Suryaa.co.in

Telangana

తెలంగాణకు 200 మెగావాట్ల విద్యుత్

– CPSU స్కీమ్‌లో భాగంగా.. NLC సోలార్ పవర్ ప్లాంట్‌ నుంచి..
– రూ.1,214 కోట్లతో ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం
– ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణకు ఏడాదికి 200 మెగావాట్ల హరిత విద్యుత్
– రాష్ట్రానికి రూ.2,000 కోట్లు ఆదా
– ఈ ప్రాజెక్టుకు అవసరమైన సోలార్ ప్యానెళ్లను కూడా తెలంగాణ నుంచే కొనుగోలు చేయనున్న NLC
– రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని వెంటనే PPAపై సంతకాలు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన
– రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణలో విద్యుదుత్పత్తి పెంచేందుకు అన్నిరకాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేదిశగా జరుగుతున్న ప్రయత్నానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చొరవతో ముందడుగు పడింది. దీని కారణంగా ఏటా 200 మెగావాట్ల సోలార్ ఎనర్జీ (సౌరవిద్యుత్) తెలంగాణకు అందించేలా.. NLC (నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్) ఇండియా లిమిటెడ్ సంస్థ అంగీకరించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) పథకంలో భాగంగా.. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్కీమ్‌కు లోబడి.. నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గుజరాత్ లోని కచ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటుచేస్తోంది. (సోలార్ విద్యుత్ కు అవసరమైనంత మేర భూమి, అనుకూలమైన వాతావరణం కచ్ లో ఉంటుంది). రూ.1,214 కోట్లతో నిర్మిస్తున్న ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 2025 జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకంగా మారనుంది. ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా రూ.2.57/కిలోవాట్ అవర్ కే విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు తెలంగాణ ట్రాన్స్‌కోకు ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హరిత విద్యుదుత్పత్తి లక్ష్యాలను మరో అడుగు ముందుకు పడనుంది.

ఈ సోలార్ ప్యానెళ్లతో పాటు సంబంధిత పరికరాలను తెలంగాణ మార్కెట్ నుంచే కొంటారు. దీంతో తెలంగాణలో సోలార్ ప్యానళ్ల ఉత్పత్తికి బాటలు పడతాయి. దీంతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి SGST రూపంలో ఆదాయం కూడా సమకూరనుంది. అంతేకాకుండా, ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా గ్రీన్ ఎనర్జీలో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది.

ఈ సోలార్ ప్రాజెక్టు జీవిత కాలంలో సరఫరా చేసే 12.5 బిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీ ద్వారా 8.9 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలను అడ్డుకోవచ్చు. ఈ సోలార్ ప్రాజెక్టులో ఉన్న మరో ముఖ్యమైన విశేషమేమిటంటే, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టులో వాడే అన్ని సోలార్ సెల్స్ ను దేశీయంగా తయారైనవాటినే వినియోగించనున్నారు.

అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి వీలైనంత త్వరగా NLCతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA)పై సంతకాలు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

అంతకుముందు కూడా తెలంగాణలో విద్యుదుత్పత్తిని పెంచి ఇక్కడి గృహవినియోగ, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. కొత్త రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి.. సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.11వేల కోట్లతో NTPC ఆధ్వర్యంలో.. 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 విద్యుదుత్పత్తి కేంద్రాలను(మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యం) రామగుండంలో ఏర్పాటుచేసుకోవడం, వాటిని ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకింతం ఇవ్వడం తెలిసిందే.

దీంతోపాటుగా.. రామగుండంలో NTPC ఏర్పాటు చేసిన 100 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా జూలై 31, 2022 నాడు ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర పవర్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఇతోధికంగా సహాయం అందిస్తోంది.

NTPC ఆధ్వర్యంలో.. మరో 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్రం ముందుకొచ్చి PPA (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకుంటే.. NTPC పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.

LEAVE A RESPONSE