలలో కొందరు అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలిపారని ఆరోపించారు. చంద్రబాబు పిలుపు మేరకు ఇలాంటి అవినీతి అధికారులను అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు పారదర్శకంగా పని చేయాలని కోరారు. అవినీతి ఆపకుంటే తానే స్వయంగా వారి బండారం బయటి పెడతానని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE