Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు… ప్రజా స్టార్

-ప్రజలు ఏడుపుకు కారణాలెన్నో…
-అంగన్వాడీల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని, ప్రజా స్టారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అని ఎద్దేవా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… చేసిన అభివృద్ధి అంటూ లేక, ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక… సలహాదారులు రాసిచ్చే స్క్రిప్టును జగన్మోహన్ రెడ్డి చదివి వినిపిస్తారు.

పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్లిళ్లకు, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఏమైనా సంబంధం ఉందా?, ఎన్ని సార్లు చెప్పిన బుద్ధి లేకుండా అవే మాటలు మాట్లాడుతుండడం చూస్తే విడ్డూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజీ స్టారే అయితే, ఎవరినైనా కొనుగోలు చేసే స్తోమత జగన్మోహన్ రెడ్డికే ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరు కొనలేరు. ఎవరు కొనలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ములో అర శాతం అయినా పెద్ద మొత్తమే అమౌంట్ అవుతుంది. ఎంతోమందిని డబ్బులతో మేనేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయారు.

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో ఆయన అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ వివాహాల గురించి, నా బొచ్చు గురించి తప్ప మాట్లాడడానికి మా పార్టీ నేతల వద్ద సబ్జెక్ట్ అన్నది లేదు . అది వారి దివాలా కోరుతనాన్ని, సిగ్గులేనితనాన్ని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ తన వివాహాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. తాను ఎందుకు పలు వివాహాలను చేసుకోవాల్సి వచ్చిందో వివరించారు.

తెలంగాణ ఎన్నికల పట్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. తెలంగాణలోని పార్టీ కార్యకర్తలు నాయకుల కోసమే, ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ ఎన్నికలకు, రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధం ఏమిటి. మూడేళ్లపాటు చెప్పులు అరిగేలా తిరిగినా మీ చెల్లెలు కనీసం పోటీ కూడా చేయలేదు. జనసేన పార్టీ పోటీ అయిన చేసింది. మీరంటున్న మాటలకు కూటమి చేతల ద్వారా కచ్చితంగా సమాధానం చెబుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పవర్ స్టార్ ప్రభంజనం ఏమిటో మరి కొద్ది నెలల్లోనే చూస్తారన్నారు.

ప్రజలు ఎందుకు ఏడవరు?
ప్రజలకు మేలు చేస్తే పక్క వాళ్ళు ఎవరో ఏడుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. విశాఖపట్నం ఋషికొండపై 450 కోట్ల రూపాయల ప్రజాధనంతో దొంగ చాటుగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక్క కుటుంబం నివసించడానికి ఇంత పెద్ద రాజప్రసాదం నిర్మించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పరిపాలన రాజధాని విశాఖపట్నం కు ముఖ్యమంత్రి మకాం మారుస్తానని అంటే విపక్షాలు ఏడుస్తున్నారని, పేదవారికి ఇండ్లు ఇస్తుంటే ఏడుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షోభం వంటి సంక్షేమాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరు ఏడవడం లేదు. ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారంటే, రాష్ట్రంలో ఐదు లక్షల మంది నాసిరకం మద్యం సేవించి మృత్యువాత పడడం వల్ల వారి భార్యాబిడ్డలు ఏడుస్తున్నారు. గత 20 ఏళ్లలో మృతుల సంఖ్య యావరేజ్ గా రెండు నుంచి మూడు లక్షలు గా ఉంటే, జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అదనంగా లక్షా 20 నుంచి లక్షా 30 వేలు వరకు మృతుల సంఖ్య పెరిగింది. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన దగుల్బాజీ మద్యం పాలసీ వల్ల గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలలో ఐదు లక్షల మంది హుష్ కాకి అయ్యారు.

మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాల నుంచే కాకుండా, మద్యం సేవించే ప్రతి ఒక్కరి కుటుంబం వద్ద నుంచి ఏటా 60 నుంచి 70 వేల వరకు డబ్బులు లాగేస్తున్నారు. ఏడవ రా మరి. ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదు. ఉద్యోగులలో కేవలం రెండు నుంచి మూడు శాతం మంది మాత్రమే పైన ఆదాయం కలిగిన వారు ఉంటారు. మిగిలిన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించక పోగా 31 వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టడం వల్ల ఏడుస్తున్నారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి బాధపడితే ఎలా?. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ రద్దు అయితే తమకు చేకూరే లబ్ధి గురించి అంచనాలను వేసుకొని జీవన ప్రణాళికను సిద్ధం చేసుకున్న వారు , ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయకపోవడం వల్ల ఏడుస్తున్నారు.

విద్యా దీవెన ఇస్తుంటే ఏడుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనగా, విద్యా దీవెన ఇవ్వడం వల్ల కాదు… ఇవ్వకపోవడం వల్లే ఏడుస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు 26 లబ్ధి చేకూరే పథకాలు ఉంటే వాటిని రద్దు చేసినందుకు ఏడుస్తున్నారు. అందులో బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ వంటి పథకం ఉండేది. ప్రజల ఏడుపులకు కారణం జగన్మోహన్ రెడ్డి. గతంలో పదివేల రూపాయలకు లభించే పెద్ద ఇసుక లారీ, ఇప్పుడు 30 వేల రూపాయల ధర పలుకుతుండడం వల్ల భవన నిర్మాణదారులు ఏడుస్తున్నారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు, ప్రతి సర్టిఫికెట్ పై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించడాన్ని చూసి ఏడుస్తున్నారు.

అంతేకానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడాన్ని చూసి కాదు. గతంలో వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్ ని 2250 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు కాదు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పింఛన్ పెంచి ఇచ్చారు. ప్రజలని మోసం చేసింది మీరు. మన ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని చూసి ప్రజలు ఏడుస్తున్నారన్నమాట నిజమని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏమీ లేని అభివృద్ధిని చూసి, సంక్షోభాన్ని సృష్టించిన సంక్షేమాన్ని చూసి ఏడువాల్సిన అవసరం ఎవరికి లేదు. 20 లక్షల ఇండ్లను కడుతున్నామని చెప్పి, గత ఏడాది 5 ఇండ్లను మాత్రమే కట్టినట్టుగా పార్లమెంటులో చెప్పారు.

ఈ ఏడాది రెండు నుంచి మూడు వేల ఇండ్లను నిర్మించినట్లుగా పార్లమెంటులో పేర్కొన్నారు. 20 లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 30 లక్షల మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చామని గొప్పలు చెప్పారు. రాజమండ్రిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో తాటి చెట్టు అంత పెద్ద గోతులు ఉన్నాయి. ఆ ఇళ్ల స్థలాల వల్ల రాజకీయ నాయకులు,అంతిమంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారని ప్రజలు అనుకుంటున్నారు. ఆ ఇండ్ల స్థలాలను చూసి ఇప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు.

వారి ఏడుపులు జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. ప్రజాధనం ఇలా ఎందుకు వృధా చేశారని ప్రతిపక్ష నాయకులు ఏడిస్తే ఏడ్చి ఉండవచ్చు. అంతేకానీ పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని ఎవరు ఏడవడం లేదు. 15 అడుగుల రోడ్లు ఏమిటి?, అదేమైనా ముష్టి కాలనీనా??, అర్బన్ డెవలప్మెంట్ నిబంధనలు వర్తించవా???, చేస్తే సక్రమంగా చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.

నిబంధనలు ఉల్లంఘన పై నివేదికనిస్తామన్న మూర్తి యాదవ్
రుషి కొండపై భవన నిర్మాణంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారో నివేదించే అవకాశాన్ని ఇవ్వాలని మూర్తి యాదవ్ కోరగా, న్యాయవాది ద్వారా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కమిటీ సభ్యులకు అందజేసే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రుషికొండపై భవన నిర్మాణాన్ని సందర్శించేందుకు కమిటీ సభ్యులు వెళ్లారు. అయితే, ఆ సభ్యులను కలిసే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వలేదు. పర్యాటకశాఖ భవనం పేరిట ఫ్రాడ్ కు పాల్పడిన అధికారులే వారికి స్వాగతం పలకడం అనుమానాలకు తావునిస్తోంది.

గతంలో నిబంధనలోని ఉల్లంఘించారని చెప్పిన కమిటీ సభ్యులు, ఇప్పుడు ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పే అవకాశమే లేదు. ఏమో జగన్ మాయ … ఏమైనా చెప్పించవచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కమిటీ నివేదిక వచ్చి, న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కొత్త కాపురం పాట నిలిపివేస్తే మంచిది. తన శ్రీమతి పుట్టినరోజుకు ఎలాగూ వెళ్లలేకపోయనని, తన పుట్టినరోజుకైన వెళ్లాలనుకుంటే మూడు నాలుగు ముచ్చటే అవుతుంది.

విశాఖపట్నం ను పాలెగాళ్లు సర్వం దోచుకున్నారు. ఇప్పుడు, విశాఖ వాసుల మనసును దోచుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి కి కోర్టు అనుమతి ఇస్తుందా?, లేదా అన్నది చూడాలి. ఋషికొండ అక్రమ భవన నిర్మాణం పై అవిశ్రాంతంగా పోరాడుతున్న మూర్తి యాదవ్, రామకృష్ణ బాబుకు అభినందనలను తెలియజేస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ప్రభుత్వానికి వైకాపా కార్యకర్తలకు సంబంధం ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వానికి, వైకాపా కార్యకర్తలకు సంబంధం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అంగన్వాడి కేంద్రాల తాళాలను బద్దలు కొట్టి , అరాచకాలు చేశారు. వాలంటీర్లు అన్నీ పనులు చేస్తారా?, బాలింతరాలైన స్త్రీల సంరక్షణను, పసి పిల్లలకు పాలు పట్టించడం కూడా వారే చేస్తారా అన్న ఆయన, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరిన అంగన్వాడీలను పిలిపించి మాట్లాడకుండా, సమస్యను జటిలం చేసి సమ్మె వరకు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు.

అంగన్వాడి వ్యవస్థను 6000 గౌరవ వేతనంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా, వారి కష్టాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేతనాన్ని 10500 కు పెంచారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులనువివరించి, ఎప్పుడు అమలు చేయగలరో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఎలాగో ప్రజలతో మాట్లాడరు కాబట్టి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినా… అంగన్వాడీలను పిలిపించి మాట్లాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అక్కరకు లేని వాలంటీర్ వ్యవస్థ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీలను పక్కన పెట్టడం దారుణమన్నారు.

సాక్షి దినపత్రిక రాతలు రోతగా ఉన్నాయి
ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ అధికారుల అవినీతిపై నేను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ( పిల్ ) గురించి సాక్షి దినపత్రికలో రాసిన రాతలు రోతగా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత కక్షతోనే నేను పిల్ దాఖలు చేసినట్లు, దీనికి విచారణ అర్హత లేదని సాక్షి దినపత్రికలో రాశారు. కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి ఆకారాన్ని దూషించానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన కౌంటర్ అఫిడవిట్లో ఫైల్ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా, ముఖ్యమంత్రి ఫైల్ చేసి ఉంటే బాగుండేది. ఎప్పుడైనా సమస్యలను జటిలం చేయవద్దని, పార్టీ అధ్యక్షులు హోదాలో చెప్పింది ముఖ్యమంత్రిగా చేయమని కోరాను. కొంతమంది చేత వ్యక్తిగతంగా నా గురించి పరుష పదజాలంతో మాట్లాడించినప్పుడు మాత్రమే, నేను కూడా పొట్టి వారు హిల్స్ వేసుకుంటారని చెప్పాను. ప్రజా సేవకు నేను అడ్డు వస్తున్నానని సాక్షి దినపత్రికలో రాశారు. అక్రమ మార్గంలో నాలుగు లక్షల సాక్షి దినపత్రిక కాపీలను అమ్ముకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలకు సింహభాగం భారతి సిమెంట్ ను విక్రయించడం ప్రజాసేవ ఎలా అవుతుంది.

ఇదే విషయాన్ని పరిశోధించాలని మాత్రమే కోరుతూ పిల్ దాఖలు చేశాను. కోర్టులో ఉన్న అంశం గురించి నేనుమాట్లాడడం లేదు… సాక్షి దినపత్రికలో రాసిన అడ్డగోలు రాతల గురించి మాట్లాడుతున్నాను. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిని నేనేమైనా అంటే దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

దేశంలోనే రాష్ట్రం నిరుద్యోగుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా, ఎక్కువమంది చదువుకున్నారని చెప్పారన్న రఘురామకృష్ణం రాజు, దేశంలోని ఇతర రాష్ట్రాల తో పోలిస్తే నిరక్షరాస్యతలోనూ ఆంధ్ర ప్రదేశ్ అదే స్థానంలో ఉందన్నారు. ఇక 25 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామన్న బొత్స సత్యనారాయణ, రేపు మాపో మూసి వేయబడనున్న బై జూస్ కంటెంట్ ను లోడ్ చేస్తామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.

LEAVE A RESPONSE