Suryaa.co.in

Telangana

ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు మోదీ వస్తున్నాడు?

-కారును తూకానికి అమ్మాల్సిందే
-అల్లాటప్పా గా నేను సీఎం కుర్చీ లోకి రాలేదు
-వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి

తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలి, అనకొండ లా మింగేవాళ్లు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ను పట్టి పీడుస్తున్నరు. బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు.. చీకటి ఒప్పందం చేసుకోని బీఆర్ఎస్ నాయకులను బీజేపీలోకి పంపించారు. వరంగల్ లో బీఆర్ఎస్ తరుపున ఒక డమ్మీని దిష్టి బొమ్మ లా నిలబెట్టారు. కాంగ్రెస్ ను ఓడించడానికి అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తల కష్టాన్ని వ్యాపారంగా చేసుకొని రాజకీయంగా చేస్తున్నారు. బీజేపీ ని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి నేను వర్షంలో వరంగల్ వచ్చాను. బీజేపీ, బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాలి. ఎందుకు ఓటు వేయాలో జవాబు చెప్పిన తర్వాతే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో సోనియా గాంధీ ఖాజీపేట కు వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు.ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి తెలంగాణ సోనియమ్మ ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ కు తరలించుకుపోయారు. వరంగల్ కు స్మార్ట్ సిటీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహించింది.. రామప్ప టెంపుల్ , వేయి స్తంభాల గుడికి కేంద్రం నిధులు ఇవ్వలేదు.

గాడిద గుడ్డు ఇచ్చామని వరంగల్ ప్రజలను ఓట్లు అడుగుతారా?ప్రధాని గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్, టెంపుల్ సిటీ ఇస్తావు. మా వరంగల్ అవుటర్ రింగ్ ను ఎందుకు పూర్తి చేయలేదు? వరంగల్ ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోలేదు? వరంగల్ ను దిక్కులేని అనాథ నగరం గా చేశారు. పదేళ్లు మోదీ ఎందుకు వరంగల్ ను పట్టించుకోలేదు? కాజీపేట రైల్వే జంక్షన్ రద్దు చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు మోదీ వస్తున్నాడు.
పదేళ్లు అధికారంలో తెలంగాణను విధ్వంసం చేసిన కేసీఆర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఓడించిన కేసీఆర్ లో మార్పు రాలేదు.. వంకర మాటలు మారలేదు. కేటీఆర్ .. తల కిందికి కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా కారు ను తూకానికి అమ్మాల్సిందే.

కారు రాదని తెలిస్తే కేసీఆర్ బస్సు వేసుకొని బయలు దేరాడు. అల్లాటప్పా గా నేను సీఎం కుర్చీ లోకి రాలేదు.. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చెమట ధారపోసి , భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండా మోసీ అధికారాన్ని తెచ్చారు. నన్ను కుర్చీలో దించడానికి ప్రయత్నించి చూడు కేసీఆర్.. వరంగల్ మిర్చి ఎట్లా ఉంటుందో తెలుసా?

మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఎల్బీ స్టేడియంలో స్వయంగా నియామక పత్రాలు ఇచ్చాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నం. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినం. బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి కులగణన చేస్తున్నాం.

పదేళ్లు అధికారంలో ఉన్న మోదీపైన ఎందుకు కేసీఆర్ మాట్లాడటం లేదు? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ వరంగల్ సీటు ను బీజేపీకి తాకట్టు పెట్టాడు. కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలే బుద్ధి చెప్తారు. డిసెంబర్ లో సెమీ ఫైనల్స్ గెలిచాం.. ఇప్పుడు ఫైనల్ గెలవాలి. తెలంగాణ వర్సెస్ గుజరాత్.. ఎవరు గెలుస్తారో చూద్దాం. గుజరాత్ టీం ను డకౌట్ చేసి చిత్తుచిత్తుగా ఓడించాలి. జరగబోయేది కేవలం ఎన్నికలు కావు యుద్ధం.. యుద్ధంలో వరంగల్ బిడ్డను నా వైపు నిలబడి గుజరాత్ ను ఓడించాలి.

కాకతీయ పౌరుషాన్ని చూపించి ఢిల్లీ సుల్తాన్ లను ఓడించాలి. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కి లక్ష మెజారిటీ ఇవ్వాలి. వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలను తీసుకురావాలని అధికారులను ఆదేశిస్తున్న. తెలంగాణ కు రెండో రాజధాని గా వరంగల్ ను తీర్చిదిద్దుతా.

LEAVE A RESPONSE