*కొత్తగా చెయ్యడం సృజనాత్మకత..
*కొత్తది సృష్టించడం ఆవిష్కరణ..
ఎప్పుడు జరిగిందో సృష్టి..
అదెప్పుడు పుట్టాడో మనిషి..
సృష్టి సృజనం..
మానవుడు అతి గొప్ప ఆవిష్కరణ..
అంతకు ముందే జీవరాశి
సృష్టి జరిగినా మానవుని రాకతోనే పుడమి తొక్కిందేమో కొత్త పుంతలు..
ప్రకృతికి తోచిందేమో
కొత్తకొత్త పులకింతలు..!
వేలవేల వత్సరాల కేళిలో
మానవుడుదయించిన
శుభవేళలో..
వీచే మలయమారుతాలు..
పుడమి పలికె స్వాగతాలు..
ఏం చెయ్యాలో తోచని
అయోమయం నుంచి
ఏదైనా చెయ్యగలిగేటంతటి
మేధోసంపత్తి..
అంతా మానవుని మయం
అతడి మాయామంత్రం..!
*అవసరమే కదా*
*అన్ని ఆవిష్కరణలకు మూలం..*
ఆకలి..కోరిక..
ఈ రెండే
ఆది మానవుని
తొలి అవసరాలు..
వాటి నుంచే పుట్టాయి
ఎన్నెన్నో పరికరాలు..
వాటిని అనుసరించి
ఇంకెన్నో అవకరాలు..
ఏదైనా కావాలనే కోరికే
తాపమై..కోపమై..
ప్రకోపమై..ప్రతీకారమై..
ఒక్కో కాంక్ష
ప్రతీక్షగా..కక్షగా..
స్వరక్షగా..వేరొకరికి శిక్షగా..
పరిణమించి..
శృతి మించి
వికృత రాగాన పడి..
నేటి ఈ వడి..
కత్తుల సవ్వడి..
ఇంత వాడి..ఇలాంటి వేడి!
సరే..దేని సృష్టి ఎలా ఉన్నా..
అతి గొప్ప ఆవిష్కరణలు రెండే రెండు..
*దేవుడు పుట్టించిన ఆకలి..*
*మనిషి సృష్టించిన డబ్బు..*
ఆకలే లేనినాడు
ఏ కాయకష్టం లేదు..
డబ్బే పుట్టని నాడు
బ్రతుకున ఇంత గబ్బే ఉండదు..
డబ్బు అవసరం
అనే దశ దాటి..
పొదుపు హద్దులు అధిగమించి..
మదుపు పొద్దులు
పొడిచేసి….
అవసరాన్ని మించి..
నన్ను ముంచి..
నిన్ను పెంచి
కూడబెట్టే అలవాటు…
ఇప్పుడది దురలవాటు..
మంచిపై వేటు..
ఆశల కాటు..
అంతే..జీవనమే ఆటుపోటు!
దప్పిక..దాహం..
ఇప్పుడు ధనదాహమై..
కామదాహమై..
అధికారదాహమై..
ఇలాంటి విపరీత దాహాలు
ఆవాహమై..వాటికి
నువ్వు వశమై..
అహమై..అదే అహరహమై..
కడకు ఆ అవసరాలకు
మనిషి దాసోహమై..!
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286