బీజేపోళ్ళ పర్యటన వల్ల తెలంగాణకు ఒరిగేదేమి లేదు
‘డబుల్ ఇంజిన్’’ కాదు… మీది ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’
కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉంది….
మీ స్టీరింగే అదానీ చేతుల్లో ఉంది: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానిది ‘డబుల్ ఇంజిన్’’ కాదు… మీది ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని,మీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదానీ లాంటి కార్పోరేట్ల అదానీ చేతుల్లో ఉందన్నారు.
బీజేపోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా?. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..?’’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. రైతు ఆత్మహత్యలు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత అమిత్ షాకు లేదని తెలిపారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, బీజేపోళ్లా మాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా, ఆదిలాబాద్ లో సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్ తో మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు. అమిత్ షా.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత తొమ్మిదిన్నర తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి పొందాలనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు ఇస్తామని, సీసీఐని పునరుద్దరిస్తామని ఏవైనా హమీలు ఇస్తారని తెలంగాణ ప్రజలు ఆశించారని, కానీ రాజకీయ విమర్శలు చేసి పోయాడు తప్ప … ఆయన పర్యటన వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదని తెలిపారు.