వైసీపీ ఎలక్షన్‌ టీం రె‘ఢీ’

– పనిభారం ఎక్కువ ఉన్న నేతలకు ఊరట
– పనిచేయని వారి స్థానంలో కొత్త నేతలు
– పనిమంతులకే పట్టం కట్టిన వైసీపీ అధినేత జగన్‌
– సజ్జల, బుగ్గనపై పనిభారం తగ్గించిన జగన్‌
– రీజనల్‌ కో ఆర్డిరేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు
– రెడ్ల ముద్ర తొలగించుకునే యత్నం
– కో ఆర్డినేటర్లలో బీసీ, కమ్మనేతలకు స్థానం
– జిల్లా అధ్యక్షులలో బీసీ, కాపులకు ప్రాధాన్యం
– 10 మంది బీసీ, ఐదుగురు కాపు, ఐదుగురు రెడ్లకు స్థానం
– దూరాభారం తగ్గించి సమీప జిల్లాలకు బాధ్యతలు
– పార్టీకి కొత్తరక్తంతో నూతన జవసత్వాలు
– విపక్షాలపై యుద్ధం చేసే నేతల ఎంపిక
– ఇక వారితోనే విపక్షాలపై యుద్ధం
– జిల్లాల్లో పార్టీ జెండా విస్తరణ వ్యూహం
– ఇక నియోజకవర్గ పరిశీలకుల ఎంపికనే తరువాయి
– శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్న వైసీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

మరో ఏడాదిన్నరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు.. వైసీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలను నడిపించే నాయకులపై, ఇప్పటిదాకా సీరియస్‌గా దృష్టి సారించని సీఎం జగన్‌.. చాలారోజుల కసరత్తు తర్వాత సమర్ధులను జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లుగా నియమించారు. భారీగా చేసిన ఈ మార్పులతో, పార్టీ స్వరూపం మారుతుందన్నది పార్టీ నాయకత్వ అంచనాగా కనిపిస్తోంది. ఇక మిగిలింది నియోజకవర్గ పరిశీలకుల నియామకాలే. అది కూడా పూర్తి చేస్తే ఇక ఆ దళమే విపక్షాలపై యుద్ధం చేస్తుంది. ఒకేసారి చేసిన ఈ భారీ మార్పులు పరిశీలిస్తే.. పార్టీ నాయకత్వం ఆలస్యమైనప్పటికీ, సరైన సమయంలో వాస్తవంలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయి వాస్తవాలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టినట్లు అర్ధమవుతోంది.

ఎన్నికల సమరాంగణానికి వైసీపీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతోంది. పనితీరు విషయంలో.. సీఎం జగన్‌ ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోని వారిపై అనుకున్నట్లుగా వేటు పడింది. అలాగే ఉన్న జిల్లాల నుంచి సుదూర జిల్లాల్లో ఇన్చార్జిలుగా పనిచేస్తున్న.. అగ్రనేతల ఇబ్బందులు గ్రహించిన నాయకత్వం, వారిని పరిసర జిల్లాలకు మార్చడం ద్వారా, కొంత వెసులుబాటు కల్పించింది.

పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్‌.. అనేక సందర్భాల్లో పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ మేరకు వారికి ప్రోగ్రెస్‌ రిపోర్టులు అందించారు. అయినా వారిలో 80 శాతం వరకూ మార్పు రాని క్రమంలో, తెరపైకి కొత్త నాయకత్వాలను తీసుకువచ్చి, పాతనేతలకు షాక్‌ ఇచ్చారు. అదే సమయంలో తమను బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన పలువురు జిల్లా అధ్యక్షులను తప్పించారు.

పార్వతీపురం మన్యం జిల్లాకు మాజీమంత్రి పుష్పవాణి స్థానంలో భర్త పరీక్షిత్తురాజుకు అధ్యక్ష పదవి అప్పగించారు. నిజానికి ఆయనే చాలాకాలం నుంచి, జిల్లా పార్టీ వ్యవహారాలు అనధికారికంగా చూస్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను, విశాఖ జిల్లా అధ్యక్షతల నుంచి తప్పించారు. పార్టీ కార్యకలాపాల్లో ఆయన, చురుకుగా పాల్గొనడం లేదన్న విమర్శలకు నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చినట్టయింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత స్థానంలో, మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణక్యవరప్రసాద్‌కు గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న మేకతోటి.. తనకు అధ్యక్ష బాధ్యతలు వద్దని కోరడంతో, వివాదరహితుడైన డొక్కాకు ఆ బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతలను చెవిరెడ్డి నుంచి తప్పించి, మాజీ సీఎం నేదురుమల్లి తనయుడు రాంకుమార్‌రెడ్డికి అప్పగించడం ద్వారా, తొలిసారిగా యువకుడికి అవకాశం ఇచ్చినట్లయింది. చెవిరెడ్డికి కీలకమైన అనుబంధసంస్థల కో ఆర్డినేటర్‌ బాధ్యతలు అప్పగించారు.

ఇక రీజనల్‌ కో ఆర్డినేటర్ల పదవులన్నీ రెడ్లకే ఇచ్చారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో.. వాటిని విభజించి, బీసీలకూ ఈసారి బాధ్యతలు అప్పగించడం విశేషం. అంటే నాయకత్వం తనకు సంబంధించి వస్తున్న విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకుంటోందని స్పష్టమవుతోంది. గతంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన విమర్శలు కురిపించింది.

దానితో బీసీ-కమ్మలకు కో ఆర్డినేటర్లలో భాగస్వామిని చేశారు. ఆ ప్రకారంగా బీసీ వర్గానికి చెందిన మంత్రి బొత్సకు పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలు అప్పగించారు. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి విశాఖ, విజయనగరం అనకాపల్లి జిల్లాలు అప్పగించారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరి జిల్లా అప్పగించారు. వీటికి ఎంపీ మిధున్‌రెడ్డి కూడా భాగస్వామిగా ఉంటారు.

కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌తోపాటు, సీఎంకు సన్నిహితుడైన ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలను బీసీ వర్గానికి చెందిన ఎంపీ బీద మస్తాన్‌రావు, భూమన కు అప్పగించారు. మాజీమంత్రి బాలినేనికి కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాలు అప్పగించారు. ఆకేపాటి అమర్‌నాధరెడ్డికి నంద్యాల, కర్నూలు జిల్లాలు అప్పగించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు అప్పగించారు. ఆ ప్రకారంగా గతంలో ఆ స్థానాల్లో అంతా రెడ్లే ఉండగా .. తాజాగా ఇద్దరు బీసీలు, ఒక కమ్మ వర్గానికి కో ఆర్డినేటర్లుగా అవకాశం ఇచ్చినట్లయింది.

కో ఆర్డినేటర్లుగా ఇప్పటి వరకూ అవకాశం రాని కమ్మ వర్గానికి, ఈసారి అవకాశం ఇచ్చారు. అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు.. అదే సామాజికవర్గం ఎక్కువగా ఉన్న గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు వ్యూహాత్మకంగా కట్టబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక బీసీలకు కో ఆర్డినేటర్ల పదవులు ఇవ్వలేదన్న విమర్శలు దృష్టిలో పెట్టుకుని.. మంత్రి తూర్పు కాపు వర్గానికి చెందిన బొత్స, శెట్టిబలిజ వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, యాదవ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు బీసీలు ఎక్కువగా ఉన్న జిల్లాలు అప్పగించడం బట్టి.. కులసమీకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తంగా 8మంది కో ఆర్డినేటర్లలో నలుగురు రెడ్డి, ముగ్గురు బీసీ, ఒక కమ్మ వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇక జిల్లా అధ్యక్షులలో 10మంది బీసీలు, ఐదుగురు కాపులు, ఐదుగురు రెడ్లు, ఇద్దరు ఎస్టీలు, ఒక ఎస్సీ, ఒక వైశ్య, ఒక క్షత్రియ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది.

ఫలితంగా తనపై పడిన రెడ్డి కుల ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేసినట్లు, తాజా నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ తనపై పడిన ‘కులముద్ర’ను తొలగించుకునేందుకు, వైసీపీ నాయకత్వం ఎంత జాగ్రత్తగా అడుగులేస్తుందో అర్ధమవుతోంది.

ఇక పని భారం పెరిగిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డినీ కోఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించారు. సజ్జల ఇప్పటికే ప్రభుత్వ-పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండగా, బుగ్గన ఆర్ధిక వ్యవహారాల్లో భాగంగా, ఎక్కువకాలం ఢిల్లీలోనే సమయం కేటాయిస్తున్నారు. కారణాలు ఏమైనా, సీఎం జగన్‌ వీరికి పనిభారం తగ్గించారన్నది స్పష్టం.

అఇక పార్టీకి పెద్దగా సమయం కేటాయించని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని నుంచి ఆ బాధ్యతలు తప్పించారు. వీరిద్దరూ మంత్రి పదవులు పోయిన తర్వాత, పెద్దగా ఉత్సాహంగా కనిపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అనిల్‌కు నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో పొసగడం లేదు. ఇక అనారోగ్య కారణాలతో కొడాలి నాని, మునుపటి ఉత్సాహంతో పనిచేయలేపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా గుడివాడపై టీడీపీ సీరియస్‌గా దృష్టి సారించడంతో, ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ కారణాలతో వారిని సీఎం జగన్‌ పార్టీ బాధ్యతల నుంచి తప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.