– ప్రపంచదేశాల ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టారు
– పార్టీలు, రాజకీయాల కంటే దేశం ముఖ్యమని చాటారు
– అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలి
– శశిథరూర్ భుజం తట్టిన మోదీ
– ఎంపీల బృందానికి ప్రధాని మోదీ కితాబు
ఢిల్లీ: ‘‘మీరు దేశం కోసం చేసిన కృషి, తపనను దేశం గుర్తించింది. మీ వాదనా పటిమ, విశ్లేషణతో పాక్ కుట్రబుద్ధిని ప్రపంచదేశాలకు చాటారు. మన వైపు కన్నెత్తిచూసే వారికి మీ వాదన ఒక హెచ్చరికగా పనిచేసింది. పార్టీలు, రాజకీయాలు పక్కనపెట్టి దేశం కోసం మీరు పనిచేసిన తీరును అభినందిస్తున్నా’’ని ప్రధాని మోదీ ఎంపీల బృందాన్ని ప్రశంసించారు.
పాకిస్తాన్‌పై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి.. వివిధ దేశాల రాజధానులలో పర్యటించిన పలు పార్టీల ప్రతినిధి బృందాల సభ్యుల ను ప్రధాని మోదీ అభినందించారు. మీ అద్భుతమైన వాదనాపటిమతో పాక్‌ను దోషిగా నిలబె ట్టారని ఎంపీలను ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధానమంత్రి మోదీ మంగళవారం ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ప్రతినిధి బృందాల సభ్యులు తమ పర్యటన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. ఈ బృందాలు మొత్తం 33 విదేశీ రాజధానులు మరియు యూరోపియన్ యూనియన్‌ను సందర్శించాయి.
వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఈ బృందాలకు బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, బైజ్యంత్ పండా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే వంటివారు నాయకత్వం వహించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో జాతీయ ఐక్యత సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు కూడా పాలక కూటమి సభ్యులతో కలిసి విదేశాల్లో భారత వాణిని బలంగా వినిపించారు.
ఈ ప్రతినిధి బృందాలలో కేంద్ర మాజీ మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ వంటి ప్రముఖ మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు.
ఈ ప్రతినిధి బృందాలలో నాలుగు పాలక కూటమికి చెందిన ఎంపీల నేతృత్వంలో పర్యటించాయి. వీటిలో రెండు బీజేపీ, ఒకటి జేడీ(యూ), మరొకటి శివసేన పార్టీలకు చెందినవి. మిగిలిన మూడు బృందాలకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నాయకత్వం వహించారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) పార్టీల నుంచి ఒక్కో ఎంపీ చొప్పున ఈ బృందాలకు నేతృత్వం వహించారు.