• విజయవాడ 38వ డివిజన్ కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు
విజయవాడ: 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించారు.
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర తమ బాధలు తెలుపుకొనేందుకు వచ్చిన నసీమా, ఇతర బాధితుల గురించి తెలుసుకొని వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆమెతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నగీనా, విజయ, భవాని, సుధారాణి తదితరులు తామెలా నష్టపోయిందీ వివరిస్తూ, 38వ డివిజన్ కి చెందిన వైసీపీ కార్పొరేటర్ మాత్రం కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతం వరదల వల్ల ప్రభావితం కాలేదని అధికారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేశారు.
తమ ప్రాంతం సేఫ్ జోన్ లో ఉందని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం రాలేదని వాపోయారు. వైసీపీ కార్పొరేటర్ ను నిలదీస్తే ఓట్లు వేసి గెలుపించుకున్న కూటమి ప్రభుత్వాన్ని అడగండి అంటూ తలబిరుసుగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడని ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. తోటి వరద బాధితులతో సమంగా ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి స్పందించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు తక్షణమే వివరాలు పంపించి నసీమా, నగీనా, ఇతర మహిళలు తెలిపిన సమస్యపై తగిన చర్యలు తీసుకొనేలా చూడాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. 48 గంటల్లో బాధితులను ఆదుకునే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.