- మూడేళ్ల నుంచి కోర్టుకు హాజరుకాని వారిని ఏమనాలి? పిలవని ప్రబుద్ధులను ఏమనాలి
- ఆ రెండు సంఘటనలు పార్లమెంటరీ వ్యవస్థకు మాయని మచ్చ
- ఆ వీడియో మార్ఫింగ్ అని చెప్పేయండి
- ఆంధ్ర శిశు పాలుని తప్పులను చూస్తోన్న ఢిల్లీ కృష్ణులు
- అమరావతి నుంచి రాజధాని తరలించడం అసాధ్యం
- నాలుగు మిలియన్ల చదరపు అడుగుల్లో టూరిజం ప్రాజెక్టా?
- దమ్ముంటే సస్పెండ్ చేయండి
- నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు
రాజ్యసభ ప్యానల్ స్పీకర్ స్థానంలో 32 ఆర్థిక నేరాల అభియోగాల కేసులు ఏ 2 నిందితునిగా కొనసాగుతున్న వ్యక్తిని కూర్చోబెట్టడం, ఒక ఎంపీ నగ్న వీడియో వెలుగులోకి రావడం పార్లమెంటరీ వ్యవస్థకు మాయని మచ్చ అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. పార్లమెంట్లో ఒకేసారి అక్కడ ఒక సంఘటన, ఇక్కడ మరొక సంఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురిచేసిందన్నారు. నన్ను చంపుతానన్న నా స్నేహితుడు మాధవ్… నన్ను అమ్మ నా బూతులు తిట్టినా స్నేహితుడు మాధవ్ ను ఇవాళ సాయంత్రానికి నిర్దోషి అని తేల్చేయండి.. లేదంటే ఆ వీడియోలో ఉన్నది ఆయనే అని చెప్పి ఏమి చేస్తారో చేసుకోండని రఘురామ కృష్ణం రాజు కోరారు.
ఆ వీడియో ను చూసి జనం గోల పెడుతున్నారని, మహిళలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. ఏదో అనుకొని చూస్తే, ఒళ్ళు గొగురు పొడిచే విధంగా ఉన్న వీడియోను చూసిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత లోక్ సభ సభ్యులను కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ ఎప్పుడూ మెడలో వేసుకునే బంగారు గొలుసు ను యధావిధిగా మార్ఫింగ్ వీడియోలలో డిజైన్ చేయడం కష్టమని సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు చెప్పారన్నారు.
నగ్న వీడియోలోను మాధవ్ మెడలో ఆ గొలుసు ఉన్నదని గుర్తు చేశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సకల శాఖామంత్రి స్పందిస్తూ సన్నాయి నొక్కులు నొక్కారని, గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ రాసలీల ఆడియో టేపులు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. ఏముందిలే అరగంటలో ఈ ఆడియో టేపుల వ్యవహారాన్ని తేల్చేస్తారని అంతా భావించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ఆడియో టేపుల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. ఈ వీడియో మార్పింగ్ వ్యవహారంపై ఫోరెన్సిక్ నివేదిక రావడానికి అంతే సమయం పడుతుందే మో నన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదన్నారు.
అత్యాచారము , హత్య కేసుల్లో నిందితునిగా ఉన్న గోరంట్ల మాధవ్ కు గతంలోనే ఎంపీ టికెట్ ఇచ్చారన్న ప్రజలు ప్రశ్నకు, అప్పుడు ఇంత నగ్న ఆధారాలు తమ పార్టీ నాయకత్వం వద్ద లేవని ఎద్దేవా చేశారు. రాజకీయాలలో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న రఘురామకృష్ణంరాజు, తనని హత్య చేస్తానని చెప్పినా, గోరంట్ల మాధవ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రముఖ దినపత్రికలన్నీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని పతాక శీర్షిక లతో ప్రచురించగా, సాక్షి దినపత్రిక మాత్రం అట్టడుగునా చిన్న లింకు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
ఆర్యవైశ్యులు అంటే తనకు ఎంతో గౌరవం అని, తమ ప్రాంత ఆర్యవైశ్యులంతా తనకు దన్నుగా ఉన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. చింతామణి నాటకం లోని పాత్ర పేరును మార్చి, కుల రహిత పాత్రగా చూపిస్తూ, నాటకాన్ని బతికించాలని కోరిన తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామకృష్ణ కోరినట్లుగా దమ్ముంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లు తనని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బట్టలు విప్పి చూపిన గోరంట్ల మాధవ్ ను కాదని, ప్రపంచ ఆర్యవైశ్య ప్రముఖుడు చెప్పినట్లుగా తనని బహిష్కరించాలన్నారు.
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంతా ఒక అభూత కల్పన అని, మాధవ్ మంచివాడేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పి ఉంటారన్న అనుమానాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. నగ్న వీడియో వ్యవహారంపై తమ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అది మార్ఫింగ్ వీడియో అని చెప్పయ్యాలంటూ రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. ఒకవేళ పొరపాటు జరిగిందంటే ఆ విషయాన్ని అయినా ప్రజలకు చెప్పాలన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణ, పెద్దాయన వెంకయ్య నాయుడు లాంటి లబ్ద ప్రతిష్టలు కూర్చున్న స్థానంలో 32 ఆర్థిక నేరాల అభియోగాల కేసులో ఎ 2 నిందితునిగా ఉన్న వ్యక్తి పానెల్ స్పీకర్ గా ఎన్నికై కూర్చోవడమా? అంటూ రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ప్రముఖులు కూర్చున్న స్థానంలో, ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడుగా విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి కూర్చోవడం చూసి మనసు చివుక్కు మని పించిందని అన్నారు. రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఆధారంగా తమ పార్టీకి ప్యానల్ స్పీకర్ పదవి లభించిందని తెలిపారు. పొద్దున లేచింది మొదలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి కే పానల్ స్పీకర్ పదవి కట్టబెట్టి బదులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ నేత కృష్ణయ్య వంటి వారికి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. తమ ముఖ్యమంత్రి నోటా బిసి జపం తప్పితే మరొకటి వినిపించదు కదా అని ఎద్దేవా చేశారు.
ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు రాజ్యసభ జరుగుతున్నదన్న సాకుతో వెళ్లకుండా ఉండరాదని సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరోక్ష సూచన చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ నిబంధన కేవలం ఎంపీల వరకు మాత్రమేనా?, ఎమ్మెల్యేలకు వర్తించదా? అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గత మూడేళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదని గుర్తు చేశారు. ఇదంతా ప్రార్థనలో మయమని తెలిసినప్పటికీ, మూడేళ్ల నుంచి కోర్టుకు హాజరుకాని వారిని ఏమనాలి?, పిలవని ప్రబుద్ధులను ఏమనాలి అంటూ ఆయన మండిపడ్డారు.
మహాభారతంలో శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణ పరమాత్ముడు క్షమించినట్లుగా, ఆంధ్రలో శిశుపాలుడు చేస్తున్న తప్పులను, ఢిల్లీలో కృష్ణులు గమనిస్తున్నారని, శిక్ష తప్పదంటూ… అమరావతి కి మద్దతుగాబిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా ప్రస్తావించారు.. గతంలో కంటే గట్టిగా బిజెపి నేతలు అమరావతికి మద్దతును తెలియజేస్తున్నారని చెప్పారు. కాసింత ఆలస్యమైన అమరావతికి మద్దతుగా సత్య కుమార్, రాజ్యసభ సభ్యుడు సృజనా చౌదరి, బిజెపి నాయకుడు ఆదినారాయణ రెడ్డి వంటి వారు తమ గళాన్ని వినిపిస్తున్నారని తెలిపారు. బిజెపి విధానం పట్ల అమరావతి రైతులు ఒకింత ఆగ్రహంతో ఉన్నప్పటికీ, త్వరలోనే అమరావతి రైతులకు ఊరట నిచ్చే మాటలను వింటామన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
అమరావతి నుంచి హైకోర్టు తరలించడం అన్నది అసాధ్యమని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. హైకోర్టు తరలింపు ప్రక్రియను ఎవ్వరూ అడ్డుకోలేరంటూ కొంతమంది మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అమరావతి నుంచి హైకోర్టు తరలించడం సాధ్యం కాదని, తాను ఈ విషయాన్ని ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తు చేశారు. ఇంకా ఇక్కడ నుంచి న్యాయస్థానం తరలింపు అన్న ప్రక్రియ ఉండదని తేల్చి చెప్పారు. లోక్ సభ, రాజ్యసభ ప్రొసీడింగ్స్ లలో ఈ విషయమై ప్రశ్నించిన సభ్యులకు కేంద్ర మంత్రులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ సచివాలయం 8 లక్షల చదరపు అడుగులలో నిర్మిస్తుండగా, ఋషికొండపై నాలుగు మిలియన్ల చదరపు అడుగులలో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతారా? అంటూ రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. టూరిజం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినాలుగు మిలియన్ల చదరపు అడుగులలో భవన నిర్మాణాలను చేపడుతున్నారని విమర్శించారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై పోలీసుల బలం లేకున్నా, ప్రజాబలంతో పోరాడుదామని చెప్పారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం గురించి, గతంలో తాను చెప్పిన అంశాలను, ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు.
ఋషికొండలో ఎంతటి ప్రకృతి విధ్వంసం జరుగుతుందో ప్రపంచం అంతటికి తెలుసునని, కాకపోతే ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానానికి తెలియదని అన్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు శాటిలైట్ చాయాచిత్రాలను తీసుకోవడం జరుగుతుందని, ఈ ఛాయాచిత్రాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లి, కోర్టుకు కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు. టూరిజం శాఖకు గతంలో ఒక ఎంపీ వద్ద సహాయకునిగా పనిచేసిన అధికారి , ప్రస్తుతం డిప్యూటేషన్ పై వచ్చి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కోర్టు ఆదేశాలను సదరు అధికారి ఉల్లంఘిస్తే, కోర్టు ఆదేశాల అతిక్రమణ కింద తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం ఉన్నదని గుర్తు చేశారు.