Home » ఇదేమి రాజ్యం?

ఇదేమి రాజ్యం?

-ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?
-మాజీ హోంమంత్రి ఇలాకాలోనే మత్తుమందు అమ్మకాలు
-అడ్డుకోవాలంటూ ఓ మహిళ ఆక్రందన
-ఎస్పీ, కలెక్టరుకు చెప్పినా ఫలితం శూన్యం
-చివరకు ఢిల్లీలో తన బొటనవేలు నరుక్కుని నిరసన
-ప్రత్తిపాడు లక్ష్మి చర్యతో దేశంలో పోయిన ఏపీ పరువు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అసలు రాష్ట్రంలో న్యాయం ఉందా? చట్టం పనిచేస్తోందా? లేక పాలకులకు చట్టం చుట్టంగా మారిందా? వ్యవస్థలను మేనేజ్ చేసిన క్రమంలో న్యాయం-ధర్మం-చట్టం గుడ్డిదయిపోయిందా? ధర్మం నాలుగుపాదాల మీద కాదుకదా.. కనీసం ఒక కాలితోనయినా నడుస్తుందా?…పోనీ వీల్ చైర్‌లోనయినా నడుస్తుందా? ఇవీ కోవూరు లక్ష్మి అనే దళిత మహిళ, దేశరాజధాని ప్రజల సాక్షిగా బొటన వేలు కోసుకున్న విషాద దృశ్యాలు చూసిన తర్వాత ఏపీ ప్రజల్లో మాత్రమే కాదు.. యావత్ దేశప్రజల మనసుల్లో ఆవిష్కృతమైన ప్రశ్నలివి.

ప్రజాస్వామ్యపిపాసులు మనసు నుంచి తూటాల్లా దూసుకువచ్చిన ప్రశ్నాస్త్రాలివి.. అరాచకం రాజ్యమేలుతున్న ఫలితంగా.. వ్యవస్థలు ధృతరాష్ర్టులై, పాలకులు దుర్యోధన-దుశ్శాసులైతే జరిగే దారుణాలు ఇలాగే ఉంటాయంటూ సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన నిరసన జ్వాల ఇది. మొత్తంగా ఏపీలో అరాచకత్వమే రాజ్యమేలుతుందంటూ దేశప్రజలకు ఓ మహిళ తన బొటనవేలు నరుక్కుని మరీ ఇచ్చిన సందేశం!!

గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి అనే దళిత ఆడబిడ్డ… దేశ రాజధాని సాక్షిగా తనకు జరిగిన అన్యాయంపై స్పందించని ఈ వ్యవస్థపై ఆగ్రహంతో, అందరూ చూస్తుండగా, తన బొటలి వేలి నరుక్కున్న విషాద దృశ్యం మనుసున్న ప్రతి ఒక్కరినీ కదలించింది. కఠిన పాషాణ హృదయాలను సైతం ఆ దృశ్యం కరిగిస్తుంది. పురాణాల్లో ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవేలిని నరుక్కున్న చరిత్ర మాత్రమే తెలుసు. కానీ ఆదర్శ మహిళ సంఘం అధ్యక్షురాలిగా మహిళా సమస్యలు, ప్రజాసమస్యలపై లక్ష్మి అనే ఏకలవ్యురాలు, ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలయిన ఓ మహిళా నేత.. ఈ వ్యవస్థపై ఆగ్రహం, అసంతృప్తితో తన బొటనవేలిని నరుక్కుంటారని ఎవరైనా ఊహించారా?

ఆ ప్రాంతంలో చిన్నపిల్లలలో గంజాయి అమ్మకాలు, నేరప్రవృత్తిని పెంచుతున్న అధికారపార్టీ పెద్ద మనుషుల పాలిక ఆమె సివంగి అయ్యారు. దానిని అడ్డుకోవాలని ఉద్యమించారు. ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన స్పందన శూన్యం. అయినా ఆశ చావక ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా కంఠశోష, కాళ్లనొప్పి తప్ప ఫలితం శూన్యం. 41వ డివిజన్‌లో భూకబ్జాలు, అధికారుల సంతకాలను మాజీ హోంమంత్రి సుచరిత అనుచరులే చేస్తున్నారన్నది ఆమె ఆరోపణ.

ఈ అక్రమాలు-అరాచాలకు కారణమయిన ఎమ్మెల్యే సుచరిత, ప్రస్తుత వైసీపీ అభ్యర్ధి కిరణ్‌కుమార్ అనుచరులు పిల్లి మేరి, బొల్లెద్దు వెంకట్, షేక్ నాగులు, ఎంఎల్ పుష్పలత, పులిపాటి అంజలి, లోకయ్యను విచారించాలన్నది లక్ష్మి డిమాండ్. అధికారమే వారిదైనప్పుడు.. అధికారులే ఆ పార్టీకి గులాంగిరి చేస్తున్నప్పుడు లక్ష్మి మాట వినేదెవరన్నది బుద్ధిజీవుల ప్రశ్న.
అయినా వ్యవస్థలు స్పందించకపోడంతో.. తమ గోడును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, ప్రధాని తదితర పెద్దలకు వెళ్లబోసుకోవాలన్న లక్ష్యంతో.. ఢి ల్లీ వెళ్లిన లక్ష్మికి సహజంగానే వారి దర్శనం కాలేదు. ఆమె మొర వినే వారే కనిపించలేదు. దానితో నిరాశా నిస్పృహకు గురైన ఆ దళిత ఆడబిడ్డ.. ఇండియాగేట్ సాక్షిగా.. ఈ వ్యవస్థల వైఫల్యానికి నిరసనగా, ఏకలవ్యురాలి అవతారమెత్తి, తన బొటనవేలిని తెగనరుక్కున్నారు. ఈ దృశ్యం ఇప్పుడు దేశం మొత్తం సోషల్‌మీడియా సాక్షిగా దర్శించింది. ఇది ఏపీలో పాలనా వ్యవస్థను వేలెత్తి చూపించింది. ఏపీలో పాలన ఎంత చక్కగా అఘోరిస్తుందో దేశానికి చాటింది.

ఈ విషాదంలో బాధితురాలు లక్ష్మికి సానుభూతి ప్రకటించడం వినా చేసేదే మీ లేదు. అసలు ఒక దళిత ఆడబిడ్డ ధైర్యం చేసి, అంత దూరం వెళ్లడమే సాహసం. పైగా ఆమె పోరాటం తనకు భూమి కావాలనో, ఇల్లు కావాలనో, అమ్మఒడి పథకం కావాలనో, రేషన్‌కార్డు కోసమో చేసింది కాదు. తన చుట్టూ ఉన్న సమాజం మత్తుమందులకు అలవాటుపడి, చిరంజీవులు భవిష్యత్తులో ఎక్కడ మత్తుకు బానిసవుతారోనన్న ఆందోళనతో, సామాజిక బాధ్యత-సామాజిక స్పృహతో చేసిన ప్రయత్నం.

ఇంకో ఆసక్తికరమైన విషయం. గతంలో లక్ష్మి తండ్రి కూడా ఇలాగే, వ్యవస్థల వైఫల్యంపై ఆగ్రహంతో.. ఇలాంటి సామాజిక బాధ్యతతో బొటనవేలు నరుక్కున్న ఏకలవ్యుడు. అంటే లక్ష్మి కుటుంబం ఏస్థాయిలో సమాజం కోసం పరితపిస్తుందో సుస్పష్టం. పోనీ ఆమె ఏ టీడీపీనో, బీజేపీనో, జనసేనకు చెందిన నాయకురాలో కాదు. పార్టీలకు అతీతంగా పోరాడుతున్న ప్రజానాయకురాలు. సమాజంపై ఆమెకున్న తపనలో.. మన ఐఏఎస్,ఐపిఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలకు పదోవంతు ఉన్నా సమాజం మరోలా ఉండేదేమో?!

నిజానికి లక్ష్మి సంధించిన అస్త్రం వ్యవస్థల వైఫల్యంమీద. బొటనవేలు నరుక్కున్న ఈ విషాదానికి సిగ్గుపడాల్సింది వ్యక్తులు కాదు. వ్యవస్థలు! కుమిలిపోవలసింది సమాజం కాదు. ఆ సమజానికి మూలస్తంభాలయిన అధికారులు!! ఒక ఆడకూతురు తన పోరాటాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సాగించిందంటే, అది వ్యవస్థల వైఫల్యమేనన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్థమయితీరాలి.

లక్ష్మి అనే ఆడకూతురి పోరాటానికి క లెక్టరో, ఎస్పీనో స్పందించి ఉంటే, ఈ విషాదం జరిగేది కాదు. చాలకాలం టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్నది జగన్ నుంచి జగ్గారావు వరకూ చేసిన ఆరోపణ. మరిప్పుడు ఎవరు మేనేజ్ చేస్తున్నారన్నది ప్రశ్న.
దీన్నిబట్టి ఏపీలో వ్యవస్థలు, ఎన్ని కిలోల మత్తుతో తూగుతున్నాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయినా… డీ జీపీ కావలసిన ఒక ఐపిఎస్ అధికారినే వేధించి, పోస్టింగు లేకుండా చేసిన పాలకులు… లక్ష్మి అనే ఎలాంటి బలం లేని ఒక మహిళ చేసిన పోరాటానికి, స్పందిస్తుందనుకోవడం భ్రమ.

ఇలాంటి ఏకలవ్య ప్రయత్నాల వల్ల, వ్యక్తులు గాయపడటం తప్ప, వ్యవస్థ అనే మదగజం మేల్కొనదని, లక్ష్మి అనే సగటు మహిళ గ్రహించకపోవడమే అమాయకత్వం. మరి ‘నా ఎస్సీలు’ అని దీర్ఘాలు తీసే పాలకులు.. అదే ఎస్సీ మహిళ చేయి నరుక్కున్న విషాద ఘటనకు బాధ్యత వహిస్తుందా? అన్నది దళితలోకం సంధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ధైర్యం జగనన్న సర్కారుకుందా?

Leave a Reply