మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ పొగిడించుకున్నారు..అంతేగాని ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమీ చేయలేదు. టీడీపీ నాయకులు, ప్రతికలు, ఛానళ్లను తిట్టించడం తప్ప, కార్యకర్తలకు ఉపయోగపడే నిర్ణయాలు, వాళ్ల అభిప్రాయాలు, కష్టసుఖాలు తెలుసుకునే పని ఏ ఒక్కరూ చేయలేదు. రాష్ట్రంలో జరిగే అవినీతి, నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు గురించి తెలుసుకునే పనిచేయలేదు. ఎంతసేపూ ఆత్మస్థుతి, పరనింద అనే విధంగా వైసీపీ ప్లీనరీ జరిగింది. ప్లీనరీలో పార్టీకోసం నిలబడిన వారిని చాలా నిర్లక్ష్యం చేశారు. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ప్లీనరీలో ఎక్కడా కనిపించలేదు.
గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వైసీపీకి సెలవుచీటీ ఇచ్చేసింది. జగన్ విడిచినబాణం, వైఎస్ఆర్ తనయురాలు షర్మిళ జగన్ ముఖం చూడకుండా తెలంగాణకు వెళ్లిపోయింది. వైఎస్ఆర్ ఆత్మ ‘‘కేవీపీ’’ నిన్ను జైలుకు పంపిన పార్టీలోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ నీడ ‘‘సూరీడు’’ నీడ నీ నుండి మాయమైపోయింది. మరో చెల్లి సునీత నీ ముఖం చూడడానికి ఇష్టపడడం లేదు. జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన చెల్లి, నీ చిన్నాన్న కూతురు, నీతండ్రికి ఆత్మలాంటి కేవీపీ, నీ తండ్రి తన నీడలా చెప్పుకున్న సూరీడు ఎటుపోయారో కనిపించడంలేదు. నీతండ్రి నమ్మిన వ్యక్తులే నిన్ను వదిలివెళ్లిపోతే..ఇంకా రాష్ట్రప్రజలు నిన్ను ఎందుకు నమ్మాలి జగన్? నీ సొంతచెల్లి షర్మిళ నేను జగన్ విడిచిన బాణం అని చెప్పుకుంటూ వందల, వేల కిలోమీటర్లు నడిచింది నీ కోసం ..ఆమె కూడా నీ దగ్గర కనిపించే పరిస్థితి లేదు..నిన్ను రాష్ట్రప్రజలు ఎందుకు నమ్మాలో చెప్పాలి?
మీరు 95శాతం అని చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు…మీరు చెప్పిన ఒక్క మాటకైనా విలువ ఉందా జగన్? 2019 ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంలో వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఏడు సార్లు పెంచారు, ప్రజల్ని ధరలతో బాదడమే 95శాతం హామీలు అమలా? 9గంటల కరెంటు 12గంటలు ఇస్తామన్నారు, 7గంటలకే పరిమితం చేశారు..ఈ ఏడు గంటల్లో ఏడు సార్లు కరెంటు కట్ అవుతోంది. మేం ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానిలో కుంభకోణాలు జరిగాయని అరిచి గగ్గోలు పెట్టిన జగన్ నేడు ఏట్లో పోయే ఇసుకతో సొంత కుటుంబం పిచ్చి కంపెనీని అడ్డుపెట్టి వ్యాపారం చేసుకున్నారు..మీ 95శాతంలో ఇదికూడా భాగమేనా? బటన్ నొక్కుతున్నాను అంటున్న జగన్ నేడు రివర్స్ బటన్ నొక్కుతున్నారు. రూ.7,500కోట్లు పంచాయతీల నిధులను దారి మళ్లించి రివర్స్ బటన్ నొక్కారు. స్థానిక సంస్థలను డమ్మీలుగా చేశారు.
మీ సమయంలో పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్మన్లు అందరూ డమ్మీలు అయ్యారు.వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయ్యింది. మిమ్మల్ని నమ్ముకుని పనులు చేసిన కాంట్రాక్టర్లు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అర్థనగ్న ప్రదర్శన చేశారు…ఇందుకేనా ప్లీనరీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పొగిడించుకున్నారు?
మీరు ముఖ్యమంత్రిగా రాకముందు నుండి దేశంలో, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను నిలిపేసే హక్కు మీకు ఎవరిచ్చారు జగన్? 2017-2018లో మైక్రో ఇరిగేషన్ లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది…దాన్ని ఎందుకు ఆపేశారు? మైక్రో ఇరిగేషన్ రాయలసీమ ప్రాంతానికి చాలా ఆవశ్యకమైనది. దాన్ని ఈ మూడేళ్లుగా పడుకోబెట్టేశారు. బిందుతుంపరసేద్యం, డ్రిప్ ఇరిగేషన్, ఎపిఎంఐపీ ఎందుకు ఆపేశారో రాష్ట్ర ప్రజలకు ప్లీనరీలో చెప్పాల్సింది కదా? మూడు సంవత్సరాలు ఈ విధానాలను పడుకోబెట్టేశారు. ఎందుకు ఆపేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. వ్యవసాయ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖలు పూర్తిగా మూతబడిపోయాయి. ఈ శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జరగలేదు ఈ మూడేళ్లలో…ఈ శాఖలో ఖర్చు 30శాతానికి దిగజారిపోయింది…వంద రూపాయాలు చూపించి కేవలం రూ.30 ఖర్చు చేస్తున్నారు. ఈ మూడు శాఖలు రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైనవి, ఈ శాఖలనే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉన్నాడు. రోడ్డుపై గుంతలు పూడ్చడానికి దిక్కులేక యాక్సిడెంట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎమ్మెల్యేలు జిల్లాల్లోని సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వద్దకు వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం తొక్కే దమ్ములేకుండా పోయింది. ప్లీనరీలో పేర్ని నాని వాస్తవాలు చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దేనికీ పనికిరాం…మేమంతా డమ్మీలమే…మీరు మమ్మల్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. కేవలం జగన్ ను మాత్రమే పట్టించుకోండి…మేము మాత్రం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తాం, అక్రమ కేసులు పెడతాం…ఆత్మ హత్యలు చేసుకునేలా చేస్తాం…కానీ మీరు మాత్రం జగన్ మీద కోపం పెట్టుకోవద్దు అనే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమైన శాఖలను నిర్వీర్యం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయ్యాక సదరు కుటుంబాల పరిస్థితి ఏంటో జగన్ చెప్పాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో నాశనం అయినా మీకు ఓట్లే ముఖ్యమా జగన్ రెడ్డి? రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వానికి కేవలం రూ.5.20లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయారు.కానీ రాష్ట్రానికి రూ.8లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. బీసీలకు సబ్ ప్లాన్లో సంవత్సరానికి రూ.15వేల కోట్లు, ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు బీసీల సంక్షేమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో నిన్న ప్లీనరీలో ఎందుకు చెప్పలేదు? మీరు చేసిన మోసాలు ఎందుకు చెప్పలేదు? రూ.75వేల కోట్లు ఎస్సీ కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడేందుకు ఎన్ఎస్ఎఫ్డీసీ కింద వచ్చే సబ్సిడీ రుణాలను ఎందుకు నిలిపేశారో ప్లీనరీలో ఎందుకు చెప్పలేదు జగన్? ఎస్సీ సబ్సిడీ రుణాలను ఎందుకు నిలిపేశారో ఎందుకు చెప్పలేదు జగన్ రెడ్డి? ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు జగన్? ఎవరి పేరు చెప్పుకుని అధికరంలోకి వచ్చావో, అతనికి అండగా నిలబడిన వారందరినీ బయటకు తరిమేశారు..ప్రజలు నిన్ను ఎందుకు నమ్మాలో చెప్పాలి. కుటుంబ సభ్యులే నీ ముఖం చూడడానికి ఇష్టపడని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులే తమకు తాము డమ్మీలమని ప్రకటించుకునే పరిస్థితి ఉంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి జగన్ ?
వైసీపీ పార్టీ కాదు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇసుక, సిలికా, మద్యం, గనులతో వ్యాపారం చేసుకుంటున్నారు జగన్ రెడ్డి. మీకు ఎవరెవరు కమీషన్లు ఇస్తారో వాళ్లకు రాష్ట్ర సంపదను కట్టబెడుతున్నారు. రాష్ట్రాన్ని జగన్ హోల్ సేల్ గా, ఎమ్మెల్యేలు రిటైల్ గా అమ్ముకుంటున్నారు. మీ ప్లీనరీ వల్ల రాష్ట్ర ప్రజలంతా బస్సుల్లేక చిన్న బిడ్డలను పెట్టుకుని బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. టార్గెట్లు పెట్టి జనాలను సమీకరించి, డబ్బు, మద్యం ఇచ్చి ప్లీనరీని నడిపించుకున్నారు. అందుకే వైసీపీ ప్లీనరీ ఒక డ్రామా.. కొడాలి.నాని తో ఎటువంటి బూతులు తిట్టించారు? పక్కనే మీ తల్లిని గౌరవాధ్యక్షురాలు అని చిన్న కుర్చీలో కూర్చోబెట్టారు. కొడాలి.నాని బూతులు తిడుతుంటే విజయమ్మకు ఆనందంగా ఉందా? వైసీపీని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు అంతా వెలివేశారు…ఇంకా ప్రజలకు ఏమీ సంబంధం? వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ అయిపోయింది. వైసీపీ డ్రామా కంపెనీ మీద రైతులు, ప్రజలు తిరగబడే రోజులు ముందు ముందే ఉన్నాయి…తస్మాత్ జాగ్రత్త జగన్ రెడ్డి..