– ఆ డీఏ కూడా గత ఏడాది జనవరి 1 నుంచి చెల్లించాలి
– చర్చల పేరుతో మంత్రుల సబ్ కమిటీ హంగామా
– రెండు డీఏలు, పీఆర్సీ ప్రకటిస్తారని విపరీత ప్రచారం
– కేవలం ఒకే ఒక్క డీఏ ప్రకటనతో సరిపెట్టిన చంద్రబాబు
– ఉద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించని చంద్రబాబు
– మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగు నాగార్జున ధ్వజం
తాడేపల్లి:: మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురు చూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది..
చంద్రబాబు గారు.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది?. ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా పీఆర్సీ ఛైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించడం లేదు.
సీపీఎస్, జీపీఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. ఇప్పుడేమో సీపీఎస్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి, అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కబుర్లు చెబుతున్నారు. మరోవైపు ఓపీఎస్ తీసుకొస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు.
ఇంకా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్ మాటెత్తడం లేదు. పోలీసులకు మాత్రం ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామంటున్నారు. మొత్తం మీద ఉద్యోగులకు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.
ఇప్పుడు ఒక్క డీఏ ప్రకటించి, దీపావళి కానుక అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగులందరినీ దగా చేస్తున్నారు. నిజానికి ఈ డీఏ కూడా గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. పోలీసులకు మాత్రం ఒక విడత ఈఎల్ ప్రకటించారు. అది కూడా మొత్తం ఒకేసారి కాకుండా నవంబరులో సగం, వచ్చే జనవరిలో సగం రూ.105 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు.