Suryaa.co.in

Andhra Pradesh

మహిళల కన్నీటిని అడ్డం పెట్టుకుని గెలిచిన పార్టీ వైకాపా

అలాంటి మనమే మహిళలని అవమానించడమా?
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు మద్దతునిచ్చి… ఇప్పుడు మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం తగునా??
ప్రభుత్వ వైద్యులు సర్టిఫై చేసిన కేసు టేకప్ చేయకపోవడం ఆశ్చర్యకరం
12 కంపెనీల నుంచి వాసుదేవ రెడ్డి ఏ ప్రాతిపదికన 74% మద్యాన్ని కొనుగోలు చేశారు
మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలి
వంటలు కాపాడుకోవడానికి డీజిల్ కోసం రైతులు చేస్తున్న ఖర్చు కూడా చివరకు గిట్టుబాటు అవుతుందో.. కాదో ??
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మహిళల కన్నీటిని అడ్డం పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అటువంటి మనమే మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం భావ్యమా అంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంట్లో మగవారు లేరా?, ఆడవారే రోడ్డెక్కారని మా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆర్థిక నేరాభియోగ కేసులలో జగన్మోహన్ రెడ్డి ని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అరెస్టు చేసినప్పుడు రోడ్డు ఎక్కింది ఎవరని ప్రశ్నించారు. వైయస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తో పాటు వైయస్ వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులైన వారు ఎవరైనా రోడ్డెక్కారా? అని నిలదీశారు. వైఎస్ విజయమ్మ, వైయస్ భారతి, వైఎస్ షర్మిల మరి కొంతమంది మహిళతో కలిసి రోడ్డెక్కి తమ చీర కొంగులతో కన్నీళ్లు తుడుచుకుంటూ విపరీతంగా లేడీస్ సెంటిమెంట్పం డించారన్నారు.

జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య వదిలిన బాణాన్ని చెప్పుకొని చెల్లెలు కాళ్లకు వేసుకున్న బూట్లు అరిగేలా తిరిగింది. తల్లి, చెల్లి ఏమైనా పురుషులా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఇతరుల గురించి కామెంట్ చేసేటప్పుడు మన గురించి కూడా ఇతరులు ప్రశ్నిస్తారన్న ఇంకిత జ్ఞానం లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇదే విషయాన్ని నాకు ఒకరు ఫోన్ చేసి గతంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పాదయాత్ర చేసిన షర్మిల, ప్రచారం నిర్వహించిన విజయమ్మ ఏమైనా మగవారా అంటూ ప్రశ్నించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇతరుల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది?. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానేయాలని పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా చెబుతున్నాను. మహిళలను అవమానించడం తగదు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ వంటి మహిళా నాయకురాళ్ల గురించి అవగాహన లేని వారు , మహిళలంటే గౌరవం లేని వారే ఈ విధంగా మాట్లాడుతారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, నాసిరకమైన మద్యం ఏరులై పారిస్తున్నందుకు మహిళా లోకం ఆగ్రహంతో రగిలిపోతుంది.

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన బిల్లుకు ఉభయ సభల్లో మన పార్టీ మద్దతు ఇచ్చి, ఇప్పుడు మగ తనం గురించి అంత ఎక్కువగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. మహిళల గురించి ఇంత అవమానకరంగా మాట్లాడితే ఏ మహిళ మాత్రం మన పార్టీకి ఓటు వేస్తుంది. మద్యం దెబ్బకు అసలే వేయరు. ఇప్పుడు మహిళల గురించి అవమానకరంగా మాట్లాడి మహిళా లోకమంతా మన పార్టీకి వ్యతిరేకంగా మారే పరిస్థితులను తీసుకువచ్చారు.

మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పటికే కొనఊపిరితో ఉన్న పార్టీని శవంగా మార్చవద్దని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. నిజం గెలవాలి పేరిట నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన యాత్రకు అశేష జన ప్రభంజనం కదిలి వచ్చింది. నారా భువనేశ్వరి కోసం మహిళా లోకం కదిలివస్తే… చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో కలత చెంది మృతి చెందిన వారికి మద్దతుగా నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మా పార్టీలో ఎవరు ఏమి మాట్లాడినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్టును అనుసరించే మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి చెబితే జివిడి స్క్రిప్ట్ రాస్తారని దానికి అనుగుణంగా మంత్రి రోజా, మాజీ మంత్రి పేరుని నాని వంటి వారంతా మాట్లాడుతారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

100 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయితే కేవలం 12 కంపెనీల నుంచే ఎందుకు మద్యం కొనుగోళ్లు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయితే కేవలం 12 కంపెనీల వద్ద నుంచే 74% మద్యం కొనుగోళ్ల వెనక మతలబు ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మద్యం అక్రమాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశం లో చక్కటి విశ్లేషణ చేశారు. ఏ డిస్టలరీలను ఎవరు నిర్వహిస్తున్నారో వివరించారు. ఇటీవల నేను కూడా కొన్ని వివరాలు చెప్పిన విషయం తెలిసింది. అదనంగా మరిన్ని వివరాలు కనుగొన్న పురందరేశ్వరి, ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనుగోలు చేశారో చక్కగా వివరించారు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు పర్యవేక్షణలో కొనసాగుతున్న అడాన్ డిస్టలరీస్ నుంచి అత్యధిక మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేశారని పురందరేశ్వరి తెలిపారు . టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్ యాదవ్ లకు చెందిన డిస్టలరీస్ ని కూడా బలవంతంగా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు తీసుకున్నారు. ఒకవేళ లీజుకు ఇవ్వనంటే, వారికి మద్యం సరఫరా ఆర్డర్లను ఇవ్వరు. దీనితో చేసేది లేక తమ డిస్టలరీస్ లను ముఖ్యమంత్రి వంది మాగదులకు యజమానులు అప్పగిస్తున్నారు.

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినప్పుడు కేవలం 12 కంపెనీల నుంచి 74 శాతం మద్యాన్ని ఏ ప్రాతిపదికన ఆ సంస్థ కార్యదర్శి వాసుదేవ రెడ్డి కొనుగోలు చేశారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. పోనీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న బ్రాండ్లు అంతకు ముందు ఉన్నాయా అంటే అది లేదు . నువ్వు కొనుగోలు చేసే రేటు కంటే తక్కువకు ఇతర కంపెనీలు మద్యం సరఫరా చేయమని చెప్పాయా అంటే అది కూడా లేదు. ఇదే రేటుకు దేశవ్యాప్తంగా అమ్ముడుపోయే ప్రముఖ బ్రాండ్లను సరఫరా చేస్తామని మద్యం కంపెనీలు ముందుకొచ్చాయి.

క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కానీ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారు మద్యం సరఫరా చేస్తామంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరపాలంటే న్యాయస్థానంలో కేసు వేయాలి. పురందరేశ్వరి కేసు వేస్తానంటే అందులో నేను ఇంప్లిడ్ అవుతాను. లేదంటే నేనే కేసు వేస్తాను. పురందరేశ్వరి ఇంప్లిడ్ కావొచ్చునని కోరారు. తమకు అనుకూలమైన కంపెనీల ద్వారా చెత్త సరుకును కొనుగోలు చేసి, ప్రజల రక్త మాంసాలను దోచుకు తింటున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని పురందరేశ్వరి గణాంకాలతో సహా వివరించారన్న ఆయన, సంవత్సరానికి 30 వేల కోట్లు అంటే ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డితో బిజెపి కుమ్మక్కయిందని ఆరోపణలను తిప్పికొట్టే విధంగా పురందరేశ్వరి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలను వెలికితీస్తున్నారని తెలిపారు . పురందరేశ్వరి వెలికి తీసిన నిజాలపై చేపట్టాల్సిన చర్యలు కార్యరూపం దాల్చితే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు.

మద్యం అక్రమాలపై గళం విప్పిన పురందరేశ్వరిపై విజయసాయిరెడ్డి వ్యక్తిగత దాడులకు దిగడం శోచనీయం. ఈ విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలి. సిబిఐ విచారణకు ఆదేశిస్తే, ఏ డిస్టలరీని ఎవరు నిర్వహిస్తున్నారో తేలిపోతుందన్నారు. ఏ ప్రాతిపదికనో ఫేమస్ బ్రాండ్లను కాదని, తోకడ బ్రాండ్లను వాసుదేవ రెడ్డి కొనుగోలు చేశారో నిజ, నిజాలు వెలుగు చూస్తాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అప్పు చేసి సంక్షేమం చేస్తున్నామన్న బొత్స

అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిజాలను చెప్పారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి చేశాం… ఆదాయాన్ని పెంచాం… అప్పులనే చేయడం లేదని చెప్పుకొచ్చిన మంత్రులకు, ఇప్పుడు అప్పులు చేసే సంక్షేమాన్ని చేస్తున్నామన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల ద్వారా అసలు నిజం ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. మద్య నిషేధం అమలు చేయమని అంటున్నారు… తాగకండి రా బాబు అని చెప్తాం… తాగెస్తే ఏంటి చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

బొత్స వ్యాఖ్యలు సరైనవి అయినప్పటికీ, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పారన్నదే అసలు పాయింట్ అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాము ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేస్తే తమపై తామే విచారణకు ఆదేశించుకుంటామన్న బొత్స వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాము. తక్షణమే విచారణకు ఆదేశించుకుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి రఘురామ కృష్ణంరాజు సూచించారు.

లిక్కర్, సాండ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కసిరెడ్డి రాజ్ తనకు లభించే కమిషన్లతోనే కార్పొరేట్ ఆసుపత్రులను ఏర్పాటుచేసి, సినిమాలను సైతం నిర్మిస్తున్నారు. ఖరీదైన అసెట్స్ కొనుగోలు చేశారంటే ఎంత డబ్బులు బొక్కేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. బొత్స సత్యనారాయణ పార్టీలోనే ఉంటూ నాలాగే నిజాలు మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.

సకాలంలో కరువును ఎదుర్కోవడం మానేసి పవన్ కళ్యాణ్ పై విమర్శలా?
సకాలంలో కరువును ఎదుర్కోవడం మానేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని జైల్లో ఇబ్బందులు పెట్టడానికి అహర్నిశలు పడుతున్న శ్రమలో సగం, మనల్ని ఎన్నుకున్న ప్రజల కోసం సమయం వెచ్చించి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. వెయ్యి బస్సుల్లో ప్రజలను తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి అక్షితలు వేస్తే చూడాలనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తూ, ప్రజలు కరువుతో అల్లాడుతున్న పట్టించుకోకపోవడం దారుణం. ఒకవైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండగా, మరొకవైపు ఆర్థిక కరువుతో బాధపడుతూ కేంద్రాన్ని అవుట్ ఆఫ్ ద వేగా అప్పులు అడుగుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సరైన సమయంలో వారు సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తుఫానులు వచ్చి చెరువులు నిండితే అది తమ గొప్పతనమే నని చెప్పుకున్న పాలకులు, ప్రస్తుతం రాష్ట్రంలో కరువు తాండవిస్తున్న పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

పోలవరం గురించి పట్టించుకోవడమే మానేశారు. ఏడాది ఏడాదికి సమయాన్ని పొడిగిస్తూ, ప్రస్తుతం 2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పోలవరం నిర్మాణ ఖర్చు పెంచారు. కమీషన్లు దండుకున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడానికే పరిమితమయ్యారు.

నా ప్రాంతానికి నీరు అందించలేక పోతే నాకెందుకు ఈ పదవి అని కైకలూరులో వైకాపా ఎమ్మెల్యే తిరగబడ్డారు. పంటలను కాపాడుకోవడానికి ట్రాక్టర్ల ద్వారా రైతులు నీరు తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ల డీజిల్ కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు కూడా చివరకు గిట్టుబాటు అవుతాయో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఆరోగ్యంతో ఆటలాడుకుంటే బలయ్యేది రవి కిరణ్ రెడ్డే

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులతో ఆటలాడితే బలయ్యేది జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డే నని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు . ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఆటలు ఆడుకోవడం మానేయాలని సూచించారు. అన్ని తానే చెప్పి చేయిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి సునాయాసంగా తప్పించుకుంటారు. లండన్ లో సకుటుంబ సపరివార సమేతంగా చంద్రబాబు నాయుడు అరెస్టును చూసి ఆనందించిన జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయమే తనకు తెలియదని చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలను ధైర్యంగా వెల్లడించిన ప్రభుత్వ వైద్యులకు అభినందనలు. గతంలో తనని అరెస్టు చేసి లాక్ అప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్, ప్రభుత్వ వైద్యులు ఇటువంటి ధైర్యాన్ని చేయలేకపోయారు.. పొరుగు రాష్ట్రంలో జైల్లో గుండ్రాయిలా ఉన్న జగన్మోహన్ రెడ్డి చిన్నానకు ఆరోగ్య కారణాల రీత్యా బెయిలు మంజూరు చేశారు.

కానీ రెండు నెలలలోపే ఐదు కిలోల బరువు తగ్గి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. గుండె, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడైన చంద్రబాబు నాయుడు ని ఆసుపత్రికి పంపరా? అసలు మీరు మనుషులా… పశువుల అంటూ మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో మనుషులా…పశువులా అనడం మానేసి మనుషులా వైసిపి వాల్లా అంటున్నారన్నారు. నువ్వు ఇతరులకు ఏం చేస్తావో అదే తిరిగి నీకు వస్తుంది అన్నట్టు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని తప్పకుండా ఇంతకు ఇంత మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లించుకోవలసి వస్తుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించిన తర్వాత కూడా కేసు టేకప్ చేయకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆలస్యానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. కానీ 24 గంటల వ్యవధి వరకు కేసు తీసుకోకపోవడం అన్యాయం. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకోవాలని చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.ఈ దుర్మార్గపు ఆటను ఆపివేయాలని, లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

LEAVE A RESPONSE