Suryaa.co.in

Andhra Pradesh

19,761 కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో 19761.8 కోట్ల రూపాయలతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లలో 9 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉండగా, 3 ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని, మరో 11 ప్రాజెక్ట్‌లు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్‌ అవార్డు కాలేదని తెలిపారు.

జాతీయ రహదారి 71 పరిధిలో 2237.99 కోట్ల రూపాయలతో చేపట్టిన రేణిగుంట-నాయుడు పేట సెక్షన్ 6 లేన్లు అభివృద్ధి పనులు 2024 జనవరి 31 నాటికి పూర్తి కావలసి ఉండగా ప్రస్తుతం 48.40% పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఎన్‌హెచ్‌ 71 పరిధిలో 1852.12 కోట్లతో చేపట్టిన మండపల్లి నుండి పీలేరు నాలుగు లేన్ల రహదారి 2025 జనవరి 14 నాటికి పూర్తి కావలిసి ఉండగా ఇప్పటికి 11.51% పనులు మాత్రమే పురోగతి సాధించింది.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే నాలుగులేన్ల రహదారిలో భాగంగా ఎన్‌ఈ 7 సెక్షన్‌లో చేపట్టిన 3 పనులకుగాను 1306.96 కోట్లతో వ్యయంతో బేతమంగళ నుండి బైరెడ్డిపల్లి వరకు రహదారి పనులు 2024 అక్టోబర్ 10 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 26.45% పురోగతిలో ఉందని, 2007 కోట్లతో చేపట్టిన బైరెడ్డిపల్లి-బంగారుపాలెం ఎన్‌హెచ్‌ పనులు 2025 జూన్ 7 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 0.07% పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

1288.54 కోట్లతో చేపట్టిన బంగారుపాలెం-గుడిపాల జాతీయ రహదారి నిర్మాణ పనులు 2024 అక్టోబర్ 4కి పూర్తవ్వాల్సి ఉండగా 29.99% పురోగతిలో ఉన్నాయి. అలాగే జాతీయ రహదారి 716బిలో చిత్తూరు-తాట్చూర్ సెక్షన్‌లో చేపట్టిన మూడు పనులకు గానూ 1768.33 కోట్ల రూపాయలతో చేపట్టిన వరదరాజుల-కామరాజుపేట 6 లేన్ల రహదారి పనులు 2024 డిసెంబర్ 5 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 25.61% పురోగతిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
1303.29 కోట్లతో చేపట్టిన వీరకావేరి-పొండవక్కం ఎన్‌హెచ్‌ పనులు 2025 జనవరి 24కి పూర్వవ్వాల్సి ఉండగా 17.86% పనులతో పురోగతిలో ఉందని, 1105.27 కోట్లతో చేపట్టిన పొండవక్కం-కన్నిగాయిపెయిర్ రహదారి పనులు 2025 జనవరి 23 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 4.00% పురోగతిలో ఉన్నాయని అన్నారు.

అలాగే జాతీయ రహదారి 716లో రేణిగుంట-కడప-ముద్దనూరు రోడ్డులో పాపాగ్ని నదిపై అప్రోచ్ రోడ్డుతో పాటు 82.18 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రహదారి పనులు 2025 జనవరి 31 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 24.79% పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 12951.68కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ది పనులు గ్రౌండ్‌ అయి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు మంత్రి చెప్పారు.

1989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందని, 4820.72 కోట్లతో చేపట్టాల్సిన మరో 11 ఎన్‌హెచ్‌ పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నిరంతర ప్రక్రియని మంత్రి తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందాయని గడ్కరీ తెలిపారు. అంతర్రాష్ట్ర ప్రాముఖ్యత, వనరులు అందుబాటు, ట్రాఫిక్ స్థాయి, కనెక్టివిటీ అవసరాల దృష్ట్యా కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ రహదారినీ జాతీయ రహదారిగా ప్రకటించే ప్రతిపాదనేదీ పరిగణలో లేదని మంత్రి తెలిపారు.

 

LEAVE A RESPONSE