మారుతున్న కాలం
పెరుగుతున్న వేగం
మనిషి ఆలోచనలు, అలవాట్లు….
జీవనశైలిలో పెనుమార్పులు
అనవసరపు ఒత్తిడులు
నిత్యం సంఘర్షణలు…..
అన్నిటి నుండి అందరికీ
ఆరోగ్యం ,ఆనందం లభించే
నవ్య యాగం, దివ్య యోగం
ఆనంద యానం
ఆధ్యాత్మిక ,శారీరక ,సమాహారాల
సమతుల్య శోధనా సామర్థ్యం
యోగా ధ్యానం ……!!
పూర్వీకులు
పరిశీలించి ,పరిశోధించి
రంగరించి, మేళవించి
అనుభవించిన తత్త్వం
నేటి విజ్ఞాన శాస్త్రం
అందించలేని
అత్యుత్తమ ఆరోగ్య సూత్రం..!!
మనస్సును శరీరంతో లయం చేసే
ఏకత్వదిశ ప్రయాణం
శ్వాసపై ధ్యాస నిలుపుతూ
ఆలోచనలను కళ్లెంపెట్టి ఉంచే
ఆహ్లాద మంత్రం…!!
అన్ని అవయవాలు
ఆసనాల ద్వారా
ఆరోగ్యాన్ని సంతరించుకొని ..
అంతఃకరణ చతుష్టయాన్ని
అదుపులోకి తెచ్చుకుని
ముందుకు సాగే గమనం…!!
కుల ,మత ,భేద భావం లేని
సంకల్ప సాధనం…
సద్వివేచనగల
భారతీయ సంస్కృతి
జీవన విధానంలో
ఓ అంతర్భాగమైన
చైతన్య స్వరూపం..!!
కోవిడ్ విపత్తు వేళ…..
రోగనిరోధక శక్తిని
పెంచడంతో పాటు
ఆత్మ నిశ్చలత సాధనలో
సమగ్ర ఆరోగ్య విధానంగా
నేడు విశ్వవ్యాప్తంగా అందరికీ
ఆమోదయోగ్యమైన
అభయ యోగం.!!
అద్భుతమైన యోగ భావనను
ప్రపంచానికి అందించిన భారత్
విశ్వగురువు పాత్రలో వర్ధిల్లేలా…
విశ్వమానవ కల్యాణం కోసం “మానవత్వం కోసం యోగా”
ఇతివృత్తంతో
ప్రతినిత్యం యోగాను ఆచరించాలి
ప్రపంచ ఐక్యతను చాటి చెప్పాలి..!!
– నలిగల రాధికా రత్న.