– 2023 యాసంగి రైతుబంధు 7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా?
– 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా ?
– ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తాము అని మాయమాటలు చెప్పింది ఎవరు ?
– బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
హైదరాబాద్: రుణమాఫీ, రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న బీఆర్‌ఎస్ పిలుపుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా ఆయన గత బీఆర్‌ఎస్ సర్కారు రుణమాఫీ ఎంతమందికి ఎగ్గొంటిదో వివరాలు వెల్లడించారు.
ఇంకా తుమ్మల ఏమన్నారంటే.. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్ లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేది? రైతుబంధు పథకంలో 2019-20 సంవత్సరంలో రెండు పంటకాలాలలో మీరు పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా? 2023 యాసంగి రైతుబంధు 7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా!
రైతుబంధు పేరు చెప్పి అన్ని పథకాలకు వ్యవసాయ యాంత్రీకరణ, పంటల భీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరెన్నో పథకాలను అటకేక్కించి, రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్ర కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్, నిధులు కూడా దాదాపు 3005 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోబానికి కారణమైన మీరా ఈ ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పేది!
పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించక చేతులెత్తేస్తే, ఈ ప్రభుత్వం గత బకాయిలు చెల్లించి, వాటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న ఈ ప్రభుత్వానికా మీరు నిలదీయమని చెప్పేది? మీరు చేసిన రుణమాఫీ 2014, 2018 పై రైతుల వద్దకు వెళ్ళి ఆడగ గలరా? అసలు ఆ పథకాలు రుణమాఫీ అని పెట్టడం కంటే వడ్డీ మాఫీ అంటే బాగుండేడెమో!
2018 రుణమాఫీలో 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా ? వారి పదవి కాలంలో పంట నష్టం సంభవించినపుడు నష్ట పరిహారం సంగతి అటుంచి, కనీసం రైతులను పరామర్శించని వారు, వారి MLA లను, అధికారులను కూడా అటువైపు వెళ్లొద్దని ఆదేశించిన వారు, అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే రెండు విడతలు, నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్నా మీరు వేలెత్తి చూపెట్టేది?
పంట నష్టపరిహారం కోసం రైతులు హైకోర్టు గడప ఎక్కించాల్సిన పరిస్థితి సృష్టించింది మీరు కాదా ? హడావిడిగా పథకాలను ప్రకటించడం, తర్వాత దానీ ఊసే ఎత్తకపోవడం గత ప్రభుత్వ నైజం కాదా? ప్రగతి భవన్ లో రైతులను పిల్చి సమావేశపరిచి ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తాము అని మాయమాటలు చెప్పింది ఎవరు ?
వరి వేస్తె ఉరి అని, మొక్కజొన్న వద్దు అని, సన్నాలు సాగు చేయమని, పత్తి వద్దని మీకు ఏది తోస్తే అది చెప్పి, ఏ ఒక్క సందర్భంలో కూడా మద్దతు ధర కల్పించి రైతులని ఆదుకున్న పాపాన పోనీ వైనం మీదైతే, ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 695 కోట్లు వెచ్చించి, పత్తి, వరే కాకుండా రైతు పండించిన ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తూ, ఎకరానికి మీరు పెట్టిన పరిమితులను కూడా, పెరిగిన దిగుబడుల ఆధారంగా పెంచుతూ, కొనుగోలు చేస్తున్న మమ్మలనా మీరు నిలదీయమనేది?.
సన్నాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి, సన్నాలు సాగు చేస్తున్న రైతుకు ఎకరాకి అదనముగా రూ. 8000 నుండి రూ.12000 పొందేట్లు చేసి, రైతు అనేవారు ఏ సాయం కోసం చూడకుండా వాళ్ళ కాళ్లపైన వారు గర్వంగా నిలబడేట్టు చేస్తున్నది మా ప్రభుత్వం అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా ?
గతంలో పామ్ఆయిల్ గెలల ధర తగ్గినప్పుడు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి రైతుల ప్రయోజనాలను పరిరక్షించారా! సంవత్సర కాలంలోనే గెలల ధరను వున్న ధర కు అధికంగా 6500/ రూపాయలు పెంచే విధంగా కృషి చేసినందుక ఈ ప్రభుత్వాన్ని నిలదీయమనేది.
ఉపకులపతులను నియమించకుండా వ్యవసాయ మరియు ఉద్యాన వర్సిటీలను నిర్లక్ష్యం చేసి మీరు కాదా ?నిరపయోగ్యంగా ఉన్న రైతు వేదికను దృశ్య శ్రావణ మద్యమం ఏర్పాటు చేసి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నిరంతరం శిక్షణ ఇస్తునందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిందించేది? ఎటువంటి బేషజాలకి పోకుండా రైతు భీమా పథకంలో 1.13 లక్షల రైతులను అదనముగా చేర్చి పథకాన్ని కొనసాగిస్తునందుకా? వ్యవసాయ రంగములో సుస్థిర వృద్ధిని కొనసాగించేటందుకు వీలుగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కమిషన్ ఏర్పాటు చేసినందుకా ?