– ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి అవకాశం కల్పించిన స్వచ్చంధ్రా కార్పోరేషన్
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 13 మంది మహిళా క్లాప్ మిత్ర (స్వచ్ఛాగ్రహి), 11 మంది వారి కుటుంబ సభ్యులు హాజరు అయ్యారని రాష్ట్ర స్వచ్చంధ్రా కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. మహిళా కేంద్రీకృతమైన ‘వికాసిత్ భారత్, భారత్ – లోక్తంత్ర కి మాతృక’ అనే ప్రధాన ఇతివృత్తంతో స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) అమలులో చురుకుగా పాల్గొన్న వారికి ఈ అవకాశం లభించిందన్నారు.
దేశవ్యాప్తంగా 500 మంది మహిళా క్లాప్ మిత్రలను (స్వచ్ఛాగ్రహీ) కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఆహ్వానించిందని, ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 27 మంది హాజరు కాగా, వీరిలో రాష్ట్ర స్దాయి నోడల్ అధికారి, ముగ్గురు సమన్వయకర్తలు కూడా ఉన్నారన్నారు.
ఓడిఎఫ్ ప్లస్, సాలిడ్-లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాల విభాగంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న గ్రామ పంచాయతీల నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ ప్రత్యేక అతిథులను ఎంపిక చేసి డిల్లీ పంపిందని చంద్రుడు వివరించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం విదితమే.