Suryaa.co.in

Political News

విజేతలు… పరాజితులు

ఐదేళ్లకోసారి, టైం తప్పకుండా, టంచనుగా వస్తాయి… వస్తున్నాయి… ఈ మాయదారి, మోసకారి, ఆశపోతు “ఎలక్షన్లు”…

ఎవరో ఒకరు గెలుస్తారు, ప్రతిసారీ….
ఒకరు, ఒకసారి…
మరొకరు, ఇంకొకసారి…
ఒక్కోసారి, “ఒక్కరే” మరోసారి…
ఎవరో, ఒకరు మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు… ప్రతీసారీ…
గెలుపు సంబరాలు, గెలిచిన వాళ్లవి…

వాళ్ళ వర్గానివి…
వాళ్ల అనుంగులవి…
వాళ్ల ఆత్మీయులవి…
వాళ్ల అనుచరులవి…
వాళ్ల బాకాగాళ్ళవి…
వాళ్ల అస్మదీయులవి…
వాళ్ల తస్మదీయులవి…
వాళ్ల భజనపరులవి…
వాళ్ల భట్రాజులవి…
వాళ్ల బాజా-భజంత్రీగాళ్ళవి…
వాళ్ల చెంచాగాళ్ళవి…
వాళ్లను నమ్ముకున్న అధికారులవి, ఉద్యోగులవి…!… విద్యార్థులవి…
వాళ్ల ఎక్స్-ట్రా, ఎగస్త్రా, ఎక్స్ట్రా ఎగస్త్రా గాళ్ళవి…

ఐతే…!

అధికారం కొందరిది…
సంపాదన మరికొందరిది…
వినోదం కొందరిది…
ఆనందం మరికొందరిది…
చిందులు కొందరివి…
విందులు మరికొందరివి…
విలాసం కొందరిది…
ఉల్లాసం మరికొందరిది…
వేడుకలు మాత్రం, గెలిచిన వారందరివీ…
ఈసారి, వీరివి…
మరొకసారి, వారివి…
ఇంకొకసారి – మరోసారి, ఎవరో ఒకరివి…
గెలిచినవాళ్లవి…

ఈ రోజు గెలిచిన వాళ్ళూ – ఓడిన వాళ్ళూ కూడా, ఈ రోజు కాకపోతే రేపటి రోజు, మరో రోజు, ఎప్పటికో ఒక రోజు, ఏదో ఒకరకంగా ఏదో ఒక రోజు ఖచ్ఛితంగా ‘విజేత”లే…

ఐతే…!

మరి… ఓడేదెవ్వరు?
విజితలు ఎవ్వరు?
పరాజితులు ఎవ్వరు?
ఓడేది… ఎప్పుడూ… ఎల్లప్పుడూ వాళ్ళను సదా “గెలిపించే” సామాన్యులే… మన “మెజారిటీ” అమాయక ప్రజలే!

మన పవిత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డబ్బై-ఏడు ఏళ్లు నిండుతున్నా, ఇప్పటికీ ఏడుస్తున్నది… కన్నీరు మాత్రమే మిగుల్చుకుంటున్నది… తను మాత్రం నిరంతరం ఓడిపోతూ, ఎప్పుడూ ఎవరో ఒకర్ని గెలిపిస్తున్నదీ… మన మెజారిటీ అమాయక “సామాన్య” ప్రజలే…!

ఎవర్నో గెలిపించడానికి… ఎన్నో ఆశలతో… మరెన్నో ఆకాంక్షలతో… పెద్ద-పెద్ద క్యూ లైన్లలో నిలబడి మరీ… వేచి… వేచి… వేచి చూసి… వేచి చూసి ఓటు వేసిన – వేస్తున్న సామాన్యులు, అమాయక ప్రజలే ఎప్పటికీ సమిధలు… విజితలు… “పరాజితులు”…!

చివరికి కన్నీళ్లు, ఏడుపులు, విలాపాలు, బాధలు, అవమానాలు, ఆవేదనలు, ఆక్రందనలు, సంతాపాలు మిగిలేది కేవలం మన అమాయక “సామాన్య” ప్రజలకే…!

మరి మన “భారతప్రజలు”, మన పరమ పవిత్ర భారత రాజ్యాంగం సాక్షిగా “ధర్మ విజితలా?…అధర్మ విజితలా?”

– పెన్మెత్స “రవి”ప్రకాష్ అశోకవర్మ
శృంగవృక్షం గ్రామం,
Near భీమవరం,
పాలకోడేరు మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్

LEAVE A RESPONSE