Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణా నదిపై నాలుగు ప్రాజెక్టులకు అనుమతిపై రాయలసీమ సాగునీటి సాధన సమితి హర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా నదిపై నిర్మిస్తున్న నాలుగు ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతులు ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ లో సవరణలు చేయడం పై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి హర్షం వెలిబుచ్చారు. శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…

తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతులు లేవని గత సంవత్సరం జులై 15 న క్రిష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొన్నారని, దీనికి అభ్యంతరం తెలుపుతూ జులై 17, 2021 నే KRMB కి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు వ్రాసామని ఆయన తెలిపారు. ఈ లేఖలలో వివరణలతో కూడిన పలు సూచనలను పొందుపరచడమైనదని ఆయన తెలిపారు.

రాష్ట్ర విభజన చట్టం -2014 లోని 11 వ షెడ్యూల్ ప్రకారం పైన పేర్కొన్న ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్నారని ఈ చట్టం ప్రకారం పై ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా గుర్తించి సవరణలతో కూడిన తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి పలు పోరాటాలు చేసిందని ఆయన గుర్తు చేసారు.

అంతేగాక ఈ సవరణలకై గత సంవత్సరకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు అనేక సందర్భాలలో వినతి పత్రాలను సమర్పిస్తూనే రాయలసీమ నాలుగు జిల్లాల వ్యాప్తంగా 6 రౌండు టేబుల్ సమావేశాలు, నంద్యాల మరియు విజయవాడ కేంద్రంగా సత్యాగ్రహా దీక్షలు నిర్వహించి రాయలసీమ సాగునీటి సాధన సమితి అలుపెరగని పోరాటం చేసిందని దశరథరామిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం చేపట్టిన సిద్దేశ్వర జలదీక్ష సందర్భంగా నిర్వహించిన అనేక గ్రామ స్థాయి సమావేశాలలో కూడా ఈ అంశంపై రైతులను జాగృత పరస్తూ, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరిగిందని ఆయన అన్నారు.. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయి దౌత్యం చేపట్టాలని కూడా రాయలసీమ సాగునీటి సాధన సమితి ముఖ్యమంత్రికి అనేక సందర్భాలలో విజ్ణప్తులు కూడా చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణా యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరణలకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి స్వయంగా తీసుకుని పోయిన ముఖ్యమంత్రి కి అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో బాసటగా నిలిచిన రాయలసీమ రైతాంగానికి, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దశరథరామిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE