– గ్రీన్ పవర్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం
– మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం
– స్త్రీ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఈ దేశంలో మహిళలకు విశిష్ట అధికారాలు, హక్కులు, రాజకీయాల్లో వాటాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లే పునాదులు వేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన స్త్రీ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మన దేశంలో బాల్యవివాహాలు, వరకట్నం నిషేధం, మహిళలకు ఓటు హక్కు, విడాకులు, మహిళలకు ఆస్తిలో వాటా వంటి చట్టాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ద్వారానే ఆచరణలోకి వచ్చాయని వివరించారు. స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్ను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.
ఈ చర్యల మూలంగా మహిళలు ఎన్నికలు, పరిపాలన రంగంలోకి ప్రవేశించారని తెలిపారు. రాష్ట్రంలోనీ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం లక్ష్యానికి మించి 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశామని తెలిపారు. రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందజేస్తామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన గ్రీన్ పవర్ పాలసీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్టు తెలిపారు. సోలార్ ఉత్పత్తి రంగాల్లోకి వారిని తీసుకు వస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
విద్యుత్ శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖలు కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే పెద్ద ఎత్తున వారితో సోలార్ ఉత్పత్తి చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.
బ్యాంకు లింకేజీ ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయించి, ఖాళీ స్థలాలు ప్రభుత్వమే లీజుకు ఇచ్చి, మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కూర్చున్నామని వివరించారు.
మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకు ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించినట్టు వివరించారు. ఈ సౌకర్యం ద్వారా మహిళలు హాస్టల్లోనే పిల్లలను చూసేందుకు, మార్కెట్లు, దేవాలయాలను స్వేచ్ఛగా సందర్శించేందుకు అవకాశం ఏర్పడిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో విజయవంతం అయిందని వివరించారు.
బ్యాంకు రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలతో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి లీజుకు ఇచ్చి ఆర్థికంగా ప్రయోజనం పొందే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.
వీటితోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందిరాశక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చాము దీని ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు.
ఆధునిక యుగంలోనూ నేటికీ బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు కొనసాగుతున్నాయి ఈ అంశంపై సమాజం మొత్తం ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం కోరారు. స్త్రీ సమ్మిట్ వంటి కార్యక్రమాలు ప్రజలను సన్మార్గంలో నడపడానికి ప్రభుత్వాలు సరైన చట్టాలు తెచ్చేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.