Suryaa.co.in

Editorial

ప్రెస్ అకాడెమీ ఆఫీసు ఎక్కడ?

– తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా శ్రీనివాసరెడ్డి నియామకం
– సీపీఐ కోటాలో చైర్మన్ పదవి
– ప్రెస్‌క్లబ్‌లో ప్రమాణస్వీకారం చేసిన వైనం
– ఇప్పటికే ప్రెస్‌అకాడెమీకి సొంత భవనం
– గత ప్రభుత్వంతో లక్షలాది రూపాయలతో మరమ్మతులు
– ద శాబ్దాల నుంచి ప్రెస్ అకాడెమీ ఆఫీసు అక్కడే
– అయినా ఇప్పటివరకూ అక్కడికి వెళ్లని కొత్త చైర్మన్
– బషీర్‌బాగ్ యూనియన్ ఆఫీసు నుంచే కార్యకలాపాలు
– దానితో చైర్మన్ పదవి ఒక యూనియన్‌కే పరిమైందంటున్న జర్నలిస్టులు
– బూర్గుల భవనం కావాలంటున్న వైనం
– సీఎం నియామకాన్ని అవమానించడమేనంటున్న తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు
– ఈపాటికే టీజీ సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసిన పలువురు జర్నలిస్టులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ప్రెస్ అకాడెమీ ఆఫీసు ఎక్కడ? బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లోనా? ఇప్పటికే పబ్లిక్‌గార్డెన్స్ ఎదురుగా ఉన్న ప్రెస్ అకాడెమీ సొంత భవనంలోనా? లేక సోమాజీగూడ లోని ప్రెస్‌క్లబ్‌లోనా?.. ఇవీ జర్నలిస్టుల డౌటనుమానాలు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ చైర్మన్‌గా ఉన్న ప్రెస్ అకాడెమీ.. ఆయన రాజీనామా చేసేంతవరకూ, పబ్లిక్‌గార్డెన్స్ ఎదురుగా ఉన్న అకాడెమీ సొంత భవనంలోనే పనిచేసింది. ఆ మేరకు లక్షలాది రూపాయలతో మరమ్మతులు కూడా చేయించారు. అల్లం నారాయణ ఒక్కరే కాదు. ఇప్పుడు చైర్మన్‌గా ఉన్న కె.శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లు కూడా గతంలో అక్కడి నుంచే పనిచేసేవారే.

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చైర్మన్ అల్లం స్థానంలో, కె.శ్రీనివాసరెడ్డిని అకాడెమీ చైర్మన్‌గా నియమించారు.ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ పదవి నిర్వహించారు. సీపీఐతో కాంగ్రెస్‌కు ఉన్న పొత్తు మేరకు 3 కార్పొరేషన్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్న ఒప్పందం జరిగింది. అందులో భాగంగా శ్రీనివాసరెడ్డికి ప్రెస్ అకాడె మీ చైర్మన్ ఇచ్చారు. అయితే దానిపైనా సీపీఐలో విబేధాలు వచ్చాయని, అకాడెమీ చైర్మన్ తీసుకుంటే మరొక చైర్మన్ కోల్పోవాల్సి ఉంటుందని సీనియర్లు వాదించారు. దానిపై రాష్ట్ర కార్యదర్శి వైఖరితో పలువురు సీనియర్లు విబేధించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని మరికొందరు జర్నలిస్టుల నుంచి అభ్యంతరాలు వినిపించాయి. ఇదంతా మీడియాలో వచ్చిన ముచ్చటనే.

సరే..ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి తీసుకున్న శ్రీనివాసరెడ్డి.. ఏమైనా ఇప్పటివరకూ అకాడెమీ భవనానికి వెళ్లారా అంటే అదీ లేదు. ప్రెస్‌క్లబ్‌లో పదవీ స్వీకారం చేయడం, బషీర్‌బాగ్‌లోని సొంత యూనియన్ కార్యాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తుండటంపై, జర్నలిస్టు వర్గాల్లో అభ్యంతరం వ్యక్తమవుతోంది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఒక యూనియన్‌కు చెందినది కావడమే, వారి అభ్యంతరాలకు కారణంగా కనిపిస్తోంది. ఇతర యూనియన్లకు చెందిన జర్నలిస్టులు అక్కడి వెళ్లి, చైర్మన్ హోదాలో ఉన్న శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు ఇష్టపడటం లేదట.

అసలు నిజానికి యూనియన్లకు చెందిన వారికి చైర్మన్ పదవి ఇవ్వవద్దని, అలా ఇస్తే వారంతా సొంత యూనియన్ల ప్రయోజనాలకే పరిమితమవుతారని సీనియర్ జర్నలిస్టులు వాదించారు. అదే ఏ యూనియన్‌కు సంబంధం లేని జర్నలిస్టుకు ఇస్తే, అందరి ప్రయోజనాలూ కాపాడతారని స్పష్టం చేశారు. గతంలో అల్లం నారాయణకు చైర్మన్ పదవి ఇచ్చే ముందు కూడా, ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమయింది. అయినా వారి మాటను బేఖాతరు చేసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం, ఒక యూనియన్‌కు నాయకుడయిన అల్లం నారాయణను నియమిస్తే… ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, మరొక యూనియన్‌కు చెందిన శ్రీనివాసరెడ్డిని చైర్మన్‌గా నియమించింది. అది వేరే ముచ్చట.

అయితే తనకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కార్యాలయం కేటాయించాలని, శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నట్లు జర్నలిస్టు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రెస్ అకాడెమీ కార్యాలయాన్ని లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేయించింది. పైగా అక్కడ బీఆర్‌కే భవన్ కంటే, ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. నిజానికి ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికీ, మిగిలిన శాఖలకు అనుబంధంగా ఉండే కార్పొరేషన్లకు ఉండే పనిలో, రెండో వంతు కూడా ప్రెస్ అకాడెమీకి పెద్దగా పని ఉండదని సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ వైఖరి సీఎం నియామకాన్ని అవమానించడమేనని, పలువురు సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కేసీఆర్ ఇప్పటి సెక్రటేరియేట్ నిర్మించారు కాబట్టి రేవంత్‌రెడ్డి నేనక్కడ కూర్చోను అనలేదు కదా? కేసీఆర్ స్థానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి డీజీపీ ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి నేను అక్కడ కూర్చోనని ఇప్పటి డీజీపీ అనలేదు కదా? పాత డీజీపీ ఆఫీసులోనే పనిచేస్తున్నారు కదా? గతంలో కార్పొరేషన్ చైర్మన్లు పనిచేసిన భవనాల్లోనే కొత్త చైర్మన్లు పనిచేస్తుంటే, మిగిలిన శాఖల మాదిరిగా పెద్దగా ప్రాధాన్యం లేని ప్రెస్ అకాడెమీకి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటి?

గతంలో అల్లం నారాయణ ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి మేం కూర్చోలేమన్నట్లు ఉంది. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ప్రెస్ అకాడెమీకి ఒక భవనం కేటాయించింది. అందులో గతంలో ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి సహా చాలామంది పనిచేశారు. అయినా ప్రెస్ అకాడెమీకి రోజూ మిగిలిన కార్పొరేషన్ల లెక్క డజన్ల ఫైళ్లు, వందల మంది స్టాఫ్ ఉండరు. ఇప్పుడు కొత్త చైర్మన్ అక్కడ కూర్చోకుండా ప్రెస్‌క్లబ్‌లో కూర్చోవడం ఏం పద్ధతి?’’ అని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై ఆయన ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కాగా ఇది సీఎం రేవంత్‌రెడ్డి నియామకాన్ని అవమానించడమేనన్న వ్యాఖ్యలు జర్నలిస్టు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ‘‘ప్రెస్ అకాడెమీ భవనం అందరిది. ఏ జర్నలిస్టు యూనియన్ నాయకులయినా వచ్చి చైర్మన్‌ను స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి చైర్మన్ హోదాలో కార్యకలాపాలు సాగిస్తున్న భవనం ఒక యూనియన్‌ది.

అంటే ఆయన నాయకత్వం వహిస్తున్నది. అలాంటప్పుడు మిగిలిన యూనియన్ల వాళ్లు అక్కడికి ఎలా వెళ్లగలరు? సీఎం సహా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు గతంలో ఉన్న భవనాల్లోనే పనిచేస్తుంటే ప్రెస్ అకాడెమీని ఒక్కటే బీఆర్‌కే భవన్‌కు తరలించాల్సిన అవసరం ఏమిటి? ఇది గతంలో ఒక బీసీ ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి.. ఇప్పుడు తాను ఆ సీట్లో కూర్చోబోనన్న తప్పుడు సంకేతాలకు కారణమవుతుంది. అది మంచిది కాదు. దీనిపై పునరాలోచించాల’ని ఓ సీనియర్ జర్నలిస్టు సూచించారు.

LEAVE A RESPONSE