– హైదరాబాద్ టు రాజమండ్రి టూర్‌కు ఆంక్షలెందుకు?
– ఏపీ బోర్డర్ వద్ద ఐటీ ప్రొఫెషనల్స్‌కు అడ్డంకులు
– రాజమండ్రికి వెళ్లేందుకు పోలీసుల మోకాలడ్డు
– వాట్సాప్ చెకింగ్ చేసిన పోలీసుల అత్యుత్సాహం
– ఏపీకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలా అని ఐటీ నిపుణుల ఆగ్రహం
– రాజమండ్రి లాడ్జిల్లో గదులకు తాళాలు వేసిన పోలీసుల ఓవరాక్షన్
– ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసుల వత్తాసుపై ఫైర్
– చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఎంతమందిని కలిశారో చర్చిద్దామా?
– రాజమండ్రికి వెళ్లకుండా అడ్డుకోవడం అనాగరికమన్న తెలుగుమహిళ అధ్యక్షురాలు షకీలారెడ్డి
– తెలంగాణ పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంపై ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజ్యాంగం అందరికీ సమానం. చట్టాలు అందరికీ సమానం. వాక్ స్వాతంత్య్రం- భావ ప్రకటనా స్వాతంత్య్రం, రాజ్యాంగం ప్రసాదించిన వరాలు. కానీ ఇవన్నీ పుస్తకాల్లోనే! ధర్మదేవత కళ్లకు ‘కావల్సిన వాళ్లు’ గంతలు కట్టిన ఫలితంగా.. అవన్నీ చట్టుబండలవుతున్న పరిస్థితి. అయినా ఏ ఒక్క ప్రజాస్వామ్యవాదీ పెదవి విప్పడు. ఏ న్యాయవ్యవస్థ కన్నెర్ర చేయదు. ప్రశ్నించాల్సిన అధికారులది పరాధీన జీవనం. ఇదీ ఇప్పుడు ఏపీలో కనిపించే.. రాజ్యాంగ ఉల్లం‘ఘనుల’ స్వైరవిహారం. వడ్డించేవాడు మనవాడైతే, ఏ మూల కూర్చున్నా ఫర్వాలేదన్న బేఖాతరు పర్వం!
టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసి, రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆయనది అక్రమ అరెస్టంటూ గళమెత్తిన, హైదరాబాద్‌లోని ఐటీ ప్రొఫెషనల్స్.. నాయకుడెవరూ లేకుండానే, గత వారం నుంచి రోడ్డెక్కి నిరసనస్వరం వినిపిస్తున్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుఝాము నుంచి, కార్లలో వారంతా ‘చలో రాజమండ్రి’కి తరలివెళ్లారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా రాజమండ్రికి వెళ్లి.. అక్కడున్న బాబు భార్య భువనేశ్వరి- కోడలు బ్రాహ్మణికి, తమ నైతిక మద్దతు ప్రకటించాలన్నది వారి లక్ష్యం. అలా పదులు-వందలు-వేల సంఖ్యలో.. మియాపూర్-మణికొండ- కూకట్పల్లి-అమీర్‌పేట నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ కార్లలో ర్యాలీగా వెళ్లారు. వీటికి నాయకుడ ంటూ లేకపోవడమే విశేషం.
అయితే వారి కార్ల ర్యాలీని తెలంగాణ సరిహద్దు వద్దనే, ఏపీ పోలీసులు నిలిపివేశారు. గుంటూరు-కృష్ణా జిల్లాల సరిహద్దులో వారి కార్లను అడ్డుకున్నారు. దానికి తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలికారన్న విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి వెళ్లేందుకు వీలులేదని, అక్కడ 144 సెక్షన్ అమలులో ఉందని నిషేధాజ్ఞలు విధించారన్నారు. అయితే తమ ఊళ్లకు తాము వెళ్లేందుకు, ఆంక్షలు ఏమిటని ఐటీ నిపుణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దానితో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు… ఐటీ నిపుణుల సెల్ఫోన్లో వాట్సాప్ మెసేజ్‌లు చెక్ చేసి, పంపించారు.
రాజమండ్రికి చేరుకున్న ఐటీ ప్రొఫెషనల్స్.. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణికి, తమ నైతిక మద్దతు ప్రకటించారు. బాబుకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందుకు స్పందించిన బ్రాహ్మణి, వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. బాబుకు బాసటగా నిలిచేందుకు.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చిన వారిని ఆమె అభినందించారు. ఇక రాజమండ్రి వస్తున్న ఐటీ నిపుణుల కార్లను ఆపి, వారి వాట్సాప్ సందేశాలను తనిఖీ చేయడంపై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనాగరిక చర్యలు, ఆంద్రా వారిని అవమానించడమేనన్నారు.
కాగా ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలను అధగ మించి, రాజమండ్రి వెళ్లిన ఐటీ నిపుణులకు రాజమండ్రిలోనూ కష్టాలు తప్పలేదు. వారు బస చేసిన లాడ్జిలకు వెళ్లిన పోలీసులు… వారి గదులకు బయట తాళం వేసిన వైనం వివాదాస్పదమైంది. అయినప్పటికీ,, మెజారిటీ ఐటీ నిపుణులు బ్రాహ్మణి బస చేసిన ఇంటికి చేరి, తమ మద్దతు ప్రకటించడం విశేషం.
కాగా.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను… అప్పుడు ఎంతమంది కలిశారో గుర్తు చేసుకోవాలని తెలంగాణ టీడీపీ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ప్రశ్నించారు. జగన్ జైలులో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా, ఆయనను ఎంతమందిని కలిశారన్నదానిపై చర్చకు సిద్ధమా అని షకీలారెడ్డి సవాల్ చేశారు.
‘‘చంచల్‌గూడ జైలు బయట ఉన్న డిస్పెన్సరీ వద్ద జగన్ పీఏ ఎంతమందిని, జైలు లోపల జగన్ వద్దకు ములాఖత్‌కు పంపించారు? అందుకు ఏ అధికారులు సహకరించారు? జగన్ కుటుంబసభ్యులను ఎన్నిసార్లు లోపలికి అనుమతించారు? జగన్ కోసం జైలు బయట ఎన్ని వందల మందిని అనుమతించారో మాకు తెలియదా? అలాంటిది రాజమండ్రిలో ఉన్న మా పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా, ఐటీ ఉద్యోగులు కార్లలో వెళితే వాళ్లకు పాస్‌పోర్టులు కావాలా? ఏపీకి వెళ్లాలంటే హైదరాబాద్‌లోని ఏపీ వారికి పాస్‌పోర్టులు కావాలా? రాజమండ్రి ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఉందా? ఇలాంటి ఓవరాక్షన్ చేసే పోలీసులు, ఎన్నికల త ర్వాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని’ షకీలా రెడ్డి హెచ్చరించారు.
తాజా పరిణామాల్లో తెలంగాణ పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్, మణికొండ, కూకట్పల్లి ప్రాంతాల్లో శాంతియుతంగా
నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్- టీడీపీ కార్యకర్తలను పొలీసులు అడ్డుకోవడంపై, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. చంద్రబాబు బయటకు రావాలని ప్రార్థిస్తూ.. బోనాలెత్తుకున్న మహిళలను, పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ లో నిరసన వ్యక్తమవుతోంది.
కాగా సనత్‌నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేటలో.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, స్థానిక సెటిలర్లు-టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సారధి స్టుడియో నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ వరకూ నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్శింహులు పాల్గొనడం చర్చనీయాంశమయింది.