Suryaa.co.in

Andhra Pradesh

మహిళా సాధికారత అనేది మా ఇంట్లో చేసి చూపించాం

-చిన్నప్పుడు సినిమాలు బాగానే చూసే వాడిని
– సీఎం ఇంటి పక్కన ఒక అంధ బాలికను చంపేస్తే కూడా సీఎం స్పందించడు
– సీఎం ఉండే తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది.
•వర్చ్యువల్ విధానంలో 100 ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
• అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగామహిళా సాధికారత, భద్రత, విద్య, ప్రభుత్వ విధానాలు, సంక్షేమం వంటి అంశాలపై మహిళలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చ
• ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు….

1. మీ సక్సెస్ లో మీ తల్లి అమ్మణ్ణమ్మ పాత్ర ఏంటి? – తేజస్వి, టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ హెడ్
చంద్రబాబు నాయుడు:- మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా తల్లి చదువుకోలేదు. కానీ నన్ను క్రమశిక్షణతో, ఒక స్ఫూర్తితో పెంచారు. మా తల్లి నన్ను పెంచే విషయంలో పడిన కష్టం చూశాను. నాడు మా అమ్మ కట్టెల పొయ్యితో వంట చేసి చాలా ఇబ్బందులు పడేది. స్కూలు దూరంగా ఉండటం కారణంగా నేను ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి వెళ్లాల్సి ఉండేది. దీంతో నాకు ఆలోపే భోజనం కట్టి ఇవ్వాల్సి వచ్చేది. కట్టెల పొయ్యిలపై వంట చేసే విషయంలో మా అమ్మలా మహిళలకు కష్టాలు ఉండకూడదు అని ఆరోజే ఆలోచన చేశాను.
పొగతో వంట చేయడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతినేది. మా తల్లి కష్టాలు చూసి “దీపం” పథకం తీసుకువచ్చాను. మా అమ్మ ఒక సాధారణ మహిళ….కానీ ఆమె కష్టం, ఆమె పెంపకమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. జీవితంలో నాకు మొదటి గురువు నా తల్లి.

2.మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారత కోసం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తారు? -వెంకట నర్సకుమారి, విశాఖపట్నం నార్త్
చంద్రబాబు నాయుడు: నేటి మహిళలు పారిశ్రామికవేత్తలుగా కూడా రాణిస్తున్నారు. డ్వాక్రా ఉత్పత్తులను అమ్మడం ద్వారా సాధారణ మహిళలు వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. స్థానిక ఉత్పత్తుల అమ్మకం మొదలు పెట్టిన డ్వాక్రా మహిళలు..నేడు ప్రపంచ స్థాయిలో ఎగుమతులు చేస్తున్నారు. మహిళలను ప్రోత్సహించాలని హైదరాబాద్ గాజులరామారంలో మహిళల కోసం నాడు ఇండస్ట్రియల్ టౌన్ షిప్ పెట్టాం. అది మంచి ఫలితాలను తెచ్చింది. భవిష్యత్ లో పారిశ్రామికవేత్తలుగా కావాలనుకున్న మహిళలకు ప్రోత్సాహం ఇస్తాం. 1995లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, ఐటి విప్లవం వచ్చాయి. వీటిని నాడు అందిపుచ్చుకునేలా పాలనలో నిర్ణయాలు చేశాము. వాటి ఫలితాలు నేడు మనం చూస్తున్నాం. తెలుగుదేశం 1986లోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ పెట్టాం. స్థానిక సంస్థల పదవుల్లో, విద్యలో ఆడపిల్లలకు రిజర్వేషన్ లు తెచ్చింది టీడీపీ. నాడు తెచ్చిన 33 శాతం రిజర్వేషన్ వల్ల…. విద్యలో ఆడపిల్లలు మంచి అవకాశాలు పొందారు.మగవారికంటే…భర్తకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో మహిళలది రక్త సంబంధం లాంటి అనుబంధం. ఏ పనిచేసినా నాకు ముందుగా గుర్తొచ్చేది మహిళలే. అందుకే ఏ పథకం చేపట్టినా మహిళ పేరుతోనే ఇచ్చాం. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా పెట్టాం. మహిళ ఆత్మగౌరవం కోసం….ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టాం. ఏజెన్సీ ఏరియాలో వాహనాలు వెళ్లలేవని…నాడు టూ వీలర్ అంబులెన్స్ లు తీసుకువచ్చాం. తద్వారా గిరిజన ప్రాంత గర్భిణీ లకు ఎంతో సహాయం అందేలా చూశాం.

3.తెలుగు సినిమా నటీనటుల్లో ఇష్టమైన జంట ఎవరు?- షేక్ ఉస్మాన్ బీ, జగ్గయ్య పేట
చంద్రబాబు నాయుడు:- ఎన్టీఆర్, సావిత్రి జంట ఎంతో బాగుండేది. ఇద్దరూ పోటీ పడి నటించేవారు.

4. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు? -తేజస్వి
చంద్రబాబు నాయుడు:- చిన్నప్పుడు సినిమాలు బాగానే చూసే వాడిని.ఇప్పుడు బాగా సినిమాలు తగ్గించాను. నాడు ఎన్టీఆర్ సినిమాలు బాగా చూసేవాళ్లం. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇష్టమైన నటీనటులు అంటే చెప్పడం కష్టం.

5. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల బాదుడు భారంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎలా నియంత్రిస్తారు? మీ దగ్గర ఉన్న ఆలోచనలు ఏంటి? -విజయకుమారి గారు, రాజమండ్రి రూరల్
చంద్రబాబు నాయుడు:- రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ఇతర పన్నుల బాదుడుపై రాష్ట్ర వ్యాప్తంగా “బాదుడే బాదుడు” కార్యక్రమం నిర్వహించాం. రూ.10 ఇచ్చి..రూ.90 రూపాయలు లాగేస్తున్న ప్రభుత్వం ఇది. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారు. అవినీతి, అసమర్థత కారణంగా 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ పై ప్రణాళికతో పనిచేస్తే చార్జీలు పెంచాల్సిన పనిలేదు. పైగా తగ్గించే విధంగా నాడు ప్రణాళికలు రచించాం. చెత్త పై పన్నులు, మద్యం రేట్లు, ఇసుక బాదుడుతో ప్రజలపై భారం పడింది. దీన్ని ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నియంత్రించవచ్చు. నాణ్యత లేని మద్యం తెచ్చి మహిళల మంగళ సూత్రాలు తెంచేస్తున్నారు. మద్యం రేట్లు పెంచింది వ్యక్తి గత ఆదాయం పెంచుకోవడం కోసమే. మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చిన ప్రభుత్వం…మహిళలకు తీవ్ర నష్టం చేస్తుంది. తెలుగుదేశం హయాంలో ధరలు పెరగలేదు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ఇబ్బందులు లేకుండా చూశాం. ఇప్పుడు ధరల పెరుగదల వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది ఇంటిని నడిపే మహిళలే. సంక్షేమం అంటే జీవన ప్రమాణాలు పెరగాలి కానీ….తగ్గకూడదు. ఉత్తమ పాలసీల అమలుతో ధరల నియంత్రణ సాధ్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం.

6.ఎన్టీఆర్ సుజల స్రవంతి అనే పథకం ఇప్పుడు తీసేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ పథకం తిరిగి అందిస్తారా? – మానస, కళ్యాణదుర్గం
చంద్రబాబు నాయుడు: రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన మంచి నీరు ఇవ్వాలని నాడు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తెచ్చాం. మొదట కుప్పంలో రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు ఇచ్చాం. రాష్ట్రం అంతా విస్తరించాలని ప్రభుత్వానికి ఈ కార్యక్రమాన్ని అప్పగించాం. అయితే దాన్ని నాశనం చేశారు. టీడీపీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో సురక్షిత తాగు నీరు ఇస్తాం.

7. మహిళా సాధికారతలో భాగంగా విద్య, వైద్యంలో మీరు ఏం చేయబోతున్నారు? -తేజస్వి
చంద్రబాబు నాయుడు:- నాడు మహిళలకు వైద్య సౌకర్యాలు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాం. మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాలు చేపట్టాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్, బాలామృతం, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి కార్యక్రమాలు తీసుకువచ్చాం. దేశంలో తొలిసారి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కడతాను అని చెప్పిన జగన్ ఎన్ని మెడికల్ కాలేజ్ లు కట్టాడు. కనీసం మెడికల్ కాలేజ్ గోడ కట్టలేని సీఎం….మెడికల్ కాలేజ్ లు కడతాడా? పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వ్యక్తి వరకు అనేక కార్యక్రమాలు నాడు అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేస్తాం.

8. మహిళలకు రక్షణ విషయంలో మీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? -తేజస్వి
చంద్రబాబు నాయుడు: దాచేపల్లిలో బాలికపై ఒక ఘటన జరిగితే సిఎంగా నాడు తీవ్రంగా రియాక్ట్ అయ్యాను. దీంతో నిందితుడు భయంతో ఉరివేసుకుని చనిపోయాడు. ఇలాంటి చర్యల ద్వారా దుర్మార్గులను భయపెట్టి మహిళలపై హింస తగ్గించవచ్చు. నేడు రాష్ట్రంలో 8 గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురి అవుతుంది. రాష్ట్రంలో గంజాయి, లిక్కర్ పెరిగింది. దీంతో ఇది తీసుకున్న వాళ్లు విచక్షణ కోల్పోతున్నారు. సీఎం ఇంటి పక్కన ఒక అంధ బాలికను చంపేస్తే కూడా సీఎం స్పందించడు. సీఎం ఉండే తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది. నిర్భయ నిధులు కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అత్యాచారం కేసుల్లో వైసీపీకి చెందిన 6 గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇలా ఉంది పరిస్థితి. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు చెప్పే సీఎంను ఏమనాలి? లేని చట్టంపై మాటలు చెబితే ఎవరు భయపడతారు? మహిళ రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం.

9.మద్య నిషేధం, మద్యం పాలసీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి?-జుబేదా, ప్రాణ్యం
చంద్రబాబు నాయుడు:- ‘నేను మద్యపాన నిషేధం పెడతాను’ అని జగన్ అంటే మహిళలు నమ్మి ఓట్లు వేశారు. మద్యపానం మాన్పిస్తా అని ధరలు పెంచాడు. ధరలు పెంచితే తాగుడు తగ్గిందా…. తగ్గలేదు. ప్రజల రక్తాన్ని తాగే జలగ ఈ జగన్. మద్యం షాపుల్లో వచ్చేది అంతా జగన్ వ్యక్తిగత ఆదాయంగా పోతుంది. అందుకే ఆన్ లైన్ పేమెంట్లు తీసుకోవడం లేదు. ప్రభుత్వం అమ్మే మద్యం, క్వాలిటీ లేని మద్యం. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అని చెప్పిన సీఎం…ఇప్పుడు ఆ మద్యంపై అప్పులు కూడా చేశాడు. ఓటుకు 5 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ మద్యం పాలసీలో అక్రమాలను సరిచేస్తుంది. లిక్కర్ రేట్లు ఈ స్థాయిలో ఉండటం మంచిది కాదు. లిక్కర్ అమ్మకాలను కంట్రోల్ లో పెడతాం. జగన్ మద్యంలో చేసిన అవినీతిని ప్రక్షాళన చేస్తాం.

10. మహిళా రిజర్వేషన్ పై మీ ఆలోచన ఏంటి? -శశికళ, అడ్వకేట్, అనంతపురం
చంద్రబాబు నాయుడు:- స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిందే టీడీపీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేదే టీడీపీ విధానం. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై టీడీపీ పోరాడుతుంది. ఈ విషయంలో మద్దతు ఇస్తుంది.

11. చెత్త పన్ను పెద్ద సమస్యగా ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలగిస్తారా? -సౌభాగ్య, కందుకూరు
చంద్రబాబు నాయుడు: దేశంలో ఈ స్థాయిలో పన్నులు పెంచిన సిఎంను నేను ఇంతవరకు చూడలేదు. ఔరంగజేబు జుట్టుకు పన్ను వేశాడని మనం విన్నాం. దేశంలో చెత్తకు పన్ను వేసిన చెత్త సిఎంను మనం ఎక్కడా చూడలేదు. దీన్ని చాలా బలవంతంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా చెత్తపన్ను పై ప్రశ్నిస్తే ఇంటి ముందు చెత్త వేసే చెత్త ముఖ్యమంత్రి జగన్. టీడీపీ అధికారం చేపట్టిన తొలి రోజునే చెత్త పన్ను తొలగిస్తాం. తొలి ఉత్వర్వులు దీనిపైనే ఇస్తాం. అప్పటి వరకు మహిళలు చైతన్యంతో చెత్త పన్ను కట్టకండి.

12. రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలకు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? – అక్కమ్మ, రాప్తాడు
చంద్రబాబు నాయుడు:- రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒంటరి మహిళలను ఆదుకోవాలని నాడు పింఛన్లు ఇచ్చాం. వయసుతో సంబంధం లేకుండా వారికి పింఛన్లు ఇచ్చాం. వాటిని ఈ ప్రభుత్వం తొలగించింది. ఒంటరి మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల అమలు అవసరం. దీనిపై నా వద్ద ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి.

13. డ్వాక్రా మహిళల సేవింగ్స్ సోమ్మును వారికి ఉన్న అప్పు కట్టే వరకు వాడుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు. -తేజస్వి
చంద్రబాబు నాయుడు:- డ్వాక్రా సంఘాల్లో98 లక్షల మంది ఉండటం చాలా గొప్ప విషయం. ఇది చాలా శక్తి వంతమైన ఆర్గనైజేషన్. డ్వాక్రా సంఘం డబ్బులు డ్రా చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తాం. టీడీపీ అధికారం కోల్పోవడం వల్ల రాష్ట్రం, ప్రజలు నష్టపోయారు. ఇవన్నీ సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

14. రాష్ట్రంలో పెన్షన్ లు నిలిపివేస్తున్నారు. దీనిపై మీరు వచ్చాక ఏం చేస్తారు? -నర్రా కాంత్రి, రిటైర్డ్ టీచర్
చంద్రబాబు నాయుడు:- ఈ ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అర్హతలు కాకుండా…నిజమైన అర్హతలు చూసి పథకాలు ఇస్తాం. మహిళలకు తొలగించిన పథకాలు తిరిగి పునరుద్ధరిస్తాం.

15. మీరు సిఎంగా ఉన్నప్పుడు కరెంట్ చార్జీలు పెరగలేదు. కానీ ఇప్పుడు కరెంట్ చార్జీలు భారంగా మారాయి. మీరు వచ్చాక మళ్లీ తగ్గిస్తారా? -కొమర కమల, శ్రీకాకుళం
చంద్రబాబు నాయుడు:- వైసీపీ పాలకుల అవినీతి, అసమర్థత కారణంగా వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. ప్రభుత్వం 7 సార్లు కరెంటు చార్జీలు పెంచింది. మళ్లీ ఏప్రిల్ నుంచి కరెంట్ చార్జీలు పెంచుతున్నారు. కరెంట్ చార్జీలు తగ్గాలి అంటే సమర్థవంతమైన పాలన ఇచ్చే టీడీపీకే సాధ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం.

16. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పసుపు కుంకుమ పథకం పై విమర్శలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? – తేజస్వి
చంద్రబాబు నాయుడు: నేను ఎన్నికల కోసం నాడు డ్వాక్రా సంఘాలు పెట్టానా?వారికి ఆర్థిక సాయం చేసింది ఎన్నికల్లో లబ్ధి కోసమా? ఇదంతా తప్పుడు ప్రచారం. డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ ఇస్తే దాన్ని తప్పు పట్టారు. సొంత డబ్బులు ఇస్తున్నాడా అని నాడు విమర్శలు చేశారు. ఏ సీఎం అయినా జేబులో నుంచి పథకాలకు డబ్బులు ఇస్తాడా? నాడు 200 ఉండే పెన్షన్ 5 ఏళ్లలో 2000 చేశాం. డ్వాక్రా సంఘాల మహిళలను నా సోదరీమణులుగా నేను భావిస్తాను.

17. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా అందించింది…ఇప్పుడు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నాం. మీరు వచ్చిన తరువాత ఈ సమస్యను పరిష్కరిస్తారా? -భద్రున్నీసా, గుంటూరు
చంద్రబాబు నాయుడు:- నాకు ఉన్న సమాచారం ప్రకారం రూ. 700 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చదువు పూర్తి అయిన వారికి ఫీజు చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్లు పొందడం లేదు. నాడు ఫీజు రీయింబర్స్ మెంట్ ఆటోమేటిక్ గా ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆ వ్యవస్థను నాశనం చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు జరిగేలా చూస్తాం.

18. మీ సతీమణి నారా భువనేశ్వరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా.? – తేజస్వి
చంద్రబాబు నాయుడు:- నేను రాజకీయాల్లో ఉన్నాను….కుటుంబం రాజకీయ ఆదాయంతో కాకుండా సొంతంగా నడవాలి అని నాడు హెరిటేజ్ పెట్టాను. దీన్ని నా సతీమణి భువనేశ్వరి బాగా నిర్వహిస్తున్నారు. నేను మాట్లాడే మహిళా సాధికారత అనేది మా ఇంట్లో చేసి చూపించాం. ఆమె వల్లనే నేను రాజకీయాల్లో నిరంతరం పని చేయగలుగుతున్నాను. ఆమె నాకు లభించిన పెద్ద బహుమానం. ఇంకా ఆమెకు నేను ఏం గిఫ్ట్ ఇస్తాను? రాష్ట్రంలో అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్లీ తెలుగుదేశం రావాలి. ఈ విషయంలో మహిళలు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలి అని కోరుతున్నాను.

LEAVE A RESPONSE