– బాణావత్ పాములు నాయక్ -సీతమ్మ నాయక్ దంపతులు
తాడేపల్లి: ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న పూరి గుడిసె కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ ల మంత్రి నారా లోకేష్ కి జీవితాంతం రుణపడి ఉంటామని బాణావత్ పాములు నాయక్-సీతమ్మ నాయక్ దంపతులు అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో గత ఏడాది జులై 1వ తేదీన జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుగాలి కాలనీకి చెందిన బాణావత్ పాములు నాయక్ -సీతమ్మ నాయక్ దంపతుల నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు, పెంచిన రూ.4వేల పెన్షన్ అందజేసి అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో పూరిల్లు కురిసి ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం తరపున తమకు పక్కా నివాస గృహం నిర్మించాలని పాములు నాయక్ దంపతులు సీఎం చంద్రబాబు ని కోరారు.
స్పందించిన ఆయన.. పక్కా గృహాన్ని వీలైనంత త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాములు నాయక్ ఇంటి నిర్మాణ పనులకు నిర్మాణాన్ని పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వీలుపడలేదు.
ఈ నేపథ్యంలో బుధవారం ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాములు నాయక్ దంపతులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు మా పూరి గుడిసెకు వచ్చి పెంచిన పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో పాటు మా కష్టాలు అడిగి తెలుసుకుని పక్కా గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు.
చంద్రన్న ఇచ్చిన హామీ మేరకు స్థానిక పార్టీ నాయకుల సహకారంతో పక్కా గృహం నిర్మాణం పూర్తి చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ బాబుకు, స్థానిక నాయకులు కొల్లి శేషుకు, పార్టీ నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనంద భాష్పాలతో తెలిపారు.