– పాల్గొన్న టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
అన్నమయ్య సంకీర్తనలను మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో రూపొందించిన అదివో.. అల్లదివో.. పాటల పోటీ కార్యక్రమం మొదటి షెడ్యూల్ బుధవారం పూర్తయింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమయ్య కొత్త సంకీర్తనలను 15 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువ కళాకారులతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. అన్నమయ్య రచించిన ప్రముఖ సంకీర్తన అదివో అల్లదివో… పేరునే పెట్టామన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి గతంలో ఆవిష్కరించారని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచన రాగానే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్రకు తెలిపానని, ఆయన ఎంతో చక్కగా ఈ కార్యక్రమ రూపకల్పన చేశారని కొనియాడారు. మొదట చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుండి యువ కళాకారులను పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ షెడ్యూల్ లో మూడు ఎపిసోడ్లకు సంబంధించి రికార్డ్ చేశారని చెప్పారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, సిఈవో జి.సురేష్‌కుమార్, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ప్రముఖ గాయకులు ఎస్పీ శైలజ, పారుపల్లి రంగనాథ్ పాల్గొన్నారు.