జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌ – మధ్య తరగతి ప్రజలకు తీరనున్న సొంతింటి కల

– సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, దరఖాస్తుదారులు ఏమన్నారంటే, వారి మాటల్లోనే…

బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. సామాన్యులకు 30 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం, మరి మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరలో నో ప్రాఫిట్, నో లాస్‌ పద్దతిలో ఇవ్వాలని, ఇబ్బందులు లేకుండా ఒక కార్యక్రమం చేయమని సీఎం ఇచ్చిన సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో ప్రతీ లేఔట్‌ కూడా నిబంధనల మేరకు, ఎక్కడా డీవియేషన్‌ లేకుండా క్లియర్‌ టైటిల్‌తో ఈ ప్లాట్లు కేటాయింపు జరుగుతుంది. ప్రభుత్వమే ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం కూడా వస్తుంది, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక టౌన్‌షిప్‌ ఉండాలని సీఎంఆదేశించారు, ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు, మా శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

భూముల సేకరణ జరుగుతుంది. ఎవరైతే స్వచ్చందంగా భూములు ఇస్తారో, డీ ఫామ్‌ పట్టాలు ఉన్నవారు కానీ లేక పట్టా భూమి ఉన్న వారు ఇస్తే వారి వద్ద కొని, లేదా ప్రభుత్వ భూమి ఉంటే ప్రొసీజర్‌ ప్రకారం తీసుకుని తిరిగి ప్రభుత్వానికి డబ్బు కట్టేలా ఏర్పాటు చేస్తూ సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్ట్‌ కింద చేయాలని ఈ కార్యక్రమం రూపొందించాం. రానున్న రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌ చేపడతాం. ప్రజలకు మంచి చేసేటప్పుడు కొంతమంది నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే తగిన సమాధానం చెబుతారు. ఒక మంచి మనసుతో చిత్తశుద్దితో చేసిన ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుంది. దాని ఫలితాలు కూడా ప్రజలకు మంచిగానే అందుతాయి, ధ్యాంక్యూ.

నారాయణ రెడ్డి, కాకర్ల గ్రామం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా
నమస్తే అన్నా, నేను 7 సంవత్సరాల క్రితం విజయవాడ వలస వెళ్ళి పాన్‌ షాప్, టీ షాప్, ఐటీసీ సేల్స్‌ మెన్‌గా పనిచేస్తున్నాను. ఇంతవరకూ సొంత ఇళ్ళు కలగా ఉండేది, కానీ ఇప్పుడు సీఆర్‌డీఏ ఆఫీస్‌కు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను, ఇది మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉంది, నేను బుక్‌ చేసుకుంటున్నాను. సార్‌ ధ్యాంక్యూ.

మురళీ మోహనకృష్ణ, జూనియర్‌ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్‌ కాలేజి, ఏలూరు
సార్‌ నా ఆనందానికి అవధుల్లేవు. మేం ఎల్‌ఐజీలో ఇల్లు కట్టాలంటే ఆలోచించే ఈ పరిస్ధితుల్లో ఇప్పుడు ఎంఐజీలో అవకాశం ఇచ్చారు. సామాన్య ఉద్యోగిలాంటి మాకు మీరు ఇస్తున్న సంక్రాంతి కానుక నా యాభై ఏళ్ళ జీవితంలో మర్చిపోలేను. ఈ పండుగకు మాకు పీఆర్సీ కంటే ఈ ఇల్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మీకు మా కుటుంబం తరపున, ఉద్యోగుల తరపున రుణపడి ఉంటామన్నా…ధ్యాంక్యూ

సాధన, నెల్లూరు జిల్లా
జగనన్నా నమస్తే, నేను మా జగనన్నతో మాట్లాడాలనే కల ఉండేది, దగ్గరనుంచి చూడాలని ఉండేది, ఈ రోజు నా కోరిక నెరవేరింది, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఇప్పటికే ఎన్నో వరాలు ఇచ్చారు. జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్‌ గొప్ప కార్యక్రమం, మాలాంటి వారికి సొంత ఇల్లు అనేది ఒక కల, కానీ ఈ రోజు మా కల నెరవేరుతుంది. మీరు అన్ని రకాల సౌకర్యాలతో ఇంత తక్కువ ధరలో ఇవ్వడం సంతోషం. నేను కూడా తీసుకుందామని సిద్దమయ్యాను. ఇది కలా నిజమా అనిపిస్తుంది. పుట్టింటి వారు మాత్రమే ఆడపిల్ల బాధలు తెలుసుకుంటారు, ఈ చెల్లెమ్మలు అందరికీ మీరు దేవుడిచ్చిన వరం, దేవుడైనా అడిగితేనే వరాలు ఇస్తాడు కానీ మా జగనన్న అడగకుండానే వరాలు ఇస్తున్నారు. మా పొదుపు సంఘాల మహిళలందరి తరపున మీకు ధన్యవాదాలు, నాకు గతంలో కరోనా వచ్చింది, నేను తీవ్ర ఇబ్బందులు పడ్డాను, ఈ రోజు ఇక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను అంటే మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డు నాకు ప్రాణభిక్ష పెట్టింది. ధ్యాంక్యూ అన్నా…

నరసింహ, డిప్యూటీ తహశీల్ధార్, రాయచోటి మండలం, వైఎస్సార్‌ జిల్లా.
సార్, నేను కడప జిల్లా వాసిగా చిన్న మాట చెబుతున్నాను. ఒక్కడే సైన్యంగా ఆసేతుహిమాచలం గర్వపడేలా మీరు ముందుకు నడిచి, మన రాష్ట్రాన్ని జనరంజకంగా పాలిస్తున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నవరత్నాలు మాత్రమే కాదు కొన్ని వందల రత్నాలు మీరు ఇస్తున్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌ మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరం, కష్టపడి సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెడితే ఏమవుతుందోనన్న భయం ఉంటుంది కానీ ఇప్పుడు స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో అన్ని సౌకర్యాలతో మంచి వాతావరణంలో ఇవ్వడం శుభపరిణామం. ఈ ఏడాది సంక్రాంతి కానుకలో మాకు రెండు వరాలు ఇచ్చారు, ఒకటి పీఆర్సీ, రెండోది ఇది. ప్రభుత్వ ఉద్యోగులంతా అనుకుంటూ ఉంటాం, మాకు 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం, 20 శాతం రిబేటుతో ఇవ్వడం ఊహించలేదు, ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో మీరు చిరస్ధాయిగా నిలిచిపోతారు, మా రాయచోటిలో చాలా మంచి సైట్‌లో లేఔట్‌ వేశారు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని స్ధిరపడతాను, చాలా ధన్యవాదాలు సార్‌.

వెంకటేశ్వర్లు, రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్, ప్రకాశం జిల్లా
నేను మీతో మాట్లాడే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పేదవర్గాలకే కాదు మధ్యతరగతి వారి గురించి కూడా ఆలోచించి కొత్తగా వారి కోసం మంచి లొకేషన్‌లో అతి తక్కువ ధరకే ఇవ్వడం మంచి పరిణామం. బయటి మార్కెట్‌ రేట్‌ కంటే తక్కువ ధరకు వస్తుంది. బయట కొంటే మౌలిక సదుపాయాలకు అనేక ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ సైట్‌లో 6 నెలల్లోనే అన్ని సౌకర్యాలు ఇవ్వడం మంచి పరిణామం. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. కందుకూరు లేఔట్‌ చాలా బావుంది, మేమంతా ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని ఎదురుచూస్తున్నాం, మా సొంతింటి కల సాకారం అవుతుంది. మీకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

Leave a Reply