ఉభయగోదావరి జిల్లాలలో వైకాపాకు ఒక్క స్థానం దక్కదు

Spread the love

పిట్టల దొర సర్వే చూసి నవ్వుకుంటున్న జనం
టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తామన్న ప్రకటన చేయకముందే 50 స్థానాలకే వైకాపా పరిమితమవుతుందన్న ఆత్మసాక్షి సర్వే
ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత 15 స్థానాల కంటే తక్కువగానే గెలిచే ఛాన్స్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రానున్న ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలలో అధికార వైకాపా అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా గెలిచే ఛాన్స్ లేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఏ స్థానం కూడా వైకాపా గెలిచే ఛాన్సే లేదని పందాలకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. 25 లోక్ సభ స్థానాలకు 25 స్థానాలను వైకాపా గెలుస్తుందని అంటుంటే ఆశ్చర్యం వేసి నేను చాలెంజ్ చేస్తున్నాను. జూదానికి నేను వ్యతిరేకం అయినప్పటికీ, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏ ఒక్క స్థానమైనా గెలుస్తామని వైకాపా తరఫున ఎవరైనా పందాలు కాస్తామంటే , స్థానికంగా పందెం కాయడానికి పందెం రాయుళ్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో వైకాపా 20 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందని రాష్ట్ర ప్రజల సొమ్ము ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏటా ప్రభుత్వం నుంచి పొందుతున్న టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల దినపత్రిక తన సర్వేలో వెల్లడించిందట. ఆ సంస్థకు ఐదవ సంవత్సరం పేమెంట్ కూడా అందినట్లు ఉంది. అందుకే ఈ రకమైన సర్వే అంచనాలను వెల్లడించి ఉంటుంది .

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఈ సర్వే నిర్వహించామని, దాని అంచనాలు ఇవి అని… పేర్కొనడం చూసి ఇది ఒక పిట్టల దొర సర్వే అని ప్రజలు నవ్వుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . టిడిపి, జనసేన పార్టీ కలిసి పోటీ చేయడం వల్ల నా నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం. ఇటువంటి పార్లమెంట్ స్థానాలు మరెన్నో ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, గతంలో తెదేపా గెలిచిన విజయవాడ, గుంటూరు లలో వైకాపా అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు.

డబ్బులు తీసుకొని సర్వే అంచనాలను వెల్లడించిన వారి అభిప్రాయాన్ని సొంత పేపర్లో పబ్లిష్ చేసుకోవడం సిగ్గుచేటు. వ్యక్తిగతంగా నేను కూడా సర్వేలను చేయిస్తున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత గతంలో పోటాపోటీగా ఉన్న స్థానాలలో కూడా ఇప్పుడు టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆత్మసాక్షి సర్వే అంచనా ప్రకారం వైకాపా 50 స్థానాలలో గెలుస్తుందని పేర్కొన్నారు. మా పార్టీకి సర్వే అంచనాలలో తక్కువ స్థానాలను ఇస్తే కేసులు పెట్టి వేధిస్తారని కాబోలు 50 స్థానాలు ఇచ్చి ఉంటారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఈ సర్వే టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించక ముందు చేసినట్టుగా ఆత్మసాక్షి వెల్లడించిన సర్వే అంచనాలు చెబుతున్నాయి. టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసిపోయి పనిచేసుకుంటున్నారు. అయినా సాక్షి మీడియా విషం కక్కుతూనే ఉంది. టిడిపి, జనసేన పార్టీల క్యాడర్ కలిసి పోవడం లేదని, తమ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టారని కాపులు రోదిస్తున్నట్లుగా సాక్షి మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసి ప్రచురిస్తుంది. ఏ కాపులు రోధిస్తున్నారని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లా అంటూ నిలదీశారు.

తాము ఓడిపోతామని ముందే తెలిసి రోదిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి, జనసేన క్యాడర్ కలిసిపోవడం లేదని వార్తా కథనాలను ప్రచురించి, ప్రసారం చేస్తున్న సాక్షి మీడియా ఏడుపు ఎందుకన్నారు. ఈ రెండు పార్టీలు కలవకముందు, కలిసే అవకాశమే లేదని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కలిసిన తర్వాత క్యాడర్ కలవలేదు అంటూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి 15 సీట్లు మించి వచ్చే అవకాశాలు లేవు. ఇంకా తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . టిడిపి, జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చెబితే, ఆయన అదే విషయాన్ని పరోక్షంగా చెప్పారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ముఖ్యమంత్రికి ఒక రూల్… ప్రతిపక్ష నేతలకు మరొక రూలా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకరు రూల్… ప్రతిపక్ష పార్టీల నేతలకు మరొక రూలా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసి నిర్వహించే సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్యాకేజీ స్టార్… దత్త పుత్రుడు, అన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు… ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం తప్పు కాదా?? అని నిలదీశారు . గతంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుని కాల్చివేయాలని, సముద్రంలో పడేయాలని వ్యాఖ్యానించింది జగన్మోహన్ రెడ్డి కాదా?. చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డిని క్షమించారని గుర్తు చేశారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ప్రతిపక్ష నేతలు తనని దూషించారని అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తనపై తానే సుమోటోగా కేసును నమోదు చేయించుకోవాలన్నారు. ఎంతోమంది ఫిర్యాదులు చేసిన ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని చెప్పారు.. ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఆత్మగౌరవం ఉండదా?, వారిని అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా విమర్శించవచ్చు కానీ… అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుల నుంచి మొదలుకొని సర్పంచ్ స్థాయి వ్యక్తి వరకు ఎవరిని ఏమన్నా ప్రతిపక్ష నేతల పై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని విమర్శించారనే కారణంతో బండారు సత్యనారాయణ పై కేసు నమోదు చేసిన పోలీసులు 41A నోటీసు ఇచ్చి , అరెస్టు చేయడం ఏమిటో అంతుచిక్కడం లేదు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా 41A నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరైతే ఆయన్ని కూడా అరెస్టు చేయరనే గ్యారెంటీ ఏమిటన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన బెయిల్ కాలాన్ని న్యాయస్థానం పొడిగిస్తూ, విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరిస్తుంటే న్యాయస్థానాలు కూడా కన్నెర్ర చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధర్మం ఎప్పుడూ నెగ్గ దని, న్యాయం జరగడానికి కొద్దిగా సమయం పడుతుంది.

ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది అని అంటే దానికి న్యాయస్థానాలే కారణమని రఘురామకృష్ణం రాజు అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ను ఆదివారం రాత్రి పోలీసులు నిర్బంధించారని, ఆయన ఇంటికి ఆలీ గ్రీవ్ దుస్తులు ధరించిన పోలీసులు, సాధారణ పోలీసులు వెళ్లి ఇంటి దర్వాజాలను బద్దలు కొట్టే ప్రయత్నం చేయడం దారుణం. బండారు సత్యనారాయణ ఎక్కడో మాట్లాడితే, గుంటూరులో కేసు పెట్టడం ఏమిటో… పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి కనీస నిబంధనలు పాటించకుండా అరెస్టు చేయడం ఏమిటో అంతుచిక్కడం లేదు. మాజీ మంత్రిని అరెస్టు చేసిన పోలీసులు వృద్ధుడని ఆయన్ని కనికరిస్తే తప్పా, నన్ను గతంలో చిత్రహింసలకు గురిచేసినట్లు గురి చేస్తే ఆయన చనిపోయే ప్రమాదం ఉంది. 41A నోటీసు ఇచ్చారన్న కారణంగా హౌస్ మోషన్ తిరస్కరించినట్లు తెలిసింది. అదే 41A నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

సిబిఐ కేసే నమోదు చేయలేదు… ఈ డీ కేసులతో చంద్రబాబుకు సంబంధం లేదు
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ రిమాండు రిపోర్టును స్కాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రాలు తమ వాదనలను వినిపించారు. ప్రధానంగా అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధనలకు భిన్నంగా సిఐడి పోలీసులు వ్యవహరించారని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి వారు తీసుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ కేసును 2021 నవంబర్లో సిఐడి నమోదు చేసింది. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వ అధికారులపై ఎవరైనా పిల్ వేస్తే వారు భయాందోళనకు గురవడం వల్ల వ్యవస్థలు స్తంభిస్తాయన్న ఉద్దేశంతో సెక్షన్ 13 ను సవరించి అవినీతి నిరోధక చట్టంలో 17A నిబంధనను పొందుపరిచారు.

పార్లమెంట్ ఆమోదించిన స్టాచ్యూరిటీని మార్చడానికి మనకు హక్కు లేదని సూటిగా హరీష్ సాల్వే న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . కేసు ఎప్పుడు జరిగిందన్నది ఇన్ మెటీరియల్ అని, కేసు ఎప్పుడు నమోదు చేశారన్నది ముఖ్యమని హరీష్ సాల్వే పేర్కొన్నారన్నారు . ఈ సందర్భంగా 2014 లో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం జరిగిందని, సిబిఐ కేసు నమోదు చేయాలని కోరుతూ యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్ ను, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేసు నమోదు చేయమని చెప్పలేమంటూ న్యాయస్థానం తోసిపిచ్చింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలతో ధర్మాసనం ఒక దశలో ఏకీభవించినట్లే కనిపించింది.

సిఐడి తరఫున ముకుల్ రోహత్గి వాదనలను వినిపిస్తూ 2018 లోనే స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ కేసులో సిబిఐ విచారణ ప్రారంభించిందని తెలిపారు. అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే కేసు విచారణ ప్రారంభం కావడంతో, ఈ కేసుకు 17A నిబంధన వర్తించదని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ట్రయల్ కోర్టు ముందు సిబిఐ కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించినట్లుగా సిఐడి తరపు న్యాయవాదులు ఎటువంటి ఆధారాలను ఫైల్ చేయలేదు. సరి కదా ఆ వాదన కూడా వినిపించలేదు. హైకోర్టులో మాత్రం ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. 2018 కి ముందు కేసు నమోదయిందని ఈ కేసు కు 17A వర్తించదని సిఐడి తరపు న్యాయవాదులు, న్యాయస్థానానికి విన్నవించడంతో, న్యాయస్థానం కూడా అంగీకరించి తీర్పునిచ్చింది.

హైకోర్టులో ఫైల్ చేసిన దస్త్రాలను, సుప్రీం కోర్టుకు నివేదించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ పై సిఐడి కేసు నమోదు చేసింది. అందులో ఎవరెవరి పేర్లనో చేర్చి, చివరిలో A37 గా చంద్రబాబు నాయుడు పేరును చేర్చింది. 2021లో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కోర్టులో వాదనలు విన్న సెషన్ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించారు. సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు సమర్ధించింది. సిఐడి పెట్టిన కేసు గురించి మాత్రమే స్టేషన్ కోర్టులో సిఐడి వాదనలను వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో సిబిఐ కేసు అన్నది నమోదు చేయలేదు. నకిలీ ఇన్ వాయిస్ లను సృష్టించారన్న కారణంగా ఈ డీ కేసు నమోదు చేసింది. ఫేక్ ఇన్వాయిస్ సృష్టించినప్పటికీ, నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పరికరాలను సరఫరా చేయడం జరిగింది. అయినా నైపుణ్య శిక్షణ కేంద్రాలకు యంత్ర పరికరాలు సమకూరాయా?, లేదా అన్న విషయం గురించి మాత్రం సిఐడి మాట్లాడడం లేదు.

నైపుణ్య శిక్షణ కేంద్రాలలో ఎక్విప్మెంట్ లేదన్నట్లుగా, తమ కళ్ళకు కనిపించడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ విషయాలు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వస్తాయి. సిఐడి నమోదు చేసిన కేసు మీద విచారణ కోరుతున్నారా?, లేకపోతే గాలిలో నుంచి తీసుకువచ్చిన సిబిఐ నమోదు చేసిన కేసు గురించి మాట్లాడుతున్నారా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సిబిఐ కేసు అన్నది నమోదు చేయలేదు. కానీ న్యాయస్థానానికి సిబిఐ కేసు నమోదు చేసినట్లుగా ముకుల్ రోహత్గి లాంటి సీనియర్ న్యాయవాది, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వాదనలు వినిపించారు. ఈడీ నమోదు చేసిన కేసులో విచారణకు చంద్రబాబు నాయుడు ని పిలవలేదు. ఈ డి తాను నమోదు చేసిన కేసులను విచారించాలని ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ని కానీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను కోరలేదు. సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా రఘురామిరెడ్డి అనే ఘణపాఠి నంద్యాలకు వెళ్లి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి తీసుకొని వచ్చారు.

ఈరోజు జరిగిన వాదనలను పరిశీలిస్తే సోమవారం నాడు కచ్చితంగా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అంతకంటే ముందే సెషన్ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడుకు సెషన్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . సేషన్ కోర్టులో బెయిల్ లభిస్తుందని ఆశాభవాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంగళ్లు కేసులో ముగ్గురు మందస్తు బెయిల్ కోరగా, హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సుప్రీంకోర్టు సమర్ధించింది. అంగళ్లు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెబుతూ చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలను కోరుతూ వచ్చింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడం ఖాయం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతోపాటు, ఫైబర్ గ్రిడ్ కేసులోనూ ఆయనకు బెయిల్ లభిస్తుందన్న ఆశాభావాన్ని రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు.

Leave a Reply