విశాఖలో అదానీ సంస్థకు 130 ఎకరాలు: ఏపీ కేబినెట్‌ ఆమోదం

అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. త్వరలో జనాభా లెక్కలు జరగనున్న నేపథ్యంలో బీసీ జనగణన చేపట్టాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చేనెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు.

Leave a Reply