Suryaa.co.in

Telangana

అర్ధరాత్రి ఎస్ఐ, హోంగార్డ్‌పై మహిళల దాడి

హైదరాబాద్: వారాంతం వచ్చిందంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేపట్టడం సర్వసాధారణం. ఈ డ్రంక్ డ్రైవ్‌లో రకరకాల వ్యక్తులు పోలీసులకు తారస పడుతూ ఉంటారు. కొందరు కామ్‌గా పోలీసులు చెప్పినట్టుగా చేసేసి వెళ్లిపోతున్నారు. పట్టుబడితే ఫైన్ కట్టేస్తున్నారు. కొందరు మాత్రం నానా రచ్చ చేస్తున్నారు.

మద్యం మత్తో లేదంటే డబ్బుందనే అహంకారమో కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరైతే ఏకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాల్గొన్న పోలీసుల పైనే దాడికి పాల్పడుతున్నారు. ఇలా దాడికి పాల్పడుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ బంజారా హిల్స్‌లో జరిగింది.

బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్సై, హోమ్ గార్డ్‌పై పలువురు మహిళలు దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 పార్కాయత్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పార్క్ హయత్ వద్ద ఓ కారును ట్రాఫిక్ ఎస్ఐ అవినాష్ బాబు, హోంగార్డ్ నరేష్‌లు ఆపారు. కారు నడుపుతున్న మహిళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు హోంగార్డ్ యత్నించాడు.

అంతే సదరు డ్రైవింగ్ చేస్తున్న మహిళతో పాటు మరో ముగ్గురు మహిళలు బూతులతో విరుచుకుపడ్డారు. హోంగార్డ్ ఫోన్ తీసుకొని కారు నడుపుతున్న మహిళ నేలకేసి కొట్టింది. ప్రశ్నించడానికి వచ్చిన ఎస్సై అవినాష్‌పై దాడి చేయడమే కాకుండా అక్కడున్న కెమెరాలను సైతం ధ్వంసం చేసింది. ఎస్ఐ నరేష్ ను తిట్టి తోసేసింది.

మహిళకు మద్దతుగా ఇద్దరు యువకులు సైతం రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు యువకుల్ని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు ఎస్సై, హోంగార్డ్ అప్పగించారు. హోంగార్డ్ నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలై నెలలో అయితే రికార్డ్ స్థాయిలో మందు బాబులు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు.

కేవలం 10 రోజుల వ్యవధిలోనే 1600 మంది దొరికారు. జూలై 1నుంచి జూలై 10 వరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతున్న 1,614 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

LEAVE A RESPONSE