• పాఠశాలలు ఐకమత్యం, సౌభ్రాతృత్వ భావనలను పెంపొందించాలి
• ఇలాంటి భారతీయ మౌలిక విలువలను పాటించడమే అసలైన దేశభక్తి
• మాతృభాషలో విద్యార్థులు మాట్లాడుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా పాఠశాలలదే
• మాతృభాష ద్వారానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సాంస్కృతిక భావన అలవడుతుంది
• హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
హైదరాబాద్: దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యువత సన్నద్ధులై ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఐకమత్యం, శాంతి-సామరస్యాలను, సౌభ్రాతృత్వ భావనను చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని, ఈ విషయంలో పాఠశాలలు పోషించే బాధ్యత అత్యంత కీలకమని ఆయన సూచించారు. భారతీయ జీవన విధానంలోని ఇలాంటి మౌలిక విలువలను పాటించడమే అసలైన దేశభక్తి అన్న ఆయన, చిన్నతనం నుంచే ఇతరుల అభిప్రాయాలను, సంస్కృతిని గౌరవించడం, పరస్పర సహనంతో కూడిన జీవన విధానాన్ని వారిలో అలవర్చాని ఆయన సూచించారు. సంకుచిత భావన, అన్ని అంశాల్లోనూ విభేదించడం వంటి ఆలోచనలనుంచి చిన్నారులను దూరంగా ఉంచాలన్నారు.
కుల, మత, ప్రాంత, జాతి, లింగ వివక్షల్లేని సుహృద్భావ పూరిత వాతావరణం దేశవ్యాప్తంగా ఉండాలని మన పెద్దలు ఆశించారన్న ఉపరాష్ట్రపతి, వీటిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించినప్పుడే భారతదేశం సంస్కారవంతమైన, శక్తివంతమైన దేశంగా నిలుస్తుందన్నారు. నవభారత, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి దోహదపడే ఈ అంశాలను పాటిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. శనివారం, రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణజయంతి వేడుకలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, విద్యావ్యవస్థలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ప్రతి పాఠశాలలోనూ నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ని అమలుచేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల మేధ, సృజనాత్మకత పెరగడంతోపాటు నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. పాఠశాలల్లో మాతృభాష వినియోగంపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కొన్ని పాఠశాలలు మాతృభాషను తక్కువ చేస్తూ ఆంగ్లంలోనే మాట్లాడటం, రాయడం చేసేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదని అయితే మాతృభాషలో నేర్చుకోవడం ద్వారానే విద్యార్థుల్లో విషయ అవగాహన, సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు. దీంతోపాటుగా ఆత్మవిశ్వాసంతోపాటుగా సాంస్కృతిక భావన పెంపొందుతాయన్నారు. ప్రాథమిక స్థాయి వరకైనా విద్యాబోధన మాతృభాషలో ఉండాలని నూతన జాతీయ విద్యావిధానం స్పష్టం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రాథమిక విద్యతో పాటు పరిపాలనలోనూ, న్యాయస్థానాల్లోనూ మాతృభాషకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
భారతీయ కళలు మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించి, జీవితంలో మార్గనిర్దేశం చేస్తాయన్న ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిలో భాగమైన కళలకు ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. విద్యలో పరమార్ధం మార్కులు కాదని, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటమే అన్న ఆయన, ఉపాధ్యాయు ఈ దిశగా ఉన్నతమైన విలువలకు చిరునామాగా వారిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని పరిపూర్ణం చేసుకునే దిశగా అంకితభావంతో కృషిచేయాలని సూచించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, కష్టపడి చదవడం ద్వారా ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. అనుకున్నది సాధించిన తర్వాత మనం సమాజానికి ఇతోధికంగా సహాయపడాలని సూచించారు.
సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఇందు కోసం జీవన విధానంలో మార్పులు చేసుకోవడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆయా కాలాలకు, వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా మన పెద్దలు ఆహారాన్ని తెలియజేశారన్న ఆయన, సమయానికి నిద్ర పోవడం, మేలుకోవడం, నిత్యం వ్యాయామం, యోగను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి, హెచ్ పీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వాకాటి కరుణ, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.