Suryaa.co.in

Editorial

చెల్లికి.. చెక్!

– షర్మిల ర్యాలీని అడ్డుకున్న బెజవాడ పోలీసులు
– పోలీసులపై షర్మిల ఫైర్
– నియంత రాజ్యమంటూ రాజన్న బిడ్డ కన్నెర్ర
– రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని బిగ్ వార్నింగ్
– భయపడుతున్నారా సార్ అంటూ జగన్‌పై కామెంట్
– ఇది ఇండో-పాక్ బోర్డరా అని ఫైర్
– కార్యకర్తల కోసం జైలుకయినా పోతానని స్పష్టీకరణ
– మీ అక్రమాలు ఇక సాగవని హెచ్చరించిన షర్మిల
– చివరాఖరకు అనుమతించిన పోలీసులు
– వైఎస్ అసలైన వారసురాలొచ్చిందంటూ కార్యకర్తల నినాదాలు
– పోలీసుల వెనుక ప్యాలెస్ ఆదేశాలని సుంకర పద్మశ్రీ ఆరోపణ
– జగన్ యాక్షన్, సజ్జల డైరక్షన్ అన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ
– మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీకి అనుమతులున్నాయా?
– షర్మిల రాకతో వైసీపీలో వణుకు పుట్టిందని ధ్వజం
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొంతమంది అన్నయ్యలకు తల్లి.. చెల్లి.. బాబాయ్.. తమ్ముళ్లలంటే మహా కోపం ఉంటుంది. అందుకే వాళ్లను అసలు పట్టించుకోరు. వాళ్లంటే మహా చిరాకు. ఇంకొందరు అన్నయ్యలకు తన వైపు వాళ్లంటే కష్టం. భార్య వైపు వాళ్లంటే మహా ఇష్టం. ఇది చాలా కుటుంబాల్లో చూసేవే.

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీ రాజధాని నగరంలో, చెల్లి ర్యాలీని అన్నయ్య సర్కారు అడ్డుకుంది. అనుమతి లేకపోవడమే దానికి కారణమట. మరి చెలి అసలే ఫైర్ బ్రాండ్. పైగా రాజన్న బిడ్డ. ఊరుకుంటుందా? ఉగ్రరూపం దాల్చదూ?! మాటల మంటలతో అగ్గిరాజేయదూ?! నాతో పెట్టుకోవద్దని అన్నయ్యకు వార్నింగ్ ఇచ్చేయదూ?! యస్. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ‘నాతోపెట్టుకుంటే మడతడిపోద్దీ’ అని డైరక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది మరి. దటీజ్ షర్మిల. డాటరాఫ్ రాజన్న!!

ఏపీ కాంగ్రెస్ దళపతిగా సీఎం జగన్ చెల్లెమ్మ షర్మిల… పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆదివారం, గన్నవరం నుంచి బెజవాడకు భారీ కాన్వాయ్‌లో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. అసలే వైఎస్ ముద్దులబిడ్డ. ఆపై కాంగ్రెస్‌లో జోష్ తెప్పించేందుకు కొత్త బాధ్యతలతో రంగ ప్రవేశం. ఇంకేముంది? ఇప్పటిదాకా ఇంట్లో కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలంతా, పోలోమని షర్మిల కాన్వాయ్‌ను అనుసరించారు. దానితో సహజంగానే ట్రాఫిక్ జాం అయింది.

వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. మీ ర్యాలీకి అనుమతి లేదని షర్మిలక్కాయ్ కారును, దాని వెనుక ఫాలో అవుతున్న వాహనాలను ఆపేశారు. అనుమతి ఉంటేనే పంపిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా పోలీసులతో వాగ్వాదం. ఇది ర్యాలీ కాదు. పార్టీ ఆఫీసుకు వెళుతున్నాం. కాబట్టి అనుమతి అక్కర్లేదని కాంగ్రెస్ నేతలు భీష్మించారు. అయినప్పటికీ చ ట్టాన్ని గౌరవించి, అనుమతి తీసుకున్నా ఆపడం ఏమిటని షర్మిల ఫైరయ్యారు. దారిమళ్లించడాన్ని ససేమిరా అంగీకరించమని స్పష్టం చేశారు. ‘ ఏపీలో నియంత పాలన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కారు వణికిపోతోంది. రాజన్నబిడ్డ ఎవరికీ భయపడదని’ షర్మిల స్పష్టం హెచ్చరించారు. మరి రాజన్న బిడ్డను అడ్డుకుంటే కోపం రాదేమిటి?

అంతేనా? షర్మిల నేరుగా అన్న జగన్‌ను ఉద్దేశించి పోలీసులతో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ‘ ఏంటి సార్ మమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా? మీ అక్రమాలిక సాగవు. కార్యకర్తల కోసం జైలుకయినా వెళతా’ అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో హాటు ఘాటుగా మారాయి. ఇక ఏపీలో కొత్త ఆట మొదలయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పోలీసుల వైఖరికి నిరసనగా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ నాయకత్వంలో కార్యకర్తలు బైఠాయించారు. దానితో కలవరపడ్డ ఖాకీలు దిగొచ్చారు. షర్మిల

కాన్యాయ్‌ను అనుమతించారు. ఈ పరిణామంతో ట్రాఫిక్ చాలాసేపు జామయింది. షర్మిల వస్తున్నారని తెలియడంతో, బెజవాడలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలిరావడం విశేషం.

అయితే తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే.. పోలీసులు ఓవరాక్షన్ చేశారన్న అనుమానాలు, కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి నుంచి ఆదేశాలు రాకపోతే, షర్మిలను ఆపే ధైర్యం పోలీసులు చేయరని నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలు, సజ్జల డైరక్షన్ ప్రకారమే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

‘‘ రాష్ట్రంలో మంత్రులు-ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు నిర్వహించే ర్యాలీలకు పోలీసుల అనుమతులు ఉన్నాయా? వాళ్లకో న్యాయం? మాకో న్యాయమా? మా పార్టీ అధ్యక్షురాలికి స్వాగతం చెప్పేందుకు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తర లివచ్చారు. దానిని ర్యాలీ అని ఎలా అంటారు? పైగా మేం పోలీసుల అనుమతి తీసుకున్నాం కూడా. పోలీసులు ఇప్పటికైనా జగన్ సర్కారు భజన మానకపోతే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు’’ అని పద్మశ్రీ హెచ్చరించారు. కాగా.. వైఎస్‌కు అసలైన వారసులొచ్చిదంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం విశేషం.

మొత్తానికి చెల్లి తొలి ఎంట్రీకి అన్న తొలి చెక్ పెడితే.. దానికి కౌంటర్‌గా అన్నయ్యకు, చెల్లి తొలి హెచ్చరిక జారీ చేసిందన్నమాట. ‘ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది.. రాజన్న బిడ్డ ఎవరికీ భయపడద’న్న షర్మిల వ్యాఖ్య.. నేరుగా అన్నయ్యకేనని, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది కదా?! అంటే ఎట్టకేలకూ ‘అన్నయ్య జగన్ నియంత‘.. అని తొలిసారి ప్రకటించారన్నమాట. సో.. ఏపీలో అన్న-చెల్లెమ్మ యుద్ధానికి తెరలేచింది. భవిష్యత్తులో ఇది ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందో రాజకీయ తెరపై చూడాలి!

LEAVE A RESPONSE