ఉపాధ్యాయులం.. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు:
కాలం మారిందని గుర్తించి తీరాలి. విద్యార్థులతో వెనుకటి లాగానే వ్యవహరిస్తామంటే కుదరదు. ఇటీవల రాయచోటిలో విద్యార్థుల దాడికి గురై, ఉపాధ్యాయుడు మరణించాడని విన్నాం. రాయచోటి లోనే ఒక పదో తరగతి విద్యార్థి టీచరు గోడకుర్చీ వేయించాడని ఆత్మహత్యాయత్నం చేశాడని ఇవాళ పేపర్లలో చూశాం. ఇంకెక్కడో పిల్ల వాడిని మందలించిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై పిల్ల వాడి తండ్రి దాడి చేశాడనీ
చదివాం.
ఈ సంఘటనలన్నీ మనకు హెచ్చరికలే. జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగభద్రతకూ ప్రమాదం రావచ్చు కూడా.
“పిల్లలు ఎలా వచ్చినా, ఏం చేసినా గమ్మున ఉండాలా మరి?” అన్న ప్రశ్న వస్తుంది. అలా ఉండలేం కూడా. క్లాస్ తన కంట్రోల్ లోకి రాకుండా ఏ టీచరైనా ఏం చెప్పగలరసలు?
మరి పరిష్కారమేంటి?; ఆలోచించాలి. పిల్లలను కొట్టడమూ, తిట్టడమూ, అవమానించడమూ మాత్రం చేయకూడదు. గుంజీలు తీయించడం, గోడకుర్చీలు వేయించడం, చెంపదెబ్బలు కొట్టించడం వగైరాలను ఖచ్చితంగా వదిలేయాలి. అవి పిల్లలకు లాభం కలగజేస్తాయో లేదో తరువాత సంగతి. మనకు మాత్రం నష్టమే కలగజేస్తాయి.
బోధనలో మన సమర్ధత, నిజాయితీలు మనకు రక్షక కవచాలుగా పని చేస్తాయి. ఈ విషయాన్ని అందరమూ గమనించాలి. ‘మంచి ప్రిపరేషన్ తో, బోధన పట్ల అంకితభావంతో పని చేసే టీచర్ దగ్గర వెర్రి వేషాలు వేయడానికీ కాస్త జంకు ఉంటుంది ఎంత అల్లరోళ్ళకైనా’ అనేది మన అనుభవం లోని విషయమే గదా.
అయినా కూడా మనల్ని, క్లాసునీ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటూనే ఉండవచ్చు. ఇవాళ స్కూల్ ప్రభావం కంటే ఫోన్లూ సినిమాలూ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న సందర్భంలో అందరం ఉన్నాం.
ఈ పిల్లలు మనతోనే ఇలా ఉంటున్నారనుకుని ఆవేదనకో, ఆశ్చర్యానికో గురికానక్కర్లేదు మనం. ఇంటా బయటా అన్ని చోట్లా వస్తోన్న మార్పే మన దగ్గరా వస్తోంది. మొదట దాన్ని అంగీకరించాలి మనం.
ఇలాంటి వాళ్ళను డీల్ చేయడానికి మనకు నష్టం కలిగించని కొత్త పద్ధతులు వెతుక్కోవాల్సిందే, తప్పదు. క్లాస్ ను డిస్టర్బ్ చేసేవాళ్ళను HM room కు పంపించి కూర్చోబెట్టడం , తలిదండ్రులను పిలిపించి చెప్పడం, మిగిలిన క్లాస్ మొత్తాన్నీ మన గ్రిప్ లోకి తెచ్చుకోవడం ద్వారా ,వీళ్ళకు వేరే ఆప్షన్ లేకుండా చేయడం…-ఇవేవీ నచ్చకపోతే, వర్కవుట్ అవకపోతే ఇంకేవో తిప్పలు పడాల్సిందే తప్ప మన పీకల మీదకు తెచ్చుకోరాదు. సిచ్యుయేషన్ ని బట్టి లౌక్యంగా తెలివిగా మసలుకోకతప్పదు.
ముఖ్యమైన విషయం.. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదువులో వెనుకబాటుకు అవమానించకూడదు. మనం పెట్టే పరీక్షల ప్రామాణికత చాలా తక్కువ. అవగాహన, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత లాంటి విషయాల్లో individual differences ఉండటమనేది సహజ ప్రకృతి సూత్రం. కాబట్టి ఒకే రకం academic performance అందరి నుంచీ ఆశించడం అశాస్త్రీయం. పిల్లలకు కూడా ఆ విషయం చెప్పాలి. ఇతరులతో పోల్చుకోనక్కరలేదనీ, తమతో తాము పోల్చుకుంటూ క్రమంగా మెరుగయేందుకు కృషి చేయమనీ ప్రోత్సహించాలి.
లవ్వులూ గివ్వులూ ఎక్కువవుతున్నాయి. లవ్ లెటర్స్ లాంటివి దొరికినప్పుడు వాళ్ళను పర్సనల్ గా పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలి తప్ప క్లాస్ అందరిముందూ అవమానకరంగా మాట్లాడరాదు. ఆ లెటర్ ను స్టాఫ్ రూమ్ లో నవ్వుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఎగ్జిబిట్ చేయరాదు.
ఆడపిల్లలను వేధించడం, మాదకద్రవ్యాలు సేవించడం వంటి వాటిని ఎట్టి పరిస్థితి లోనూ సహించమని స్పష్టంగా అర్ధమయేలా తరచుగా చెబుతూ ఉండాలి. వాటివల్ల జరిగే నష్టాలను భూతద్దంలో చూపాలి.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ సమస్య ఎక్కువ. దురదృష్టవశాత్తూ అనేకానేక కారణాల వల్ల అన్ని వర్గాల సమాహారంగా ఉండవలసిన ప్రభుత్వ పాఠశాల కేవలం వేరే ఆప్షన్ లేని, చదువు కూడా ఒక పెట్టుబడి సాధనమే అని ఇంకా గుర్తించని, పేద, అమాయక, నిరక్షరాస్య, దళిత, బలహీన వర్గాల పిల్లలు మాత్రమే మెజారిటీగా మిగిలిన చోటై పోయింది.
ఈ పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యాబుద్ధులపై శ్రద్ధ పెట్టేంత అవగాహనా, తీరికా, డబ్బూ లేని వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా, ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ఉపాధ్యాయ యూనియన్ లే పూనుకుని ఈ విషయంలో శిక్షణా తరగతులు/అధ్యయన వేదికలు నిర్వహిస్తే బాగుంటుందేమో.
– రాఘవ