Suryaa.co.in

Andhra Pradesh

1998 బ్యాచ్ సబ్ ఇన్స్‌పెక్టర్స్ ఆత్మీయ సమ్మేళనం అపూర్వం

-ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే ..
-1998 ఎస్ఐ బ్యాచ్ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1998 వ బ్యాచ్ గా ఉద్యోగ విధులలో చేరి అంచలంచెలుగా ఎదిగి వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు తమ 25 వసంతాల వేడుకలను( సిల్వర్ జూబ్లీ ఫంక్షన్) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ(టిఎస్పిఏ)లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి హెచ్ జె దొర, అడిషనల్ డిజిపి, డైరెక్టర్ ఆఫ్ టిఎస్పిఏ వివి శ్రీనివాసరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆనాటి సామాజిక స్థితిగతులు, నేర తీవ్రత, అదుపు చేయడానికి చేపట్టిన చర్యలను గురించి గుర్తు చేసుకున్నారు. ఇందులోనే లా అండ్ ఆర్డర్, ఏ ఆర్, ఏపీ స్పెషల్ పోలీస్ విభాగం అధికారులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి 280 అధికారులు హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆహుతులందరినీ ఘనంగా సన్మానించుకోవడంతోపాటు, ఫోటో గ్యాలరీ, డాక్యుమెంటరీ చిత్రం ద్వారా 1998 ప్రాంతంలోని తమ వ్యక్తిగత అనుభవాలు, సన్నివేశాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

విధి నిర్వహణలో భాగంగా అప్పటి బ్యాచ్ లోని 22 మంది అధికారులు వివిధ సందర్భాలలో మరణించిన విషయాలను జ్ఞాపకం చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనై ఉద్విగ్నక్షణాలను అనుభవించడం గమనార్హం. అనంతరం మృతి చెందిన అధికారులకోసం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆ సమయంలో నెలకొన్న అసాంఘిక కార్యకలాపాలు, నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కఠినమైన శిక్షణద్వారా పోలీస్ అధికారులను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో స్టైఫండరీ బ్యాచ్ ను తీర్చిదిద్ది ప్రత్యేక అధికారులుగా పోలీస్ అకాడమీలో తీర్చిదిద్దడం జరిగిందని మాజీ డిజీపి హెచ్ జె దొర వివరించారు. సెమిస్టర్ విద్యా పద్ధతిని ప్రవేశపెట్టి చట్టము, న్యాయము, వాటి అమలు చేసే విధానంలో నూతన ఒరవడిని తీసుకురావడం అద్భుత పరిణామం అన్నారు.

అనంతరం వీరిని గ్రేహౌండ్స్, అధునాతన కమాండర్ ట్రైనింగ్, ఫీల్డ్ ఆపరేషన్స్ కి పంపడం, నిర్ణీత సమయంలో 17 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడం వంటి కఠిన తర యుద్ధ రీతులను అంది పుచ్చుకోవడంద్వారా 1998వ బ్యాచ్ పోలీసు అధికారుల చరిత్రలోనే ఒక ప్రత్యేక బ్యాచ్ గా రూపుదిద్దుకోవడం జరిగిందని హెచ్ జె దొర, వివి శ్రీనివాసరావు చేయడం జరిగింది.

సంఘవిద్రోహశక్తులను, నక్సలైట్లను సమర్థవంతంగా అణిచివేయడంలో ఈ బ్యాచ్ అధికారుల పాత్ర అనిర్వచనీయమని వారు పునరుద్ఘాటించారు. ఈ బ్యాచ్ పట్ల అతిథులుగా వచ్చిన అధికారులంతా కొనియాడడంతో వీరి శక్తి సామర్థ్యాలు సత్ఫలితాలనిచ్చాయనే భావన సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరిలో కనిపించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని వక్తలు తెలిపారు.

ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్టికల్ రీడింగ్ వంటి శిక్షణద్వారా ఈ అధికారులను మరింత ప్రత్యేకత కలిగిన అధికారులుగా తీర్చిదిద్ధిందనే చెప్పవచ్చని వారన్నారు. ఈ బ్యాచ్ అధికారులు ప్రస్తుత పోలీస్ అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆనాడు వారు తీసుకున్న శిక్షణా తరగతుల తాలూకు జ్ఞాపకాలను వివరిస్తూ మరింత స్ఫూర్తివంతంగా పోలీసు అధికారులు ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐ జి టి. మురళీకృష్ణ, అప్ప డిఐజి రమేష్ నాయుడు, గ్రేహౌండ్స్ అధికారి బాటి, రిటైర్డ్ పోలీస్ అధికారి జయంతి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE