– ఎంవి కెనస్టర్ అనే నౌక ద్వారా 42,500 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను నైజీరియాకు తరలిస్తున్నారు
– పవన్ కళ్యాణ్, మనోహర్ లకు చిత్తశుద్ది ఉంటే ఈ నౌకలో తనిఖీలు చేయాలి
– పవన్ ను తీసుకువెళ్ళిన తరువాత మంత్రి నాదెండ్లకు కమీషన్లు పెరిగాయి
– మనోహర్ కలెక్షన్ల కోసమే కాకినాడలో ఉంటున్నారు
– రైస్ మిల్లర్ల కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తే, దానిలో ఎనిమిది శాతం కమీషన్ల కింద వసూలు
– కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది
– 5 నెలలుగా కూటమి ప్రభుత్వం దీనిపై ఏం చేస్తోంది?
– రెండు చెక్ పోస్ట్ లు, కస్టమ్స్ తనిఖీలు దాటి నౌకలోకి బియ్యం ఎలా చేరింది?
– బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే సీజ్ చేసిన బియ్యాన్ని వదిలేశారని ఎలా సమర్థించుకుంటారు?
– మీరు అధికారంలో ఉండి… వైయస్ఆర్ సిపిపై ఆరోపణలు ఎలా చేస్తారు?
– కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ సినీఫక్కీలో చేసింది హంగామానే
– కలెక్టర్ తనిఖీలు చేసి సీజ్ చేసిన తరువాత పవన్ మళ్ళీ సీజ్ చేయమడం ఏమిటి?
– యాంకరేజీ పోర్ట్ పూర్తిగా ప్రభుత్వానికి చెందినది
– మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
గుంటూరు: ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యంను ఎంవి కెనస్టర్ అనే నౌక ద్వారా ఎగుమతి చేస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు సంచలన ఆరోపిణలు చేశారు.
దీనిపై తనిఖీలు చేసే ధైర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్ లకు ఉందా అని ప్రశ్నించారు. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, దీనిని తనిఖీ చేయడం ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ చిత్తశుద్దిని వారు నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు.
గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా జరుగుతున్న అంశంపై నిత్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లు మాట్లాడుతున్నారు.
బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ, రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న పట్టాభి ఆగ్రో సంస్థ అధినేత కృష్ణారావు, ఉరఫ్ శ్రీనివాస్.. ఈయన మన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు వియ్యంకుడు.
పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా తాజాగా నైజీరియాకు 42,500 టన్నుల బియ్యం లోడ్ తో ఎంవి కెనస్టర్ అనే నౌక నైజీరియాకు వెళ్ళేందుకు సిద్దంగా ఉంది. సముద్రంలో అలజడి కారణంగా ఇంకా కొంత రైస్ దీనిలో లోడింగ్ చేయాల్సి ఉన్నందున డీప్ సీ పోర్ట్ లో ఈ నౌక నిలిచి ఉంది. ఈ నౌకలోని బియ్యాన్ని తనిఖీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్ లకు ఉందా?
కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా ఎందుకు ఈ అక్రమ రవాణాను అరికట్టలేక పోయారు? ఇది మీ అసమర్థత కాదా? వ్యవస్థలను నిర్వహించడంలో మీరు వైఫల్యం చెందినట్లు కాదా? పౌరసరఫరాలశాఖ ఏర్పాటు చేసిన రెండు చెక్ పోస్ట్ లను దాటి, పీడీఎస్ బియ్యం ఎలా సముద్రంలోని నౌకలోకి వెళ్ళింది?
కలెక్టర్ సీజ్ చేసిన బియ్యంను బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి వదిలేశామని ఎలా సమర్థించుకుంటున్నారు? మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సిపి గత పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం తనిఖీలకు పవన్ కళ్యాణ్ ను తీసుకువెళ్ళిన తరువాత, మంత్రి నాదెండ్లకు కమీషన్లు పెరిగాయి. కాకినాడలో పవన్ కళ్యాణ్ హంగామా సినీఫక్కీలో జరిగింది. సీజ్ ద షిప్ అంటూ ఆయన వేసిన ఆర్డర్ చూసి అంతా నిజమే అని అనుకున్నాం. ఒకసారి కలెక్టర్ సీజ్ చేసిన నౌకను మళ్ళీ మళ్ళీ సీజ్ చేయడం చూస్తే ఇదంతా హైడ్రామా అని అర్థమవుతోంది.
నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ లో ఏదేదో మాట్లాడారు. కాకినాడ పోర్ట్ ద్వారా గత అయిదేళ్ళలో విచ్చలవిడిగా బియ్యాన్ని అక్రమ రవాణా చేశారని ఆరోపించారు. మన రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున ఇతర దేశాలకు అన్ని అనుమతులతోనే బియ్యం ఎగుమతి అవుతుంటోంది. ఒడిస్సా, చత్తీస్ ఘడ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్ట్ ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
యాంకరేజ్ పోర్ట్ నుంచి తక్కువ ఖర్చుతోనే ఎగుమతులు చేసుకునే వీలు ఉంది. నడిసముద్రంలో నిలిచి ఉన్న నౌకలోకి పడవల్లో సరుకులను తీసుకువెళ్ళి లోడింగ్ చేస్తారు. దీనివల్ల ఫ్లాట్ ఫాం చార్జీలు పడవు. ప్రభుత్వంకు సంబంధించిన ఈ పోర్ట్ లో అనేక మందికి ఉపాధి లభిస్తూ ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. మంత్రి మనోహర్ కలెక్షన్ల కోసమే కాకినాడలో ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో రైస్ మిల్లర్ల కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తే, దానిలో ఎనిమిది శాతం కమీషన్ల కింద వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
పీడీఎస్ బియ్యంను అక్రమ రవాణా చేసే వారిని పట్టుకోవాల్సిన మంత్రి మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ ద్వారా ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులు చొరబడితే ఏం చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే పోర్ట్ భద్రతపై మాట్లాడటం మీ అసమర్థతకు నిదర్శనం. పోర్ట్ భద్రతపై బాధ్యత వహించాల్సింది ఎన్డీఏ ప్రభుత్వాలు కావా?
నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొత్త వాదనను తీసుకువచ్చారు. ఒక పత్రికలో మెయిన్ హెడ్డింగ్ తో దీనిపై వార్తను ప్రచురించింది. ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తరువాతే అక్రమ బియ్యం రవాణా జరిగిపోతునట్లు రాశారు. అరబిందో తీసుకున్నది యాంకరేజీ పోర్ట్ కాదు. కాకినాడ డీప్ సీ పోర్ట్ ని. గతంలో కెవి రావు అనే వ్యక్తికి చెందిన సంస్థ పరిధిలో ఉన్న సీ పోర్ట్ లో 41.2 శాతం వాటాను అరబిందో తీసుకుంది.
కంపెనీల మధ్య షేర్ల కొనుగోళ్ళు, అమ్మకాలు సహజం. మంత్రి మనోహర్ దీనిపై మాట్లాడుతూ కెవి రావు మెడమీద కత్తిపెట్టి అరబిందో ఈ వాటాను తీసుకుందని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఈనాడు పత్రికకు చెందిన రామోజీరావు కూడా గతంలో తన సంస్థల్లోని వాటాలను ఇతర సంస్థలకు విక్రయించారు. ఎవరు ఆయన మెడమీద కత్తి పెడితే ఆ వాటాలను విక్రయించారు? మంత్రి మనోహర్ దీనికి సమాధానం చెప్పగలరా?
అరబిందో నిర్వహిస్తున్నది సీ పోర్ట్. ఈ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులు చాలా స్వల్పంగా జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఎగుమతి చేయాలంటే లోడింగ్, అన్ లోడింగ్, ప్లాట్ ఫాం చార్జీలు ఇలా చాలా ఖర్చు అవుతుంది. యాంకరింగ్ పోర్ట్ తో పోలిస్తే సీ పోర్ట్ నుంచి ఎగుమతులు ఎక్కువ వ్యయంతో ఉంటాయి.