-5,200 మందికి తప్పనిసరి బదిలీలు
– అభ్యర్థనల మేరకు 1899 మందికి స్థానభ్రంశం
– బదిలీ కాబడ్డ 379 మంది భోదనా సిబ్బంది
– నేటితో ముగిసిన బదిలీల మొదటి అంకం
– సక్రమంగా బదిలీలు జరగడంపై మంత్రి సత్య కుమార్ యాదవ్ హర్షం
– ఈ నెలాఖరుకు 9,650మంది ఏ.యన్.యమ్ ల బదిలీలు
విజయవాడ: వైద్యారోగ్య శాఖ పరిధిలో నేటితో ముగిసిన మొదటి అంకం బదిలీల ప్రక్రియలో మొత్తం 7,099 మంది వైద్య సిబ్బంది కొత్త స్థానాలకు బదీలి అయ్యారు.
ఇందులో వివిధ స్థాయిల్లో 5,200 మందికి ప్రస్తుతం ఉన్న చోట ఐదేళ్ళ సర్వీసు దాటినందున తప్పనిసరిగా బదిలీ అయ్యారు.1899 మందిని వారి అభ్యర్ధనల మేరకు బదిలీ చేశారు.
బదిలీల ప్రక్రియ రెండవ అంకంలో గ్రామ స్ధాయిలో పనిచేసే 9,650 గ్రేడ్-3 ఏ.యన్.యమ్ లను ఈ నెలాఖరుకు బదిలీ చేస్తారు. గ్రామ,వార్డు సచివాలయల విభాగం సమన్వయంతో ఈ బదిలీలను చేయాల్సి ఉన్నందున ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30 వరకు గడువునిచ్చింది.
హర్షం వెలిబుచ్చిన మంత్రి
పలు కారణాలతో క్లిష్టమైన భారీ బదిలీల ప్రక్రియను సజావుగా,వివాదరహితంగా నిర్వహించినందుకు వైద్యారోగ్యశాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ హర్షం వెలిబుచ్చారు. ఈ దిశగా వివిధ స్థాయిల్లో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.గత బదిలీల ప్రక్రియలకు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈసారి చేపట్టిన బదిలీలను నియమ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించటానికి చేసిన కృషి మంచి ఫలితాలను ఇచ్చిందని ఆయన అన్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట …తొలిసారిగా
గతంలో జిల్లా, జోనల్,రాష్ట్ర స్ధాయిలో జరిగే సిబ్బంది బదిలీలపై ఆయా స్ధాయి అధికారులు నిర్ణయాలు తీసుకునేవారు.దీని వలన క్రింది స్ధాయి అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేక బదిలీలపై పలు ఆరోపణలు వచ్చాయి.ఈ నేపధ్యంలో…బదిలీల నిర్ణయాలకు సంబంధించి మంత్రిత్వశాఖలోని వివిధ విభాగాధిపతులు బాధ్యత వహించాలని, అవకతవకలను ఉపేక్షించమని మంత్రి స్పష్టం చేశారు.
దీనితో పాటు జిల్లా, జోనల్ స్థాయిల్లో పాలనా సహాయక సిబ్బందిలో పలువురు అదే స్థానాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తూ అక్రమాలు, అవినీతికి పలుపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకేచోట మూడు సంవత్సరాలకు పైగా పనిచేసిన జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్లు,అకౌంట్ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు వంటి వారిని వేరే చోటకు బదిలీ చేయాలని మంత్రి ఆదేశించగా…ఆ మేరకు మంత్రిత్వశాఖ జారీచేసిన బదిలీ విధివిధానాలో స్పష్టంగా పొందుపరిచారు.దీర్ఘకాలికంగా ప్రధాన పోస్టుల్లో పనిచేస్తూ ఆరోపణలకు గురైన కొందరు ఉన్నతాధికారులను మంత్రి బదిలీ చేయడం మరో విశేషం.
ఒకేచోట ఐదు సంవత్సరాలు పనిచేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సివున్న వారి వివరాలను, రెండేళ్ళకు పైగా సర్వీసు ఉండి బదిలీ కోరుకున్న వారి వివరాలను, వారివారి సీనియారిటీలను, ఖాళీ స్థానాలను ప్రకటించి వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే దిశగా స్పష్టమైన విధానాలను మంత్రిత్వశాఖ ప్రకటించటంతో బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది
ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న 840 మంది
మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు అందించిన సమాచారం ప్రకారం 840 వైద్య సిబ్బంది అదే చోట్ల ఐదేళ్ళకు పైగా కొనసాగుతున్నారు.దీనికి కారణాలు…బదిలీల విధివిధానాలో బదిలీల నుంచి కొంతమందికి ఆరోగ్య కారణాలు మరియు ఉద్యోగులైన భార్యాభర్తలను ఒకే చోట ఉంచే ఉద్దేశంతో మినహాయింపు కల్పించారు. వీటితో పాటు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు నియమాల మేరకు మినహాయింపు ఉంది.
అయినా…ఈ 840 మందికి సంబంధించి వారు ఏఏ కారణాలతో అదే స్థానాల్లో కొనసాగుతున్నారో పూర్తి వివరాలను త్వరలో తెలపాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశించారు. నేటితో ముగిసిన మొదటి అంకం బదిలీ ప్రక్రియలో 60 మంది ప్రొఫెసర్లతో పాటు మొత్తం 379 మంది కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు.