Home » బాబు ఎందుకు ఏడ్చాడో చెప్పాలి

బాబు ఎందుకు ఏడ్చాడో చెప్పాలి

– చివరి అస్త్రంగా ఏడుపు అస్త్రం ప్రయోగించిన బాబు
– నాడు ఎన్టీఆర్ ను.. నేడు భార్యను అడ్డుపెట్టుకుని బాబు దుర్మార్గమైన రాజకీయం
– ఇంతకాలం ప్రజల్ని ఏడిపించిన బాబు… ఏడ్చేందుకు ఎందుకు ప్రయత్నించాడో..!?
– బాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడలేదు, మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి.
– చంద్రబాబు ఒక జిత్తులమారి.. సమయానికి తగ్గట్టు జిత్తులు వేయడంలో ఘనాపాటి
– ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఏడ్చేసి సానుభూతి పొందేందుకు బాబు జిత్తులు
– అసెంబ్లీకి మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయ నిష్క్రమణ ఖాయం
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్
వరుస ఓటములతో టీడీపీ పుట్టి మునిగిపోవడంతో, రాజకీయ అమ్ములపొదిలో ఏ అస్త్రాలు లేక, చివరి అస్త్రంగా ఏడుపు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభ ప్యానల్ స్పీకర్అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
సచివాలయంలోని మీడియా పాయింట్ లో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. పదవికన్నా, మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు ఎవ్వరూ తనకు ముఖ్యం కాదని, ఈరోజు తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగటం పట్ల మరోసారి బాబు తన నీచ మనస్తత్వాన్ని రుజువు చేసుకున్నారని దుయ్యబట్టారు. పదవి కోసం చంద్రబాబు, ఎన్ని ఘోరాలు, నేరాలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఇంతకాలం ప్రజల్ని ఏడిపించిన చంద్రబాబు.. మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు.. నాడు ఎన్టీఆర్ ను.. నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని తూర్పూరబట్టారు. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఏడ్చేసి సానుభూతి పొందాలంటే ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు అసెంబ్లీని నిష్క్రమించడం కాదని, రాజకీయాల నుంచే నిష్క్రమణ ఖాయమని చెప్పారు. చంద్రబాబు భార్య గురించి సభలో ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడలేదని, మాట్లాడారని మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఇవాళ శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యతపై సుదీర్ఘంగా మాట్లాడుతున్న సందర్భంగా సభలో ఓ సంఘటన జరిగింది. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ శాసన సభకు రానని, వస్తే మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే వస్తానని శపథం చేసి సభనుంచి వాకౌట్‌ చేశారు. ఇలాంటి శపథం ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆతర్వాత ప్రెస్‌మీట్‌లో, టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. “నా భార్యను కించపరిచే మాటలు అన్నారు. ఇది నీచమైన రాజకీయం. అందుకే రాజకీయాల మీద విరక్తి కలిగింది. అందుకే అసెంబ్లీకి వెళ్లనని చెప్పాను” అంటూ కంటతడి పెట్టారో లేక బావురుమని ఏడ్చారో ఏదో జరిగింది.
చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌లో ఎందుకు ఏడ్చారో తెలియదు. చంద్రబాబు ఏడ్చారో, కన్నీళ్లు పెట్టారో, విలపించారో… వారికి సంబంధించిన మీడియా ఏరకంగా టీవీ ఛానళ్ళలో చూపించినా, రేపు ఏరకంగా రాసుకున్నా చంద్రబాబు నాయుడు ఏడ్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా, చంద్రబాబు గురించి తెలిసినవారికి, రాష్ట్ర ప్రజలకు, నాకు అర్థం అవుతోంది.
మేము సూటిగా అడుగుతున్నాం.. అసెంబ్లీలో నేను కానీ, నా ముందు మాట్లాడివాళ్లు కానీ, నా తర్వాత మాట్లాడి మంత్రులు, ఎమ్మెల్యేలుకానీ ఎక్కడా… “మీ భార్యను కానీ, మీ కుటుంబసభ్యుల గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు, ప్రస్తావించలేదు.” ఆ విధంగా మేము మాట్లాడినట్లు ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు చూపించకుండా గుడ్డ కాల్చి మొహాన వేసినట్లు ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన రాజకీయం.
– చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నారు.
రాజకీయాలు అంటే విరక్తి కలిగిందని అన్నారు. గతంలో మీరు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కూడా టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌లో బోషడీకే అని తిట్టించారు. ఆ సందర్భంగా జగన్‌  … ఫలానా ఆయన నన్ను ఇలా తిట్టారు, అది తప్పు అని బహిరంగంగానే చెప్పారు. అదే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మేము ఏదైనా తప్పు మాట్లాడితే ఆధారాలు చూపించండి. అసెంబ్లీలో రికార్డ్స్‌ ఉన్నాయి కదా? వాస్తవాలను కప్పిపుచ్చుతూ, సానుభూతి కోసం ఏదో మాట్లాడేస్తే సరిపోతుందనుకోవడం సరైన విధానం కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశాను.
చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఒక జిత్తులమారి. ఏ సమయానికి ఏ జిత్తు వేయాలో ఆ జిత్తు వేయగల స్వభావం కలిగిన వ్యక్తి. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అందితే కాళ్లు, అందకపోతే జుట్టు పట్టుకునే స్వభావం అని అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
చివరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవలేని దుస్థితికి ఆ పార్టీ వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనుమరుగు అవుతుంది. అందుకే ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో గుడ్డకాల్చి మా మీద వేసి, అందువల్ల తాను నిష్క్రమిస్తున్నానంటూ చెప్పడం దుర్మార్గపు రాజకీయ ఎత్తుగడలో భాగమే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
చంద్రబాబు నాయుడు అర్థాంగి భువనేశ్వరి ని ఏదో అన్నామని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ గారి కుమార్తె అయిన ఆమెను మేము కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదని చేతులు జోడించి నమస్కరించి మరీ ఆమెకు చెబుతున్నాం. మహిళలను అనేటువంటి స్వభావం మాది కాదు. అనని విషయాలను అన్నట్లుగా చిత్రీకరించి రాజకీయలబ్ది పొందాలనుకుంటున్నారు చంద్రబాబు.
నాడు ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, ఆయనను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ తన భార్యను అడ్డు పెట్టుకుని… ఆమె పేరును ఉపయోగించుకుని సానుభూతి పొందాలని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం.
ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఆయన ఏడవడం ఏంటి..?. ఎన్టీఆర్ ను మించిన నటుడు చంద్రబాబు. తన అద్భుతమైన నటనతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు.
ఇక మూటముల్లె సర్దుకోవాల్సిన సమయం చంద్రబాబుకు ఆసన్నమైంది. నిన్న అసెంబ్లీకి రాకుండా తన ఛాంబర్‌లోనే కూర్చున్నారు. కుప్పంలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. రాజకీయంగా టక్కుటమారా విద్యలు తెలిసిన చంద్రబాబు అసెంబ్లీలో సంబంధం లేని అంశాలు మాట్లాడేసి రెచ్చగొట్టేలా ప్రయత్నించారు. సభలో ప్రత్యక్షంగా నేను చూశాను. ఆయన స్పీకర్‌గారిని మాట్లాడిన మాటలు ఏంటి? చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.
మా మీద బురదచల్లేందుకు ప్రయత్నించి, బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టే మమ్మల్ని అడ్డుపెట్టుకున్నారు. దానికి కారణం ఆయనను మేమేదో అన్నామని కాదు. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులతో పాటు, తన వారసుడిని రంగంలోకి దించినా ఫలితం శూన్యమని తెలియడం, మరోవైపు కుప్పంలో కూడా చేజారిన పరిస్థితి ఏర్పడటం.. రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం తప్ప, పెరగడం లేదని ప్రజల్లో సానుభూతి పొందేందుకు తన అర్థాంగి, ఆఖరి అస్త్రంగా ఎన్టీఆర్‌ గారి కుమార్తెను అడ్డుపెట్టుకుని సింపథి అస్త్రాన్ని ప్రయోగించారు.
పదవులు నాకు అవసరమా.. పదవులు ఆశించనని మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు శాసనసభలో మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానని చెప్పారు, అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో, కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా…? ఆయనకు పదవే సర్వస్వం. పదవికన్నా మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు ఎవ్వరూ చంద్రబాబుకు ముఖ్యం కాదు. పదవి కోసం ఆయన ఎన్ని ఘోరాలు చేశారో ప్రజలు మర్చిపోరు. అలాంటిది ఇప్పుడు మీకేదో జ్ఞానోదయం అయినట్లు పదవి వద్దు అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
రాష్ట్రంలో దుర్మార్గం జరుగుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఏం దుర్మార్గం జరుగుతుందో చెప్పాలి. రాష్ట్రంలో చక్కటి పాలన సాగుతోంది. ప్రజలు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. గత రెండున్నరేళ్ళుగా ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి సందర్భాల్లోనూ ఈ విషయం రుజువు అయింది. ఇవాళ బీసీలు కూడా వైఎస్‌ జగన్‌ గారి పక్షానికి వచ్చేశారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన వల్ల అందరూ ఆకర్షితులవుతున్నారు.
ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు రాజకీయాలు చేయలేక.. చంద్రబాబు పెద్ద పెట్టున ఏడ్చేసి సానుభూతి పొందాలనుకున్నారు. ఈ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలంతా గమనించాలి. ఎన్టీఆర్‌ను, ఆయన కుమార్తెను అడ్డం పెట్టుకుని ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటున్న చంద్రబాబుకు తగిన సమయంలో మరింతగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. మేము ఎన్టీఆర్‌గారి కుమార్తె, చంద్రబాబు అర్థాంగిని ఒక్కమాట కూడా అనలేదు. అనకపోయినా, అన్నట్లు చెబుతున్న మీరు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
సభలో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబే మొట్టమొదట… బాబాయ్‌ సంగతి తేలాలి, గొడ్డలి సంగతి తేలాలి.. అని ఆన్‌ రికార్డు మాట్లాడారు. బాబాయ్‌, గొడ్డలి, తల్లి, చెల్లి అంటూ.. మొదట రెచ్చగొట్టింది ఎవరు..? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అంశంపై చర్చ జరగాలన్నారు. చర్చలో భాగంగా… మాధవరెడ్డి హత్య, వంగవీటి మోహన్‌రంగా హత్యలపై చర్చ జరగాలన్నాం. ఎన్టీ రామారావుగారిపై వెన్నుపోటు అంశంపై చర్చ జరగాలన్నాం. సమయానకూలంగా ఆ సందర్భంలో వచ్చే మాటలను పట్టుకుని ఏదోదో అనుకుంటే ఎలా కుదురుతుంది.
చంద్రబాబు మరి గొడ్డలి, వివేకానందరెడ్డి అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఎందుకు అలా మాట్లాడారు? ఆ మాటలు రిపీటెడ్ గా అనాల్సిన అవసరం ఉందా? ఏదో గందరగోళం చేసి, తప్పు మా మీద నెట్టి సింపథి పొంది బయటకు వెళ్లిపోవాలని చంద్రబాబు యత్నం చేశారు. ఇది ఒక సింపథి ఎత్తుగడ. తన అమ్ములపొదిలో అన్ని అస్త్రాలు అయిపోవడంతో చివరి అస్త్రంగా బాబు ఏడుపు అస్త్రం ప్రయోగించారు. మళ్లీ పార్టీని బతికించుకోవాలనే తాపత్రయం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.
లోకేష్‌ రాజకీయాలకు పనికిరాడని మేము చాలా విమర్శలు చేశాం కానీ, అనైతిక విమర్శలు మేము ఎప్పుడూ చేయం. రాజకీయపరమైన అంశాలపైన చర్చ చేయాలంటే, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలే తప్ప, కన్నీళ్లు పెట్టి, బావురుమని సింపథి పొందాలనుకోవడం సరికాదు. చంద్రబాబుకు దైర్యం లేదా? అభూత కల్పనలు సృష్టించి, వైయస్సార్‌ సీపీపై బురదచల్లాలని చివరి డ్రామా. చంద్రబాబు రాజకీయ నిష్క్రమణ ఖాయం.
రాజకీయాల్లో ఏడ్చి సింపథి పొందాలనుకోవడం ఏదో ఒక ఆశ తప్ప, సముద్రంలో కొట్టుకుపోయేవాడు బతుకుదామనుకునే చిన్న ఆశతో గడ్డి పుల్లను పట్టుకుంటాడో.. ఇదీ అంతే. చంద్రబాబుది కూడా అలాంటి ప్రయత్నమే. నాయకుడు అన్నవారు ఎవరైనా ధైర్యంగా, దమ్ముగా రాజకీయాలు చేస్తారని అన్నారు.
ఈరోజు చంద్రబాబు నవ రసాలు పండించాడు. ఎన్టీఆర్‌ అన్నట్లుగా.. బాబు ఎన్టీఆర్ కంటే పెద్ద నటుడు. చంద్రబాబు బాధ పడితే… ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, ఆయన కుమారుడు ఓడిపోయినప్పుడు, కుప్పంలో ఓడిపోయినప్పుడు బాధపడాలి. ఓడిపోయినప్పుడు మేమూ బాధపడ్డాం. ఆవేశానికైనా, మరోదానికైనా అర్థం పర్థం ఉండాలి.

Leave a Reply