వైసీపీ గంజాయి మొక్కను ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా మార్చింది

• మమ్మీ డాడీ వైన్స్ పాలసీని ముందు తీసుకువెళ్తుంది
• గంజాయి కలిపిన సారా అమ్ముతోందా?
• ఏపీలో అమ్మే లిక్కర్ క్వాలిటీపైనా అనుమానాలు ఉన్నాయి
• టీడీపీ సమయంలోనూ సమస్యల మీద మాట్లాడా
• ప్రజల కోసమే కూటమి నుంచి బయటకు వచ్చా
• కలసి పని చేస్తే అసెంబ్లీలోనే కూర్చునేవాళ్లం
• మీరు లంచాలు అడిగితే కాలుష్య రహిత పరిశ్రమలెలా వస్తాయి?
• వైసీపీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసింది
• సిక్కోలు ఉద్యమ స్ఫూర్తితో వైసీపీ కోటలు బద్దలు కొడదాం
• వచ్చే ఏడాది నుంచి ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెడతా
• ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి
• శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వం గంజాయి మొక్కను ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా మార్చేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతోందన్నారు. జనసేన పార్టీ మాత్రం 70 శాతం ఆడపడుచులు కోరుకున్న ప్రాంతంలో మద్య నిషేధం అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. మంగళవారం విశాఖపట్నంలో శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గంజాయి సాగు వైసీపీ హయాంలో మొదలు పెట్టారని నేను అనలేదు. నాడు తెలుగు దేశం పార్టీతో గొడవపెట్టుకునే కదా నేను బయటకు వచ్చింది. మీరు చెప్పినట్టు వాళ్లతో మేముంటే అసెంబ్లీలో కూర్చుని మీ తాట తీసేవాళ్లం. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కూటమి నుంచి బయటకు వచ్చాను. ప్రత్యేక హోదా కోసం నేను ఎంతో గౌరవించే బీజేపీ అధిష్టానంతో గొడవ పెట్టుకున్నాను. మాట్లాడేప్పుడు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతారు. నేను ఎప్పుడూ ఒక్కటే చెబుతా సమస్యల మీద పోరాటం చేసేప్పుడు నేను ప్రజా పక్షమే వహిస్తా.. నాయకుల పక్షం మాత్రం కాదు.
వైసీపీ మద్యంతో రెండేళ్లకే లివర్ పోతుంది
వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఇప్పుడు చెన్నైలోని మమ్మీ డాడీ వైన్స్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తోంది. సంపూర్ణంగా గంజాయి కలిపిన సారా తాగుతావా అన్న చందంగా వైసీపీ నాయకుల ప్రవర్తన ఉంది. తాగుడు వల్ల పదేళ్లలో పాడయ్యే లివర్ వైసీపీ లిక్కర్ తాగితే రెండేళ్లకే పాడవుతుంది. లిక్కర్ క్వాలిటీ కంట్రోల్ లేదు. పరీక్షలు చేయడం లేదు. ఆబ్కారీ శాఖలో పని చేసిన కొందరు తెలిసిన వారు మద్యంలో మత్తు పదార్ధాలు కలుపుతున్నారన్న సందేహాలు ఉన్నాయని వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి యువకులకు బూమ్ బూమ్ బీరు.. కాస్త ఎక్కువ కష్టపడిన వారికి ప్రెసిడెంట్ మెడల్ పోసి డబ్బు సంపాదిస్తున్నారు. మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం రూ. 23,500 కోట్లు సంపాదిస్తోంది. జనసేన మాత్రం మద్య నిషేధం వ్యవహారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది.
వనరులు ఉన్నా సిక్కోలు యువత వలసలు పోతున్నారు
అభివృద్ధి-సంక్షేమం పక్క పక్కన ఉండాలి. పరిశ్రమలు ప్రైవేటులోనూ ఉండాలి. ప్రభుత్వంలోనూ ఉండాలి. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది. శ్రీకాకుళం జిల్లాలో అన్ని వనరులు ఉన్నా యువత వలసలు ఎందుకుపోతున్నారు. పరిశ్రమలు ఎందుకు లేవు. కాలుష్యం స్థాయి తక్కువ ఉన్న పరిశ్రమల ఏర్పాటు ఎందుకు సాధ్యపడదు. అవకతవకలకు పాల్పడకుండా ఉంటే, మీరు లంచాలు అడగకపోతే కాలుష్యం తగ్గించే పరిశ్రమలు వస్తాయి. మీరు కాలుష్యంతో ప్రజల్ని చంపేసుకోండి మాకు మాత్రం లంచాలు ఇవ్వమంటే.. వారి పని వారు చేసుకుంటారు. జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత అలా చేయదు. కాలుష్యం తగ్గించే పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. శ్రీకాకుళం నుంచి వలసలు ఆగాలి. ఆ దిశగా కృషి చేస్తుంది.
మార్పు సిక్కోలు నుంచే మొదలు కావాలి
ప్రతి విషయంలో వైసీపీ మాటలకు అర్ధాలే వేరు అన్న చందంగా ముందుకు వెళ్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా మద్యం మేమే అమ్ముతామని అర్ధం. జాబ్ క్యాలెండర్ అంటే పోస్టులు ఇస్తామన్న 450 పోలీస్ పోస్టులు భర్తీ చేయకపోవడం. ఇళ్లిస్తామంటే అడవుల్లో… స్మశానంలో.. గుంతల్లో ఇస్తామని అర్ధం. దీన్ని ప్రశ్నించేందుకు ప్రతి జనసైనికుడు సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయిలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారిని ప్రశ్నించండి. వారితో డిబేట్లు పెట్టండి. ప్రతి నియోజకవర్గంలో మాట్లాడితే గాని మార్పు రాదు. ఆ మార్పు సిక్కోలులో మొదలు పెట్టండి రాష్ట్రం మొత్తం ఎందుకు రాదో చూద్దాం.
జనసైనికులు కట్టిన పార్క్ స్పీకర్ ప్రారంభించడమేంటి?
ఆమదాలవలసలో జన సైనికులు పార్కు పెట్టడం ఏంటి.. స్పీకర్ ప్రారంభించడం ఏంటి? ఇంకా నయం కబ్జా చేయకుండా వదిలేశారు? మీరు వైసీపీ నాయకులకు భయపడకుండా పని చేయండి. భయపడితే మార్పు రాదు. ఎవరైనా వేధిస్తుంటే ఒక్క అడుగు వెనక్కి వేయండి. అవకాశం వచ్చినప్పుడు 100 అడుగులు ముందుకు వెయ్యండి. వ్యూహాత్మకంగా అడుగులు వేయండి. వైసీపీ విధానాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీవో 217 తీసుకువచ్చింది. గ్రామాల్లో చెరువులు, తటాకాల్లో ఉన్న మత్స్య సంపదను వైసీపీ నాయకులు దోచుకునే పరిస్థితి కల్పించింది. ఇళ్ల పట్టాల పేరు చెప్పి ఎక్కడెక్కడో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.
బ్లీచింగ్ చల్లితే అన్ని కష్టాలూ తీరిపోతాయి అనుకుంటారు
శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను వస్తే ప్రభుత్వం కదిలిందా? తిత్లీ తుపాను వచ్చినప్పుడు మనం జిల్లాలో తిరుగుతుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి విజయనగరంలో తిరుగుతూ కన్నెత్తి చూడలేదు. ఆ రోజే మీకు అర్ధం కావాలి. వైసీపీ నాయకులకు కనికరం లేదని. వారి దృష్టిలో బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి.
సిక్కోలు ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం తీసుకువద్దాం. వైసీపీ దాష్టికాల కోటలను కూలుద్దాం. ఉక్కు ప్రైవేటు పరం చేస్తామంటే సోంపేట పోరాట స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం చూపాలి. నేను మీ రుణం తీర్చుకోవడానికి ఉన్నాను. ఆ క్రమంలో పదవులు వస్తే రావచ్చు.. రాకపోయినా ముందుకు వెళ్తాం. నేను ఇక్కడ కూర్చున్న వారికి సీట్లు ఇచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తావు అని అగడలేదు. శ్రీకాకుళం చైతన్య స్ఫూర్తితో రాజకీయం చేయండి అని మాత్రమే అడిగాను. కష్టాలు ఉన్న చోట చైతన్యం ఉంటుంది. సోంపేట బీల భూముల కోసం జరిగిన ఉద్యమంలో కాలికి బుల్లెట్ గుచ్చుకున్నా పోరాటం చేసిన ముసలాయన స్ఫూర్తి కావాలి. అన్యాయం, అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవా’ అంటూ పాడిన వంగపండు ప్రసాదరావు లాంటి విప్లవ కవులు పుట్టుకొస్తారు.
కార్యకర్తలకు రూ. 25 లక్షల బీమా నా లక్ష్యం
జనసేన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. వేల కోట్లతో కూడిన రకరకాల రాజకీయ సమూహాల మధ్య ఏడేళ్లు నడపగలిగాను అంటే మీ అందరి అండదండలే కారణం. మీ కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో నాయకులతో మాట్లాడి ఈ ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలకు గురయితే మెడికల్ ఇన్సూరెన్సు, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చాం. నా దృష్టిలో అది కూడా తక్కువే. ఒక రోజున రూ. 25 లక్షల రూపాయిల ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నది నా కోరిక. పార్టీ కోసం ముందుకు వచ్చి నిలబడిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అంతా నిరుపేద కుటుంబాల వారే. భవిష్యత్తులో కష్టం వస్తే వారికి ఇచ్చే భరోసా ఎక్కువ చేయాలన్నా ఆలోచన ఉంది. చివరిగా సిక్కోలు జిల్లా యువత చైతన్య స్ఫూర్తి రగిలిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఆ పోరాట స్ఫూర్తితో మనం చేసే యుద్దంలో మార్పు రావాలని కోరుకుంటూ.. జై ఆంధ్ర.. జై జనసేన.. జై హింద్* అన్నారు.
నాడు పక్క జిల్లాలో పాదయాత్రలో ఉండీ పరామర్శించలేదు: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్నా దెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “వైసీపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తిత్లీ తుపాను పరిహారం ఇప్పటికీ మత్య్సకార గ్రామాలకు అందలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు విజయనగరం జిల్లాలో పాదయాత్రలో ఉండి కూడా అంత పెద్ద ఆపద వస్తే శ్రీకాకుళం జిల్లా ప్రజల్ని పరామర్శించలేదు. తుపాను వల్ల కరెంటు లేని పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు మమ్మల్ని కదిలించాయి. అలాంటి సమయంలో కూడా జనసేన పార్టీ అండగా నిలిచింది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్లిపోయింది. యువతకు ఉద్యోగాలు రాలేదు. అభివృద్ధి లేదు. ఉద్దానం ప్రాంతంలో ఇవ్వాల్సిన ఫించన్లు కట్ చేశారు. నాడు ఇచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హామీ ఏమయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ప్రభుత్వాలు చిన్న చూపు చూసి యువత నలిగిపోతోంది. చాలా వెనుకబాటుతనం కనబడుతోంది. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే వరకు అక్కడ ప్రజలు ఇబ్బందికర స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ప్రపంచం మొత్తం ఆ ప్రాంతం వైపు చూసేలా జనసేన అడుగులు వేసింది. వీటన్నింటినీ జనసైనికులు క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి. రాబోయే రెండేళ్లలో జనసేన పార్టీగా ఎలా ముందుకు వెళ్దాం అనే అంశం మీద ఆలోచన చేయండి. శ్రీకాకుళం జిల్లా నుంచి కుటుంబపాలన దూరం చేయండి.. నిలబడండి” అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర కార్యదర్శులు గడసాల అప్పారావు, బోడపాటి శివదత్, శ్రీకాకుళం జిల్లా నాయకులు గేదెల చైతన్య, పెడాడ రామ్మోహన్, దాసరి రాజు, కణితి కిరణ్, కోరాడ సర్వేశ్వరరావు, మెట్ట వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply