Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కావు

-ఈ ప్రజాస్వామ్యం మన దేశానికి పనికి రానిది
-అధికార వికేంద్రీకరణ, చట్ట బద్ద పాలన వస్తేనే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది
-రాజనీతి స్ట్రాటజీస్(రాష్ట్ర) ఆత్మీయ సమ్మేళనంలో లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ

ప్రజలకు అర్దం కానీ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో జనంపై రుద్దారని, ఈ ఎన్నికల వ్యవస్థ ఈ దేశ ప్రజలకు పనికి వచ్చేది కాదని లోక్ సత్తా కన్వీనర్ డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ అన్నారు.రాజనీతి స్ట్రాటజీస్ (రాష్ట్ర) సంస్థ హైదరాబాద్, ఎఫ్. టి . సి.సి. ఐ సంస్థ కే.ఎల్.ఎన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

రాజకీయాల్లో ఎన్నో నిరాశలు ఉన్నా.. అన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయని, వాటివల్లే మన దేశంలో అభివృద్ధి జరుగుతుందని జయ ప్రకాష్ నారాయణ తెలిపారు. ఈ అభివృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న 15 ఏళ్ళల్లో అందరి జీవితాల్లో ఆర్థిక సుస్థిరత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరో రెండు ప్రధాన హామీలు కూడా ఉన్నాయన్నారు. అందులో ఒకటి రుణమాఫీ కాగా మరొకటి దళిత బంధు అన్నారు. మొత్తం ఈ 8 గ్యారంటీల వల్ల అదనంగా ఏటా 1 లక్షా 20 వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ఖర్చు కంటే అదనంగా వ్యయం అవుతుందని, కాబట్టి ఈ 6 గ్యారంటీ లు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలయ్యే పరిస్థితి లేదు అని ఘంటాపథంగా చెప్పారు.

సంక్షేమం అవసరమే అయినా…అభివృద్ధిని మింగేసే సంక్షేమం ఈ దేశానికి, రాష్ట్రానికి ప్రమాదకరమని జనపక్షం వ్యవస్థాపకులు రజనీకాంత్ అన్నారు. మాజీ సీఎం కేసిఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలే ఎక్కువ అనుకుంటే… కాంగ్రెస్ పార్టీ అంతకు మించిన ఉచిత సంక్షేమ పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది అని, ఇవి నెరవేరే అవకాశం లేదన్నారు.ఇలాంటి అలవి కానీ హామీల వల్ల ప్రజాస్వామ్యం, ప్రజల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు.

రాజకీయాలలో సంస్కరణలు, జనజీవన ప్రమాణాలు పెంపు కోసం 2024 నుంచి జనపక్షం ఉద్యమం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. దేశ ప్రధానిని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం, ఎమ్మెల్యే, ఎంపీలు రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు పోటీ చేయకూడదు, అధికార వికేంద్రీకరణ, కుల వృత్తుల్లో కార్పొరేట్ సంస్థలు రాకూడదు, నాకు కులం వద్దు అనే కేటగిరిని అన్ని చోట్ల చేర్చాలి వంటి లక్ష్యాలతో ఈ జన పక్షం ఉద్యమం పని చేస్తుంది అని చెప్పారు.

ఈ లక్ష్యం కోసం గ్రామానికి 10 మంది చొప్పున జన పక్షం ఉద్యమం లక్ష్యాల కోసం పని చేసే నాయకులను తయారు చేస్తాం అన్నారు.కేంద్రం లక్ష్యంగా, వ్యవస్థలో రాజ్యాంగ సవరణల ద్వారా మార్పు తెచ్చే దిశగా తమ పోరాటం ఉంటుంది అని ప్రకటించారు. రాజనీతి స్ట్రాటజీస్ సంస్థలో పని చేసిన ప్రతి ఉద్యోగి ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జన పక్షం ఉద్యమం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజనీతి స్ట్రాటజీస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉద్యోగులు హాజరయ్యారు. వీరందరికీ మేమెంటోలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అందించారు. ఈ సమావేశంలో జనపక్షం ఉద్యమ వ్యవస్థాపకులు, రాష్ట్ర సీఈఓ రజనీకాంత్ ఎర్రబెల్లి, సహా వ్యవస్థాపకులు జగన్, తేజస్వి, సుచిరిండియా కిరణ్, ఐటీ సంస్థల ప్రతినిధులు పోల్కం పల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE