Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘కల్తీ నెయ్యి కథ’ తేలుతుంది…

– బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి

విజయవాడ: తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైన పదార్థాలను వినియోగించారా అన్నదానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత నవీన్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో “నెయ్యి దొంగల” గుట్టు రట్టు అవుతుందన్నారు.

తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్న ప్రసాదాలకు వినియోగించే సుమారు 48 ముడి సరుకుల నాణ్యతా ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరారు. గత 5 సంవత్సరాలలో టీటీడీకి ముడి సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా వారందరినీ విచారించాలని తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే టీటీడీ లోని కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతమవుతుందని అభిప్రాయపడ్డారు.

టీటీడీ గోడౌన్ కు “నాణ్యతలేని” అనేక ముడి సరుకులను సరఫరా చేసి ల్యాబ్ టెస్టింగ్ కు మాత్రం “నాణ్యత కలిగిన” ముడి సరుకులను బజార్ లో కొనుగోలు చేసి పంపి అనుమతులు పొందడంపై ల్యాబ్ టెస్టింగ్ అధికారులను,సిబ్బందిని విచారించాలని, టీటీడీ గోడౌన్ కు లారీల్లో వచ్చిన ముడి సరుకులను ఎవరికి అనుమానాలు రాకుండా అప్పుడప్పుడు “రిజెక్ట్” చేసినట్టు రికార్డులలో చూపించి అదే ముడి సరుకులను వేరొక నెంబర్ గల లారీలోకి “లోడ్” చేసుకొని తిరిగి ఆమోదించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని వాటిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు.

టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేసిన ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, జీఎం ప్రొక్యూర్మెంట్, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్, విజిలెన్స్ అధికారులను సైతం విచారణలో భాగస్వాములు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్, ఏపీ స్టేట్ పోలీస్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేసి, వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE