-అబద్దాలు వల్లించడంలో తండ్రిని మించిన తనయుడు లోకేష్
– ఇప్పటికీ చంద్రబాబు సర్వీసులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్న ఏబి వెంకటేశ్వరరావు
– ఉక్రెయిన్ బాధిత విద్యార్థులకు భరోసానిచ్చిన సిఎం జగన్
– మహిళా ఎస్సై కృష్ణ పావని చొరవ ఆదర్శనీయం
– కాలుష్యంపై ప్రపంచ స్థాయి పోరాటం అవసరం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
రాష్ట్రంలో మహిళా క్షేమం, మహిళా సంక్షేమం అన్న నినాదంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
దిశ యాప్ ను రూపొందించి మహిళల భద్రతకు భరోసా కల్పించిందని అన్నారు. మహిళల భద్రత విషయంలో మరో అడుగు ముందుకేస్తూ నేర నిరోధం కోసం సమస్యాత్మక ప్రాంతాల్లో అతి త్వరలో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు, 18 దిశ మొబైల్ రెస్ట్ రూంలు అందుబాటులోకి తీసుకురానుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ దిశ చేరాలి.
ప్రతి మహిళా దిశ యాప్ వాడాలి, సమాచారం అందిన వెంటనే బాధితులకు సహాయం అందించాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. దిశ యాప్ కాల్స్, కేసుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తుచేశారు.
చిట్టి నాయుడు (లోకేష్) అబద్ధాలు వల్లించడంలో తండ్రి చంద్రబాబుని మించిపోయాడని మమత అసలు పెగాసెస్ పై మాట్లాడనే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పెగాసెస్ పై బెంగాల్ అసెంబ్లీలో మమత చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో ప్రచురించడం జరిగిందని గుర్తుచేశారు. ఎల్లో మీడియాను నమ్ముకుని బావిలో కప్పలా బతకొద్దని, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా చూడాలని సూచించారు.
సర్వీస్ రూల్సు గాలికొదిలి అవకతవకలకు పాల్పడినందుకు చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండయ్యాడని. కానీ సర్వీసులోనే కొనసాగుతున్నాడని పెగాసెస్ పై ఏమైనా చెప్పాలనుకుంటే చీఫ్ సెక్రటరీని కలిసి నివేదించడం పద్ధతని, ఇప్పటికీ చంద్రబాబు సర్వీసులోనే ఉన్నట్టు ఆయన తరఫున మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థులు సీఎం జగన్ ని కలిసి తమను రాష్ట్రానికి తీసుకురావడంలో విశేష కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసారని అన్నారు. ఈ మేరకు వారి చదువు కొనసాగించేందుకు అన్నివిధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి విద్యార్థులకు హామీ ఇచ్చారని అన్నారు. చదువు కొనసాగింపునకు ప్రత్యామ్నాయా మార్గాలపై విద్యార్దులతో చర్చించడం జరిగిందని, సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
విధినిర్వహణలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐ కృష్ణ పావని ప్రదర్శించిన మానవత్వం ప్రశంసనీయమని, ఆదర్శనీయమని కొనియాడారు. హాజీపురం అడవిలో పడిఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని మండుటెండలో మూడు కిలోమీటర్లు దూరం మోసుకెళ్లి పోస్టుమార్టం కోసం తరలించడం విధి నిర్వహణ పట్ల ఆమెకున్న నిబద్ధత, అంకితభావాన్ని చాటి చెబుతుందని అన్నారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఆధ్యాత్మిక సారాన్ని సామాజిక అంశాలతో మిళితం చేసి గరికపాటి చెప్పే ప్రవచనాలు అందరినీ ఆలోచింపజేస్తాయని అన్నారు.
ఆస్ట్రేలియా-ఇండియా వర్చువల్ సమ్మిట్ ప్రారంభం ఒక గొప్ప విషయమని ఇరుదేశాల అభివృద్ధికి ఇది కీలకమని అన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ (వ్యూహాత్మక పరిశోధన నిధి) కి 17.2 మిలియన్ డాలర్లకు, గ్రీన్ స్టీల్ భాగస్వామ్యం కేటాయింపు 35.7 మిలియన్ల డాలర్లకు విస్తరించాలని ఆస్ట్రేలియా నిర్ణయించిందని అన్నారు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు.
కాలుష్యం, పొగమంచు ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రపంచ స్థాయిలో పోరాటం అవసరమని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన వాయు నాణ్యత ప్రమాణాలను 2021 సంవత్సరంలో ప్రపంచంలో ఏ దేశమూ అందుకోలేకపోయిందని సర్వేలో వెల్లడయ్యిందని అన్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా కొనసాగుతుందని, అదే బాటలో దేశంలోని మరికొన్ని నగరాలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఈ కాలుష్య భూతాన్ని నివారించే చర్యలు చేపట్టాల్సిన అవసరం తీవ్రమైందని అన్నారు.